మీ రాకతో మా గ్రామానికిపండగొచ్చింది!
ABN , Publish Date - Oct 12 , 2026 | 03:48 AM
‘మీరు ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం క్షేమంగా ఉంటుంది.. మీ రాకతో మా గ్రామాలకు పండుగ వచ్చింది.. మా బతుకుల్లో వెలుగులు నిండాయి’’ అంటూ రాకోట గిరిజనులు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
రంపచోడవరం, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): ‘మీరు ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం క్షేమంగా ఉంటుంది.. మీ రాకతో మా గ్రామాలకు పండుగ వచ్చింది.. మా బతుకుల్లో వెలుగులు నిండాయి’’ అంటూ రాకోట గిరిజనులు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం ఆయన ఆ గ్రామంలో నిర్వహించిన ‘మన ఊరు-మాటామంతీ’ కార్యక్రమంలో వారు తమ సమస్యలు చెప్పుకొన్నారు. వాటి పరిష్కారానికి అధికారులకు ఆయన తక్షణ ఆదేశాలు జారీచేశారు.
మా రియల్ లైఫ్ హీరో మీరే..
గతంలో రహదారులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని, తమ సమస్యలను గుర్తించి పరిష్కరిస్తున్న పవన్ తమకు నిజజీవిత కథానాయకుడని కుర్ల కృష్ణవేణి కొనియాడారు. చీమగండి-కాకవాడ మధ్య దెబ్బతిన్న రహదారికి మరమ్మతులు చేయించాలని వేములకొండకు చెందిన మహిళ కోరగా, వెంటనే పనులు చేపట్టాలని పవన్ ఆదేశించారు. సుమారు 350మంది జనాభా ఉన్న రాకోటను రెవెన్యూ గ్రామంగా గుర్తించాలని కుర్ల బాలకృష్ణారెడ్డి కోరారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఉపముఖ్యమంత్రి సూచించారు. పాముకాటు మందు అందుబాటులో ఉంచాలని గ్రామపెద్ద సోమిరెడ్డి విజ్ఞప్తి చేయగా, యాంటీ స్నేక్ వెనం డోసులు అందుబాటులో ఉంచినట్టు ఉపముఖ్యమంత్రి తెలిపారు.
రోడ్లు పరిశీలించి.. రైతులకు భరోసా
మాటామంతీకి ముందు పవన్ గ్రామంలో పర్యటించి సీసీ రోడ్లను పరిశీలించారు. గ్రామానికి చెందిన విజయలక్ష్మితో మాట్లాడి వృత్తి, జీవన పరిస్థితులపై ఆరా తీశారు. వర్షాభావంతో పంటలు వేయలేకపోయామని తెలుపడంతో వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన విత్తనాలు అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె.దినేశ్‌కుమార్‌కు సూచించారు. గ్రామంలోని 40 మంది యువకులకు వాలీబాల్, క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు. తన కుటుంబంలో అగ్నిప్రమాద ఘటన జరిగినప్పటికీ గిరిజన గ్రామాల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తూ పర్యటన కొనసాగించడంపై గ్రామస్తులు పవన్‌కు ధన్యవాదాలు తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి...
నెల్లూరులో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
రాయలసీమ అభివృద్ధి సభలో రాజకీయాలు వద్దు: పవన్ కల్యాణ్