డేటా సెంటర్‌కు పర్యావరణ అనుమతులు ఉన్నాయి
ABN , Publish Date - Oct 06 , 2026 | 06:31 AM
సింహాచలం దేవస్థానానికి చెందిన భూములను హైపర్ స్కేల్ డేటా సెంటర్ పార్క్ లిమిటెడ్ సంస్థకు బదలాయించడంపై అభ్యంతరం తెలుపుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం (పిల్)పై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ..
పిటిషనర్ వాస్తవాలు దాచి, పిల్ వేశారు
హైకోర్టుకు నివేదించిన ఏజీ.. విచారణ నేటికి వాయిదా
డేటా సెంటర్ విషయం దాచి.. అనుమతి పొందారన్న పిటిషనర్
అమరావతి, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): సింహాచలం దేవస్థానానికి చెందిన భూములను హైపర్ స్కేల్ డేటా సెంటర్ పార్క్ లిమిటెడ్ సంస్థకు బదలాయించడంపై అభ్యంతరం తెలుపుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం (పిల్)పై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ... డేటా సెంటర్ ఏర్పాటు ప్రాంతం కంబాలకొండ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం సరిహద్దుకు 750 మీటర్లు, సీతకొండ రిజర్వ్ ఫారె్‌స్టకు 3.90 కిలోమీటర్ల దూరంలో ఉందన్నారు. అన్ని అంశాలను పరిశీలించిన తరువాతే ప్రాజెక్ట్ ఏర్పాటు కోసం ఈ ఏడాది జూన్ 10న రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా అథారిటీ పర్యావరణ అనుమతులు మంజూరు చేసిందని చెప్పారు. ఆ తర్వాత జూన్ 19న పిటిషనర్ పిల్ దాఖలు చేశారని, సంబంధిత అనుమతులను సవాల్ చేయలేదన్నారు.
పర్యావరణ అనుమతులను వీఎస్ కృష్ణ అనే వ్యక్తి ఎన్‌జీటీలో సవాల్ చేశారన్నారు. పిటిషనర్ వాస్తవాలు వెల్లడించకుండా పిల్ వేశారన్నారు. ఈ వాదనల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం... పిటిషనర్ వేసిన రిప్లై కౌంటర్ కోర్టు రికార్డుల్లోకి చేరకపోవడంతో విచారణను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈమేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసాగిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. పర్యావరణ పరిరక్షణ చట్టాలను ఉల్లంఘిస్తూ విశాఖపట్నం రూరల్ మండలం అడవివరం, ముడసర్లోవ గ్రామాల పరిధిలోని 160 ఎకరాల దేవదాయ భూమిని హైపర్ స్కేల్ డేటా సెంటర్ పార్క్‌కు కేటాయించడాన్ని చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరుతూ జల్ బిరాదరి జాతీయ కన్వీనర్ విశాఖకు చెందిన బొలిశెట్టి సత్యనారాయణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ పిల్ సోమవారం విచారణకు వచ్చింది.
ఈ వార్తలనూ చదవండి:
ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం.. ఉద్యోగుల శిక్షణపై సీఎం స్పెషల్ ఫోకస్
ఏపీలో నాలుగు కొత్త పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం