మురసు అలజడి
ABN , Publish Date - Nov 03 , 2026 | 03:51 AM
మరో తుఫాను కల్లోలం రేపుతోంది. ‘మురసు’ ప్రభావంతో సముద్రంలో అలలు ఎగసిపడుతున్నాయి. తీరాల్లో పెనుగాలులు హోరెత్తుతున్నాయి. దీంతో దక్షిణ కోస్తా తీరంలో హై అలెర్ట్ ప్రకటించారు.
ఎగసిపడుతున్న అలలు
ముందుకొచ్చిన సంద్రం.. పెను గాలులు
దక్షిణ కోస్తా తీరంలో హై అలెర్ట్
ఒంగోలు సమీపానికి తీవ్ర తుఫాన్
అర్ధరాత్రి తర్వాత తీరం దాటే ప్రక్రియ మొదలు
ఆ సమయంలో 125 కి.మీ. వేగంతో పెనుగాలులు
బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు
రాయలసీమలోనూ దట్టంగా ముసురు.. జల్లులు
నిజాంపట్నంలో 10, బందరులో 9, కృష్ణపట్నంలో ఎనిమిదో నంబరు తుఫాన్ హెచ్చరిక జారీ
రోజంతా ఆర్టీజీఎస్‌లోనే గడిపిన ముఖ్యమంత్రి
దఫదఫాలుగా అధికారులు, కలెక్టర్లతో సమీక్షలు
ప్రభావిత జిల్లాల్లో నేడు పాఠశాలలకు సెలవు
గన్నవరం, భోగాపురంలో విమాన సర్వీసులు రద్దు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): మరో తుఫాను కల్లోలం రేపుతోంది. ‘మురసు’ ప్రభావంతో సముద్రంలో అలలు ఎగసిపడుతున్నాయి. తీరాల్లో పెనుగాలులు హోరెత్తుతున్నాయి. దీంతో దక్షిణ కోస్తా తీరంలో హై అలెర్ట్ ప్రకటించారు. సోమవారం సాయంత్రానికి ఒంగోలుకు చేరువగా తీవ్ర తుఫాన్ వచ్చింది. ఒంగోలుకు దక్షిణ భాగంలో తుఫాన్ తీరం దాటే ప్రక్రియ మొదలై మంగళవారం తెల్లవారుజాము కల్లా పూర్తయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. తుఫాన్ తీరం దాటే సమయంలో ప్రకాశం, బాపట్ల, నెల్లూరు జిల్లాల తీర ప్రాంతాల్లో గంటకు 100 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీయనున్నాయి. ఆ సమయంలో అంతెత్తున రాకాసి అలలు ఎగసిపడనున్నాయి. తుఫాను ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ముసురు పట్టింది.
మధ్యాహ్నం నుంచి చిరు జల్లులు మొదలయ్యాయి. ఈదురుగాలులు పెరిగాయి. దీంతో ప్రభావిత జిల్లాల కలెక్టర్లతోపాటు మొత్తం అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. సీఎం చంద్రబాబు రోజంతా ‘తుఫాను’ గతి విధులపై దఫదఫాలుగా సమీక్షలు జరిపారు ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది దాకా సిద్ధం చేశారు. తుఫాను నిర్వహణ, వరద నీటి సమర్థ వినియోగం, సహాయక చర్యలపై స్పష్టమైన ఆదేశాలు ఇస్తూ సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలోనే ఆయన గడిపారు. రాబోయే 48 గంటల్లో చోటుచేసుకునే పరిణామాలను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేశారు.
ముందుకొచ్చిన సముద్రం
బాపట్ల నుంచి నెల్లూరు, తిరుపతి, చిత్తూరు వరకు తుఫాను ప్రభావంతో అతి భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీనివల్ల పలు జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుఫాన్ ప్రభావం నెల్లూరు జిల్లాపై కనిపించడం మొదలైంది. జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. మధ్యాహ్నం తర్వాత ఈదురు గాలుల ప్రభావం కూడా పెరిగింది. సముద్రం అల్లకల్లోలంగా మారి, అలలు ఎగసి పడుతున్నాయి. కృష్ణపట్నం పోర్టులో 8వ నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులకు కలెక్టర్ హిమాన్షు శుక్లా సెలవులు రద్దు చేశారు.
ఇక.. బాపట్ల జిల్లాకు వాతావరణ శాఖ రెడ్‌అలర్ట్ జారీ చేసింది. నిజాంపట్నం హార్బర్‌లో పదో నంబరు ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. నిజాంపట్నంతోపాటు సూర్యలంక, రామాపురం, వాడరేవు తీరాల్లోని బోట్లను ఇప్పటికే ఒడ్డుకు చేర్చడంతో పాటు మత్స్యకారులను అధికారులు అప్రమత్తం చేశారు. మురసు ప్రభావంతో సూర్యలంక తీరంలో నీళ్లు ముందుకు చొచ్చుకొచ్చాయి. అక్కడ ఉన్న పోలీస్ అవుట్‌పోస్టును అలలు తాకాయి. రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. కాగా, మచిలీపట్నంలో తొమ్మిదో నంబరు, మిగిలిన ప్రధాన రేవుల్లో మూడో నంబరు హెచ్చరిక ఎగురవేశారు.
తీరంలో టెన్షన్..
బాపట్ల జిల్లా చీరాల మండలం ఓడరేవు గ్రామానికి చెందిన ఏడుగురు మత్సకారులు సముద్రంలో వేటకు వెళ్లి తిరిగి వస్తున్న వస్తుండగా వారి బోటు ఇంజన్ ఫెయిల్ అవడంతో సముద్రంలో చిక్కుకుపోయింది. ఈ బోటును బోగోలు మండలం (నెల్లూరు జిల్లా) జువ్వలదిన్నె హార్బర్ అధికారులు గుర్తించారు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించి చిక్కుకున్న బోటుతోపాటు అందులోని ఏడుగురు మత్స్యకారులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. కాగా, సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు తిరుగు ప్రయాణంలో ఇంజన్ గేర్ బాక్స్ మరమ్మతుకు గురవ్వడంతో రుషికొండ తీరానికి కొట్టుకు వచ్చింది.
వాడచీపురుపల్లికి చెందిన నరసింగరావు, ఆరుగురితో కలిసి అక్టోబరు 30న చేపల వేటకు వెళ్లారు. వేట ముగించుకొని సోమవారం రాత్రి తిరిగి వస్తుండగా రుషికొండ దగ్గరలో ఇంజన్‌లో గేర్ బాక్స్ పాడైపోయింది. లంగరు వేయడానికి యత్నించగా, బోటు తీరం వైపు కొట్టుకువచ్చింది. సోమవారం తెల్లవారుజాము వరకు అందులో ఉండి ఉదయాన్నే ఆరుగురూ ఏపీ మరపడవల సంఘానికి, అధికారులకు సమాచారం ఇచ్చారు. మత్స్యకార శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మురళీ, సంఘం అధ్యక్షులు లక్ష్మణరావు, సెక్రటరీ బాలాజీ కలిసి వెళ్లి బోటును పరిశీలించారు. అలల తాకిడికి బోటు హల్ పాడైపోయి బాగా నష్టం జరిగిందని, ప్రభుత్వానికి నివేదిక పంపుతామని తెలిపారు.
ఆందోళనలో రైతులు..
మురసు తుఫాను హెచ్చరికలు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈసారి కూడా వరి ముంపు బారిన పడితే తాము కోలుకోవడం కష్టమని వాపోతున్నారు. మురసు తుఫాను ప్రకాశం జిల్లాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. సోమవారం మధ్యాహ్నం నుంచి ఈదురుగాలులు మొదలయ్యాయి. మత్స్యకారులను సముద్రంలో వేటకు వెళ్లకుండా యంత్రాంగం నిలిపివేశారు. జిల్లాకు చెందిన మంత్రి స్వామి తీరప్రాంతంలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. స్పెషల్ ఆఫీసర్ రంజిత్‌బాష సోమవారం రాత్రి ఒంగోలు చేరుకుని కలెక్టర్ ఇతర జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. మరోవైపు, శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన భక్తులు తుఫాన్ కారణంగా ఇబ్బందులు పడ్డారు. తిరుమలలో వర్షపు జల్లులు పడ్డాయి. దీంతో ఘాట్‌రోడ్లలో వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కొన్నా రు. అన్నప్రసాద పంపిణీకి అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేపట్టినట్టు అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు.
విమాన సర్వీసులు రద్దు
తుఫాను కారణంగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మంగళవారం వెళ్లాల్సిన పలు విమానాల ను రద్దు చేసినట్లు విమానాశ్రయ డైరెక్టర్ లక్ష్మీకాంతరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఫ్లైట్ 91, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఇండిగో, ఎయిరిండియా విమానాలను రద్దు చేసినట్లు ప్రకటించారు. కాగా, తుఫాన్ కారణంగా గాలులతో కూడిన వర్షం పడడంతో సోమవారం ఉదయం భోగాపురం నుంచి బయలుదేరాల్సిన విమాన సర్వీసులు రద్దయ్యాయి.
పాఠశాలలకు సెలవు
తుఫాను నేపథ్యంలో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. నెల్లూరు, బాపట్ల, ప్రకాశం, గుంటూరు, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ఇచ్చారు.
గాలుల వల్లే నష్టం ఎక్కువ : ఐఎండీ నాగరత్న
మురసు తుఫాన్ కారణంగా గంటకు 100 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే ప్రమాదముందని ఐఎండీ అమరావతి డైరెక్టర్ కె.నాగరత్న తెలిపారు. సోమవారం అర్ధరాత్రి 12 నుంచి మంగళవారం తెల్లవారుజాము 4 గంటల మధ్య తుఫాన్ తీరం దాటే అవకాశముందని ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు. కావలి సమీపంలో తీరందాటే అవకాశముందన్నారు. గాలులు వ్యతిరేక దిశల్లో వీచే అవకాశమున్నందున ఎత్తయిన భవనాలు, చెట్లు, టవర్లు దెబ్బతినే ప్రమాదముందని తెలిపారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలోని సముద్రతీర ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని నాగరత్న వెల్లడించారు. వర్షాల కంటే బలమైన గాలుల వల్లే ఎక్కు వ నష్టం జరిగే ప్రమాదముందని హెచ్చరించారు.
బలపడుతున్న ‘ప్రమాదం’
తీవ్ర తుఫాన్ పశ్చిమ మధ్య, నైరుతి బంగాళాఖాతంలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు సగటున గంటకు 15 నుంచి 18 కిలోమీటర్ల వేగంతో పయనించింది. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు 29 నుంచి 30 డిగ్రీల వరకు నమోదుకావడం తుఫాన్ బలపడేందుకు దోహదం చేసింది. అయితే కాకినాడ పరిసరాల్లో రిడ్జ్(అధిక పీడనం) కొనసాగడంతో పశ్చిమ వాయువ్యంగా పయనించే తుఫాన్ తీరం దగ్గరకు వచ్చేసరికి వాయువ్యంగా దిశ మార్చుకుంది. మురసు తుఫాన్ గడిచిన 6గంటల్లో గంటకు 10కిలోమీటర్ల వేగంతో కదులుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సోమవారం రాత్రి 10.30 గంటల సమయానికి కావలికి 60, ఒంగోలుకు 80, నెల్లూరుకు 90, బాపట్లకు 110, మచిలీపట్నానికి 150 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ ఉందని తెలిపింది.
ఈ వార్తలనూ చదవండి:
త్వరితగతిన రాష్ట్రానికి సాయం అందించండి.. కేంద్రానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
ఏపీ లిక్కర్ స్కామ్.. ఈడీ కస్టడీలో నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి