Share News

నేడు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు

ABN , Publish Date - Nov 20 , 2026 | 01:01 AM

తీవ్ర తుఫాన్‌ ‘అక్వాన్‌’ ముప్పు ఇంకా కొనసాగుతోంది. ఇది కోస్తాకు సమాంతరంగా పయనిస్తూ దక్షిణ ఒడిశా వైపు వెళ్లనుండడంతో...

నేడు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు

  • ఒడిసా వైపు తీవ్ర తుఫాన్‌ పయనం.. తీరం దాటే సమయంలో పెరగనున్న గాలుల తీవ్రత

  • శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ

  • నేడు గోపాల్‌పూర్‌ వద్ద తీరం దాటనున్న అక్వాన్‌

విశాఖపట్నం, అమరావతి, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): తీవ్ర తుఫాన్‌ ‘అక్వాన్‌’ ముప్పు ఇంకా కొనసాగుతోంది. ఇది కోస్తాకు సమాంతరంగా పయనిస్తూ దక్షిణ ఒడిశా వైపు వెళ్లనుండడంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీవర్షాలు కురవనున్నాయి. పెనుగాలులు వీయనున్నాయి. ఒడిసా సరిహద్దులో ఉన్న శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. శుక్రవారం మధ్యాహ్నం వరకు అక్కడక్కడ కుంభవృష్టి కురుస్తుందని, తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని తెలిపింది.

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర తుఫాన్‌ గురువారం ఉదయం నుంచి సగటున గంటకు 15 నుంచి 17 కి.మీ. వేగంతో పయనిస్తూ సాయంత్రానికి నరసాపురానికి తూర్పున 380, కళింగపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 270 కి.మీ., గోపాలపూర్‌కు దక్షిణంగా 350 కి.మీ.దూరంలో కేంద్రీకృతమై ఉంది. ప్రస్తుతం ఉత్తర వాయవ్యంగా పయనిస్తోందని, శుక్రవారం ఉదయానికి ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా సరిహద్దుల్లోని గోపాల్‌పూర్‌కు తూర్పున తీరం దాటుతుందని ఐఎండీ తెలిపింది.

తీరం దాటేటప్పుడు తుఫాన్‌గా బలహీనపడుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో గురువారం ఉదయం నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. చల్లని గాలులు వీస్తున్నాయి. చిరుజల్లులు పడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఒక మోస్తరుగా వర్షాలు కురిశాయి. తీరం వెంబడి గంటకు 60 నుంచి 70 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయి. ఉత్తరాంధ్రకు మరింత చేరువగా రానున్నందున గాలుల వేగం 90 నుంచి 110 కి.మీ.కు పెరుగుతుందని ఐఎండీ తెలిపింది.

ఈ వార్తలనూ చదవండి:

ఏపీ తీరానికి అక్వాన్ తుపాను ముప్పు.. గోపాల్‌పూర్ సమీపంలో తీరం దాటే అవకాశం: ఏపీఎస్‌డీఎంఏ

బాలకృష్ణకు విశిష్ట పురస్కారం.. రేవంత్ సర్కార్ నుంచి అరుదైన గౌరవం


శుక్రవారం మధ్యాహ్నం వరకు గాలుల వేగం కొనసాగుతుందని పేర్కొంది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో అక్కడక్కడ కుంభవృష్టి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అతిభారీ, కోనసీమ, గోదావరి జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని తెలిపింది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో అతిభారీ, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీవర్షాలు, మిగిలిన ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒక మోస్తరుగా వర్షాలు కురుస్తాయి.

కోస్తాలో మూలపేట, కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, రవ్వ, మచిలీపట్నం పోర్టుల్లో మూడో నంబరు, మిగిలిన పోర్టులలో రెండోనంబరు భద్రతా సూచికలు ఎగురవేశారు. మత్స్యకారులు శనివారం వరకు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. శుక్రవారం ఉత్తరాంధ్ర ప్రాంతంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.

శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. తుఫాన్‌ తీరం దాటే సమయంలో భారీ వర్షాలు, ఈదురుగాలులు ఉండే అవకాశం ఉన్నందున ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఈ వార్తలనూ చదవండి:

ఏపీ తీరానికి అక్వాన్ తుపాను ముప్పు.. గోపాల్‌పూర్ సమీపంలో తీరం దాటే అవకాశం: ఏపీఎస్‌డీఎంఏ

బాలకృష్ణకు విశిష్ట పురస్కారం.. రేవంత్ సర్కార్ నుంచి అరుదైన గౌరవం

Updated Date - Nov 20 , 2026 | 01:13 AM