Share News

కంటెయినర్లు వెనక్కి!

ABN , Publish Date - Mar 08 , 2026 | 04:15 AM

పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర యుద్ధం నేపథ్యంలో హొర్ముజ్‌ జలసంధిలో సంక్షోభం నెలకొంది. దీంతో సరకులతో వెళ్లిన నౌకలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. ప్రస్తుత పరిస్థితుల్లో...

కంటెయినర్లు వెనక్కి!

  • విశాఖ పోర్టు చరిత్రలో ఇదే తొలిసారి

విశాఖపట్నం, మార్చి 7(ఆంధ్రజ్యోతి): పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర యుద్ధం నేపథ్యంలో హొర్ముజ్‌ జలసంధిలో సంక్షోభం నెలకొంది. దీంతో సరకులతో వెళ్లిన నౌకలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అవి గమ్యస్థానం చేరే అవకాశం లేకపోవడంతో వాటిని వెనక్కి రప్పించేందుకు కంటెయినర్‌ టెర్మినళ్ల అధికారులు ప్రయత్నిస్తున్నారు. విశాఖలోని కంటెయినర్‌ టెర్మినల్‌ అధికారులు సుమారు పది వేల కంటెయినర్లు వెనక్కి వస్తాయని అంచనా వేశారు. ఈ క్రమంలో ఆయా కంటెయినర్లను ఉంచేందుకు 16 వేల చదరపు మీటర్ల స్థలాన్ని తక్షణమే కేటాయించాలని విశాఖపట్నం పోర్టుకు లేఖ రాశారు. ఒకసారి సరకులతో వెళ్లిన కంటెయినర్లు మళ్లీ పోర్టుకు వెనక్కి రావడం విశాఖ పోర్టు చరిత్రలో ఇదే ప్రథమమని అధికారులు తెలిపారు. ఇలాంటి కంటెయినర్లను ఎలా హ్యాండిల్‌ చేయాలనే దానిపై ఇప్పటికిప్పుడు కస్టమ్స్‌ అధికారులు కొత్త నిబంధనలు తయారు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ నేపథ్యంలో ఎగుమతి, దిగుమతిదారులు, టెర్మినల్‌ నిర్వాహకులతో కస్టమ్స్‌ చీఫ్‌ కమిషనర్‌ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కంటెయినర్లలో ఏయే సరుకులు ఉన్నాయి?, వెనక్కి వచ్చాక వాటిని పోర్టులోనే ఉంచుతారా?, తిరిగి గొడౌన్లకు తరలిస్తారా?.. అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. విశాఖ నుంచి ఎక్కువగా సీఫుడ్స్‌, ఫార్మా, జీడిపప్పు ఎగుమతి అవుతాయి. ఈ కంటెయినర్లను పోర్టులో ఎక్కువ రోజులు ఉంచడానికి తగిన ఏర్పాట్లు లేవు. వాటికి నిరంతర విద్యుత్‌ సరఫరా ఉండాలి. రోజుకు ఒక్కొక్క కంటెయినర్‌కు రూ.5 వేల వరకు విద్యుత్‌ బిల్లు అవుతుందన్న అంచనా ఉంది. వాటిని ఎక్కువ రోజులు ఉంచితే వచ్చే లాభం కంటే విద్యుత్‌ బిల్లు ఖర్చే ఎక్కువ అవుతుందని అధికారులు లెక్కగట్టారు. .

ఇవి కూడా చదవండి..

ఇకపై దాడులు చేయం... గల్ఫ్ దేశాలకు సారీ చెప్పిన ఇరాన్ అధ్యక్షుడు

ఇరాన్ బేషరతుగా లొంగిపోవాల్సిందే.. ట్రంప్ స్పష్టీకరణ

Updated Date - Mar 08 , 2026 | 04:15 AM