ప్రారంభించిన ప్రాజెక్టుల స్థితిగతులేంటి?
ABN , Publish Date - Sep 29 , 2026 | 04:18 AM
కూటమి ప్రభుత్వం వచ్చాక పనులు పూర్తిచేసి ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టుల స్థితిగతులేమిటో సీఎం చంద్రబాబు ఆరా తీయనున్నారు. 2028 నాటికి పూర్తి చేయాలని నిర్దేశించుకు న్న 36 ప్రాధాన్య ప్రాజెక్టుల పనులు ఎక్కడి వరకు వచ్చాయో ఆయన సమీక్షించనున్నారు.
రేపు జలవనరుల శాఖపై సీఎం సమగ్ర సమీక్ష
అమరావతి, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం వచ్చాక పనులు పూర్తిచేసి ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టుల స్థితిగతులేమిటో సీఎం చంద్రబాబు ఆరా తీయనున్నారు. 2028 నాటికి పూర్తి చేయాలని నిర్దేశించుకు న్న 36 ప్రాధాన్య ప్రాజెక్టుల పనులు ఎక్కడి వరకు వచ్చాయో ఆయన సమీక్షించనున్నారు. బుధవారం(30న) జల వనరుల శాఖపై సమగ్ర సమీక్షకు సిద్ధం కావాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్‌ను ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) ఆదేశించింది. కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో హంద్రీ-నీవా విస్తరణ, వెలిగొండ తొలిదశ పనులను పూర్తిచేసింది. సీఎం వాటిని ప్రారంభించి నీరుకూడా విడుదల చేశారు. అలాగే పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను అనకాపల్లి దాకా తరలించారు. అయితే ఈ మధ్యలోను, మేఘాద్రిగెడ్డకు నీటి తరలింపులోను సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి.
వాటి పరిష్కారానికి జలవనరుల శాఖ చేస్తున్న ప్రయత్నాలు, శాశ్వతంగా పరిష్కరించడంపై బుధవారం నాటి సమీక్షలో చర్చించనున్నారు. ఎల్‌నినో ప్రభావం రాయలసీమపై కనిపించకుండా చెరువులన్నింటినీ నీటితో నింపారు. దీంతో కరువు ఛాయలు నెలకొన్నా తాగునీటి సమస్య తలెత్తకుండా జల వనరుల శాఖ ప్రణాళికలు అమలు చేసింది. రాయలసీమలో ఉద్యాన పంటలను ప్రోత్సహించేలా రూ.లక్ష కోట్ల వ్యయంతో హార్టికల్చర్ హబ్‌కు ప్రణాళికలను పంచాయతీరాజ్, ఉద్యానవన శాఖలతో కలసి జల వనరుల శాఖ సిద్ధం చేసింది. ఈ కార్యక్రమాన్ని వచ్చేనెల రెండో తేదీన గాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. దీంతో బుధవారంనాటి సమావేశం కీలకం కానుంది.
ఈ వార్తలనూ చదవండి...
పింఛనుదారులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 1న ఉదయం 6:30 నుంచే పింఛన్ల పంపిణీ
పీఎం కిసాన్ 24వ విడత.. రైతులు ఈ 3 పనులు పూర్తి చేయాల్సిందే..