Share News

ఇలాగైతే ఇన్వెస్టర్లకు భరోసా ఉంటుందా?

ABN , Publish Date - Sep 11 , 2026 | 03:36 AM

పరిశ్రమలకు భూ కేటాయింపుల్లో కలెక్టర్లు జాప్యం చేయడంపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఇలాగైతే ఇన్వెస్టర్లకు భరోసా ఉంటుందా అని ప్రశ్నించారు. దేశాలన్నీ తిరిగి పారిశ్రామికవేత్తలను మెప్పించి రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తుంటే..

ఇలాగైతే ఇన్వెస్టర్లకు భరోసా ఉంటుందా?
Chandrababu Naidu

  • దేశాలన్నీ తిరిగి పెట్టుబడులు తెస్తుంటే..

  • భూములు అప్పగించకపోతే ఎలా?

  • ఎస్‌ఐపీబీ ఆమోదించిన పరిశ్రమల సత్వర గ్రౌండింగ్‌పై దృష్టి పెట్టాలని నిర్దేశం

  • కలెక్టర్లపై చంద్రబాబు ఆగ్రహం

అమరావతి, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): పరిశ్రమలకు భూ కేటాయింపుల్లో కలెక్టర్లు జాప్యం చేయడంపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఇలాగైతే ఇన్వెస్టర్లకు భరోసా ఉంటుందా అని ప్రశ్నించారు. దేశాలన్నీ తిరిగి పారిశ్రామికవేత్తలను మెప్పించి రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తుంటే.. భూములు అప్పగించకపోతే ఎలాగని నిలదీశారు. గురువారం కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో పెట్టుబడులన్నీ ఉత్పత్తి దశకు చేరడంపైనా, ప్లాంట్లు స్థాపనపైనా చర్చ జరిగింది.


భూకేటాయింపులపై కలెక్టర్లు జాప్యం చేస్తున్నారని పరిశ్రమలశాఖ కార్యదర్శి యువరాజ్‌ నివేదిక ఇచ్చారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్‌ఐపీబీ)లో ఆమోదం పొందిన పరిశ్రమలను వేగంగా గ్రౌండ్‌ చేయడంపై దృష్టి పెట్టాలని వారిని ఆదేశించారు. పరిశ్రమలను గ్రౌండ్‌ చేసి ప్రారంభించే తేదీలను కూడా ఖరారు చేయాలని స్పష్టం చేశారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా ఈ విషయంలో చొరవ తీసుకోవాలని.. జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.


వచ్చే నవంబరులో భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తున్నామని.. ఆనాటికి పరిశ్రమల గ్రౌండింగ్‌పై మరింత స్పష్టత రావాలన్నారు. పెట్టుబడుల సదస్సులో భాగంగా విశాఖ, కాకినాడ, అమరావతి, అనంతపురం, తిరుపతిల్లో సదస్సులు నిర్వహిస్తామన్నారు. వివిధ రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణకు అక్టోబరులో ప్రాంతీయ కాన్ఫరెన్సులు నిర్వహిస్తామన్నారు. ఏఐ టాస్క్‌ఫోర్స్‌ కలిగిన మొదటి రాష్ట్రం మనదేనన్నారు. జిల్లా మంత్రులు, కలెక్టర్లకు జిల్లాల వృద్ధి సమాచారం ఇవ్వాలని ఆర్టీజీఎ్‌సను ఆదేశించారు. సీఎం ఇంకా ఏం చెప్పారంటే...


138 ఎంఎస్ఎంఈ పార్కులు..

రాష్ట్రంలో తయారీ, సేవలు, వాణిజ్య రంగంలో ప్రస్తుతం 23.85 లక్షల ఎంఎ్‌సఎంఈలు ఉన్నాయి. 175 ఎంఎస్ఎంఈ పార్కుల్లో ఇప్పటికే 138 పార్కులకు ఆమోదం లభించింది. 22 ప్రారంభమయ్యాయి.. మిగతా 116 పార్కులు నిర్మాణంలో ఉన్నాయి. వీటి ద్వారా రూ.2,036 కోట్ల పెట్టుబడులు, 31,163 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న హెలిప్యాడ్లను నోటిఫై చేయాలి. వాటిని పర్యాటక రంగంతో అనుసంధానిద్దాం. జిల్లా కేంద్రాల్లో రాత్రిపూట హెలికాప్టర్లు దిగే సౌకర్యం ఉండే హెలిప్యాడ్లను ఏర్పాటు చేసేలా కేంద్రం నుంచి అనుమతులు తీసుకోవాలి. ఆర్వోబీ, ఆర్‌యూబీల నిర్మాణానికి కార్యాచరణ ప్రణాళిక తయారుచేయాలి. జీఎస్డీపీ లక్ష్యాలను చేరుకునేలా జిల్లాల్లోని అవకాశాలను అన్‌లాక్‌ చేయాలి. జిల్లాల్లోని వనరులను మార్కెటింగ్‌ చేసుకుని సంపద సృష్టించాలి.


అక్టోబరు నాటికి ప్రాజెక్టుల గ్రౌండింగ్‌ లక్ష్యం

ఇప్పటివరకు కుదిరిన ఎంవోయూల్లో కనీసం 80 శాతం వచ్చే నెల చివరి నాటికి సాకారమయ్యేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు కార్యదర్శి యువరాజ్‌ చెప్పారు. మొత్తం 463 ఎంవోయూల్లో 198 ఇప్పటికే అమలు కాగా.. మరో 172 వేగంగా అమలు చేయాల్సి ఉందన్నారు. ఎస్‌ఐపీబీ ఆమోదించిన ప్రాజెక్టుల్లో అక్టోబరు చివరి నాటికి కనీసం 75 శాతం గ్రౌండింగ్‌ సాధించాలన్నారు. 2024 జూన్‌ 1 నుంచి పరిశ్రమల అవసరాల కోసం 88,678 ఎకరాల్ని కోరగా.. 22,533 ఎకరాలే స్వాధీనంలోకి వచ్చాయన్నారు. 30,223 ఎకరాల ప్రభుత్వ భూముల అడిగితే.. 12,754 ఎకరాలు మాత్రమే ఏపీఐఐసీకి అప్పగించారని.. ఇంకా 17,469 ఎకరాలు రావాలని తెలిపారు.భూముల అప్పగింతలో మార్కాపురం, అనంతపురం, కడప, పల్నాడు, శ్రీసత్యసాయి తదితర జిల్లాలు మెరుగైన పనితీరు కనబరుస్తున్నాయన్నారు.


వృద్ధిరేటు అంచనా 13.44 శాతం

  • 2022-23 ఆర్థిక సంవత్సరాన్ని బేస్‌ ఇయర్‌గా కేంద్ర గణాంక శాఖ నిర్దేశించింది. ప్రస్తుత ధరల మేరకు 2026-27 వృద్ధిరేటు అంచనా 13.44 శాతం.

  • వ్యవసాయ అనుబంధ రంగాల గ్రాస్‌ వాల్యూ యాడెడ్‌ (జీవీఏ) వృద్ధి రేటు 2026-27 మొదటి క్వార్టర్లో 14.19 శాతానికి పెరిగింది.

  • పరిశ్రమల రంగంలో 14.81 శాతం, సేవల రంగంలో 12.70 శాతంగా నమోదైంది.

  • ఆక్వా రంగంలో 6.61 లక్షల మెట్రిక్‌ టన్నులతో 31.77 శాతం మేర వృద్ధి ఉంది.

  • విద్యుదుత్పత్తి 24,248 మిలియన్‌ యూనిట్ల నుంచి 28,664 మిలియన్‌ యూనిట్లకు పెరిగింది. కరెంటు వినియోగం 14.28 శాతం పెరిగింది.

  • పారిశ్రామిక ఉత్పత్తిలో మొదటి క్వార్టర్లో రూ.1,13,638 కోట్ల జీవీఏ నమోదైంది.

  • సేవల రంగంలో 2026-27 మొదటి తైమ్రాసికానికి రూ.1.60,107 కోట్ల జీవీఏ నమోదైంది.

  • జీఎస్టీ ఆదాయంలోనూ 18 శాతం మేర పెరుగుదల ఉంది.


20 ఎస్‌ఐబీపీ సమావేశాల్లో 359 ప్రాజెక్టులకు అనుమతులిచ్చాం. వీటితో రూ.13.85 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు, 10.60 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశముంది. వీటిలో ఇప్పటికే రూ.4.03 లక్షల కోట్ల పెట్టుబడులతో 160 ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. 5.9 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి.

- ముఖ్యమంత్రి చంద్రబాబు

Updated Date - Sep 11 , 2026 | 03:38 AM