ఉద్యమంలా పేదలకు ఇళ్ల పట్టాలు
ABN , Publish Date - Oct 12 , 2026 | 03:52 AM
‘పేదల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. పేదలు ఎవరిపైనా ఆధారపడకుండా స్వేచ్ఛగా, గౌరవప్రదంగా బతకాలనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం ఇళ్ల పట్టాలు అందచేస్తోంది.
భద్రత, ఆత్మగౌరవంతో బతకాలనేదే లక్ష్యం: సీఎం
ఇళ్ల పట్టాల రూపంలో వేల కోట్ల ఆస్తి
పథకాల్లో ఎక్కడా రాజీ పడేది లేదు
నెల్లూరులో 939 మందికి సొంతింటి కల సాకారం
పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్న సీఎం చంద్రబాబు
స్థానిక ఎన్నికల్లో నిజాయతీపరులను గెలిపించాలని ప్రజలకు పిలుపు
నెల్లూరు(విద్య), అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి) ‘పేదల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. పేదలు ఎవరిపైనా ఆధారపడకుండా స్వేచ్ఛగా, గౌరవప్రదంగా బతకాలనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం ఇళ్ల పట్టాలు అందచేస్తోంది. ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా చేపడుతున్నాం’ అని సీఎం చంద్రబాబు అన్నారు. నెల్లూరు నగరంలోని పూలే విగ్రహం కూడలి వద్ద సర్వేపల్లి కాలువకట్ట ప్రాంత నివాస ప్రజలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ఆదివారం అమరావతిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ స్థలంలో దశాబ్దాలుగా ఇళ్లు నిర్మించుకుని ఉంటున్న వారికి భద్రత కల్పించడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రాన్ని పునర్ నిర్మిస్తామని ఎన్నికల ముందు ప్రధాని మోదీ, తాను, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హామీ ఇచ్చామని.. దాన్ని ఈ 28 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో నిరూపించడంతో పాటు సంక్షేమం, అభివృద్ధితో సుపరిపాలనకు నాంది పలికామన్నారు. ఇందులో భాగంగానే పేదలకు శాశ్వత ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టామన్నారు.
600 కోట్ల విలువైన ఆస్తుల పంపిణీ
‘‘నెల్లూరులో రూ.600 కోట్ల విలువైన ఆస్తిపై పేదలకు శాశ్వత హక్కులు కల్పిస్తూ పట్టాలు పంపిణీ చేశాం. 22.31 ఎకరాల్లో 939 మంది లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వగా.. వీరిలో 701 మంది మహిళలు ఉన్నారు. ఇది మహిళాసాధికారతలో భాగమే. వచ్చే సంక్రాంతి నాటికి నెల్లూరు నగరంలో మరో 4 వేల పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలిస్తాం. రాష్ట్రంలో ఒక ఉద్యమంలా పేదలకు శాశ్వత ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. నెల్లూరు, విజయవాడ, మంగళగిరిలో 60 వేల కుటుంబాలకు రూ.52 వేల కోట్ల విలువైన ఆస్తిని ఇళ్ల పట్టాల రూపంలో అందచేశాం. ప్రజలకు భద్రత, ఆత్మగౌరవం, ఒక ఆస్తి సమకూరాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. వీటితో పాటు రూ.30 వేల కోట్లు ఖర్చు చేసి రాష్ట్రంలో ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇస్తున్నాం.. పట్టణాలు, గ్రామాల్లో మౌలిక వసతుల కోసం సుమారు రూ.1.80 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాం. సంక్షేమ పథకాల్లో ఎక్కడా రాజీ పడేది లేదు. సామాజిక పింఛన్ల కోసం ప్రతినెలా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. అలాగే ఎంత మంది పిల్లలు ఉన్నా అంత మందికి తల్లికి వందనం పథకాన్ని అందిస్తున్నాం, స్ర్తీశక్తి ఉచిత ప్రయాణ పథకం కింద ఇప్పటికే 100 కోట్ల ప్రయాణాలను మహిళలను ఉపయోగించుకోవడం ఆనందంగా ఉంది. దీపం-2 పథకం కింద నేరుగా బ్యాంకు ఖాతాలకే సబ్సిడీ డబ్బులు జమ చేస్తున్నాం. విద్యుత్ చార్జీలు ఒక్క రూపాయి పెంచలేదు. ప్రతి ఇంటికీ సోలార్ రూఫ్‌టాప్ విద్యుత్ ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహిస్తున్నాం’’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ప్రజారోగ్యం కోసం ‘సంజీవని’
‘‘ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు రాష్ట్రమంతా ‘సంజీవని’ కార్యక్రమాన్ని అమలు చేశాం. అన్నదాత సుఖీభవ, నేతన్న సేవలో, మృత్య్సకారుల సేవలో, ఆటో డ్రైవర్ సేవలో వంటి పథకాలను లబ్ధిదారులకు అందజేస్తున్నాం. గీత కార్మికులకు ఎక్సైజ్ షాపులు, వడ్డెరలకు మైనింగ్ లీజులు ఇచ్చాం. ఇకపోతే ప్రకాశం జిల్లాలో ఇటీవల గర్భకండ్రిక భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాం’’ అని తెలిపారు.
గత ఎన్నికల్లో మీరు వేసిన ఓటుకు ఫలితం
‘‘వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ట్రిపుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది. ఈ సారి మునిసిపల్ ఎన్నికల్లో మేయర్, చైర్మన్‌లను నేరుగా ఎన్నుకునే విధానాన్ని తీసుకువచ్చాం. ప్రజలంతా మాకు అండగా ఉండి నీతి, నిజాయితీ, నిస్వార్ధంగా పనిచేసే నాయకులను గెలిపించాలి. గత ఎన్నికల్లో మీరు వేసిన ఓటు ప్రతి ఒక్కరి జీవితంలో, కుటుంబాల్లో మార్పులు తీసుకువచ్చింది. నేను నాలుగోసారి ముఖ్యమంత్రిగా గతంలో కంటే రెట్టించిన ఉత్సాహంతో, వేగంతో పనిచేస్తున్నాను. గొడ్డలి పార్టీ హయాంలో డబ్బులు ఇవ్వనిదే పట్టాలు చేతికి వచ్చేవి కాదు. మేము మాత్రం పట్టుచీర, పసుపు, కుంకుమలతో పారదర్శకంగా పట్టాలు అందిస్తున్నాం. శాశ్వత ఇళ్ల పట్టాలు అందుకున్న అందరికీ ముందుగానే దసరా పండుగ వచ్చింది. అందరూ కూడా హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీ కోసం కృషి చేద్దాం’’ అని పిలుపునిచ్చారు.
పేదల ఆనందానికి హద్దులు లేవు: నారాయణ
మంత్రి నారాయణ మాట్లాడుతూ దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ 939 కుటుంబాల సొంతింటి కలను కూటమి ప్రభుత్వం సాకారం చేయడంతో పేదల ఆనందానికి హద్దులు లేవని సంతోషం వ్యక్తం చేశారు. గతేడాది భగత్‌సింగ్ కాలనీలో 1,407 కుటుంబాలకు 36 ఎకరాల భూమిని పట్టాలుగా పంపిణీ చేశామన్నారు. త్వరలో జాఫర్ సాహెబ్ కాలువ ప్రాంతంలోనూ ఇళ్ల పట్టాల పంపిణీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. సర్వేపల్లి కాలువ కట్టపై 60 ఏళ్లుగా ఎదుర్కొంటున్న ఇళ్ల స్థలాలకు శాశ్వత పరిష్కారం చూపామన్నారు.
రాజముద్రతో పాస్ పుస్తకాలు
‘‘గత ప్రభుత్వంలో రీసర్వే పేరుతో పట్టాదారు పాసు పుస్తకాలపై వాళ్ల బొమ్మలు వేసుకుని వివాదాలు సృష్టించారు. నేడు కూటమి ప్రభుత్వం రాజముద్రతో రైతులకు పాస్ పుస్తకాలు అందిస్తోంది. సరిహద్దు రాళ్లపై కూడా వాళ్ల బొమ్మలను తొలగించి, గతంలో దుర్మార్గంగా తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేశాం. పల్లెల నుంచి పట్టణాలకు వలస వచ్చే వారికి అనుగుణంగా మౌలిక వసతులు పెంచాల్సిన అవసరముందనే ప్రణాళికతో పట్టణాలను గ్రోత్ సెంటర్‌లుగా చూస్తూ జీవన ప్రమాణాలను పెంచుతున్నాం. రాష్ట్రంలో పేదరికం అనేది లేకుండా పీ-4 వంటి కార్యక్రమాలు తీసుకువచ్చాం. ఆర్థిక అసమానతలను తగ్గించాలన్నదే సంకల్పంగా కేంద్ర, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ పనిచేస్తోంది’’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
ఈ వార్తలనూ చదవండి...
నెల్లూరులో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
రాయలసీమ అభివృద్ధి సభలో రాజకీయాలు వద్దు: పవన్ కల్యాణ్