Share News

కలెక్టర్లూ.. వెల్‌డన్‌!

ABN , Publish Date - Mar 12 , 2026 | 04:11 AM

పాలనా విధానాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారంలో ఒక్కొక్కరిదీ ఒక్కో ప్రత్యేకత! వినూత్న ఆలోచనా విధానం! మూస పద్ధతులకు భిన్నంగా ప్రయోగాత్మక ‘సక్సెస్‌ ఫార్ములా’! పాలనలో తమదైన ప్రత్యేక మార్క్‌ చూపుతున్న ఏడు జిల్లాల కలెక్టర్లను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు....

కలెక్టర్లూ.. వెల్‌డన్‌!

  • 7 జిల్లాల కలెక్టర్ల పనితీరు రాష్ట్రానికే ఆదర్శం

అమరావతి, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): పాలనా విధానాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారంలో ఒక్కొక్కరిదీ ఒక్కో ప్రత్యేకత! వినూత్న ఆలోచనా విధానం! మూస పద్ధతులకు భిన్నంగా ప్రయోగాత్మక ‘సక్సెస్‌ ఫార్ములా’! పాలనలో తమదైన ప్రత్యేక మార్క్‌ చూపుతున్న ఏడు జిల్లాల కలెక్టర్లను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. వారి పనితీరు రాష్ట్రానికే ఆదర్శమని ప్రశంసించారు. అనకాపల్లి, అన్నమయ్య, చిత్తూరు, నెల్లూరు, విజయనగరం, విశాఖ, కోనసీమ జిల్లాల కలెక్టర్లు సమస్యలను పరిష్కరిస్తున్న తీరుపై సంతోషం వ్యక్తం చేశారు. వెల్‌డన్‌ అంటూ వారిని ప్రశంసించారు. బుధవారం వెలగపూడి సచివాలయంలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్సులో చంద్రబాబు కలెక్టర్ల పనితీరుపై ప్రత్యేకంగా మాట్లాడారు. మొదట ఏడుగురు కలెక్టర్లు తమ విజయగాథలను సీఎంకు ప్రజెంటేషన్‌ ద్వారా తెలియజేశారు. చంద్రబాబు చప్పట్లతో వారిని అభినందించారు. ఈ ఏడు జిల్లాల కలెక్టర్లే కాకుండా వచ్చే కలెక్టర్ల సదస్సు నాటికి మిగిలిన 21 జిల్లాల కలెక్టర్లూ వినూత్న ఆలోచనా విధానాలను ప్రయోగాత్మకంగా అమలు చేసి సక్సెస్‌ స్టోరీలతో రావాలని ఆదేశించారు. అనకాపల్లి, అన్నమయ్య, చిత్తూరు, నెల్లూరు, విజయనగరం, విశాఖ, కోనసీమ జిల్లాలలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ‘సక్సెస్‌ ఫార్ములా’ను రాష్ట్రమంతా అమలు చేయాలని, ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణను అమలు చేయాలని చీఫ్‌ సెక్రటరీ జి.సాయిప్రసాద్‌, ఆర్టీజీఎస్‌, ఐటీ కార్యదర్శి భాస్కర్‌ను ఆదేశించారు.

5.jpg

చిత్తూరులో సంజీవని

సంజీవని పథకాన్ని వినూత్నంగా అమలు చేస్తున్న చిత్తూరు కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ను సీఎం ప్రత్యేకంగా అభినందించారు. కలెక్టర్‌ వినియోగిస్తున్న యాప్‌ను రాష్ట్రమంతా అమలు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.


3.jpg

అన్నమయ్యలో జలధార

జలధార పేరిట అన్నమయ్య కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ అమలు చేస్తున్న వినూత్న విధానాన్ని రాష్ట్రమంతా అమలు చేసేలా చూడాలని చీఫ్‌ సెక్రటరీని సీఎం ఆదేశించారు. జిల్లాలో 1.2 మీటర్ల లోతులోనే నీటి మట్టాల లభ్యత ఉండేలా చర్యలు చేపట్టిన కలెక్టర్‌ను అభినందించారు.

7.jpg

విజయనగరం ఉద్యానబాట..

విజయనగరం జిల్లాలో రైతులను వరి పంట నుంచి ఉద్యాన పంటల వైపు మళ్లేలా జిల్లా కలెక్టర్‌ రామసుందరరెడ్డి కృషి చేశారని సీఎం అభినందించారు. ఉద్యాన పంటలను వేయడంలో ఉన్న మెళకువలు, ధరలు పలికే విధానాన్ని నేర్పుతున్న కలెక్టర్‌ను ప్రశంసించారు.


1.jpg

కోనసీమలో ‘మైగ్రేషన్‌ సెంటర్‌’

గల్ఫ్‌ వెళ్లి మోసపోతున్న వారిని దృష్టిలో పెట్టుకుని ‘కోనసీమ మైగ్రేషన్‌ సెంటర్‌’ పేరిట అమలు చేస్తున్న కలెక్టర్‌ ఆర్‌.మహేశ్‌ను సీఎం అభినందించారు. ఈ విధానాన్ని జీఏడీ, ఓవర్సీస్‌ విభాగం, ఎన్‌ఆర్‌టీ వంటివి అమలు చేయాలన్నారు. ఏజెంట్ల మోసాలకు గురై విదేశాల్లో చిక్కుకోకుండా ముందస్తు జాగ్రత్తలు చెబుతూ అవగాహన కల్పిస్తున్న కలెక్టర్‌ పనితీరు ప్రశంసనీయమన్నారు. కోనసీమలో మాదిరిగా విదేశాలకు వెళ్తున్న వారందరి వివరాలను సేకరిస్తూ అన్ని జిల్లాల్లో ప్రత్యేక పోర్టల్‌లో ఉంచే విధానాన్ని ఆర్టీజీఎస్‌ కూడా అమలు చేయాలని ఆదేశించారు.

2.jpg

విశాఖలో పౌరసేవల యాప్‌

పౌర సేవలను పరిష్కరించడంలో వినూత్న యాప్‌ను తీసుకువచ్చిన విశాఖ కలెక్టర్‌ హరీంద్ర ప్రసాద్‌ను సీఎం ప్రత్యేకంగా అభినందించారు. కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి దాకా సమస్యను పరిష్కరించడంలో విశాఖ కలెక్టర్‌ చేపడుతున్న ప్రయోగాత్మక విధానాన్ని రాష్ట్రమంతా అమలు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని ఆర్టీజీఎస్‌ కార్యదర్శి భాస్కర్‌ను ఆదేశించారు.

4.jpg

నెల్లూరులో ‘రెవెన్యూ’ పరిష్కారం

నెల్లూరు జిల్లాలో ‘వన్‌ మంత్‌, వన్‌ మండల్‌, ఫోర్‌ విజిట్‌’ పేరిట రెవెన్యూ సమస్యల పరిష్కారంపై కలెక్టర్‌ హిమాంశు శుక్లా ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టడంపై సీఎం అభినందించారు. ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడంపై ప్రత్యేక చొరవ తీసుకోవాలని సీసీఎల్‌ఏను, సీఎస్‌ను ఆదేశించారు. సాధ్యమైనంత వరకూ వివాదాలను కలెక్టర్లే పరిష్కరించాలని సూచించారు. నెల్లూరు జిల్లా కలెక్టర్‌ అమలు చేస్తున్న భూసమస్యల పరిష్కారానికి మధ్యవర్తిత్వాన్ని అమలు చేద్దామని సూచించారు. సక్సెస్‌ సాధించిన మధ్యవర్తిత్వానికి రూ.10,000 చొప్పున, ఫెయిల్‌ అయితే రూ.3,000 చొప్పున చెల్లిద్దామని సీఎం ప్రకటించారు.


6.jpg

అనకాపల్లి జిల్లాలో కిచెన్‌ గార్డెనింగ్‌

నెట్‌ జీరో కాన్సె్‌ప్టలో భాగంగా అనకాపల్లి జిల్లాలో ప్రభు త్వ విద్యా సంస్థలలో అమలు చేస్తున్న కిచెన్‌ గార్డెన్‌ల నిర్వహణ అద్భుతంగా ఉందని సీఎం ప్రశంసించారు. జిల్లాలోని పాఠశాలలు, సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్సియల్‌ స్కూళ్లు, వసతి గృహాల ఆవరణలో కిచెన్‌ గార్డెనింగ్‌ను అమలు చేస్తూ, విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించే కార్యక్రమాన్ని చేపడుతున్న కలెక్టర్‌ విజయ కృష్ణన్‌ను అభినందించారు. పాఠశాలల్లో గార్డెనింగ్‌ విధానాన్ని అమలు చేసేందుకు వీలుగా కాంట్రాక్టర్‌ను నియమించుకోవాలని సూచించారు. అనకాపల్లి జిల్లాలో అమలు చేస్తున్న కిచెన్‌ గార్డెనింగ్‌ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. దీనివల్ల ఈ విధానంపై విద్యార్థులకు అవగాహన వస్తుందని చంద్రబాబు చెప్పారు.

భూ సమస్యలు పరిష్కరించండి

భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలని కలెక్టర్లను సీఎం చంద్రబాబు ఆదేశించారు. గత ప్రభుత్వంలో రాష్ట్రంలో కోటి ఎకరాలకు పైగా 22ఏలో చేర్చి సమస్యలు సృష్టించారని అన్నారు. డోన్‌లో 14,000 ఎకరాలను బంజరు భూముల కింద చేర్చి 22ఏలో ఉంచేశారని అన్నారు. అన్నదమ్ముల మధ్య భూ తగాదాలతో పాటు 12 రకాల సర్టిఫికెట్లలో ఏదో ఒకదానిలో భూమి వివరాలు లేవనో, యజమాని పేరు లేదనో, ఏదో ఒక కారణం చూపి లేని సమస్యను సృష్టించారని అన్నారు. ఇలాంటి విధానాలకు చెక్‌పడాలని సూచించారు. రాష్ట్రంలో 15.75 శాతం వృద్ధిరేటు లక్ష్యంగా పని చేయాలని సీఎం సృష్టం చేశారు. వ్యవసాయ రంగానికి టెక్నాలజీ జోడించి తద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలని చెప్పారు.


1.jpg

ఫైళ్ల క్లియరెన్సులో అచ్చెన్న టాప్‌ చివరాఖరున హోం మంత్రి అనిత

ఫైళ్ల క్లియరెన్సులో వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు ముందంజలో ఉండగా, హోం మంత్రి అనిత చివరి స్థానంలో ఉన్నారు. కలెక్టర్ల కాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి ఈ వివరాలు చెప్పారు. ఫైళ్ల క్లియరెన్సుకు అచ్చెన్నాయుడు సగటున 5 గంటల 51 నిమిషాలు తీసుకుంటూ ముందు వరుసలో ఉన్నారు. తర్వాతి స్థానాల్లో నిమ్మల రామానాయుడు(9 గంటల 53 నిమిషాలు), టీజీ భరత్‌ (10 గంటల 11 నిమిషాలు) ఉన్నారు. గతంలో వెనుకబడి ఉన్న కొండపల్లి శ్రీనివాస్‌ కూడా ప్రస్తుతం నాలుగో స్థానంలోకి వచ్చారు. లోకేశ్‌ ఫైళ్ల క్లియరెన్సుకు సగటున 1 రోజు 2 గంటల 53 నిమిషాలు తీసుకుంటున్నారు. డిప్యూటీ సీఎం 1 రోజు 18 గంటల 40 నిమిషాలు తీసుకుంటున్నారు. అనిత 4 రోజుల 9 గంటల 13 నిమిషాలతో చివరి స్థానంలో నిలిచారు.

రెన్యూవబుల్‌ ఎనర్జీలోనే అత్యధిక పెట్టుబడులు

రాష్ట్రానికి వస్తున్న మొత్తం పెట్టుబడుల్లో పునరుత్పాదక ఇంధన (రెన్యూవబుల్‌ ఎనర్జీ) రంగానిదే అగ్రస్థానమని, ఈ రంగంలో 22.6 శాతం పెట్టుబడులు వచ్చాయని ఇంధన శాఖ ప్రత్యేక సీఎస్‌ కె. విజయానంద్‌ వెల్లడించారు. కలెక్టర్ల కాన్ఫరెన్సులో ఆయన ప్రజెంటేషన్‌ ఇచ్చారు. పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు సంబంధించిన భూకేటాయింపుల విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వాటిని కలెక్టర్లు అధిక ప్రాధాన్యమిచ్చి పరిష్కరించాలని సూచించారు. వ్యవసాయ రంగంలో సోలరైజేషన్‌ కోసం తీసుకొచ్చిన పీఎం కుసుమ్‌ ప్రాజెక్టులో భాగంగా 1162.80 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో సోలార్‌ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

Updated Date - Mar 12 , 2026 | 04:12 AM