Share News

వెబ్‌ల్యాండ్‌ డేటాబేస్‌లోకి చొరబాటు!

ABN , Publish Date - Nov 11 , 2026 | 04:23 AM

రాష్ట్రంలో భూరికార్డుల భద్రతకు సవాల్‌ విసురుతూ వెబ్‌ల్యాండ్‌ డేటాబేస్‌లోనే అక్రమాలకు పాల్పడిన ముఠా గుట్టును సీఐడీ రట్టుచేసింది, సీనియర్‌ ఎన్‌ఐసీ అధికారి లాగిన్‌ వివరాలను ఆయనకు తెలియకుండా దుర్వినియోగం చేసి...

వెబ్‌ల్యాండ్‌ డేటాబేస్‌లోకి చొరబాటు!

  • భూరికార్డులు మార్చిన ముఠా అరెస్టు!

  • సీనియర్‌ ఎన్‌ఐసీ అధికారికి తెలియకుండా ఆయన ఐడీ, లాగిన్‌ దుర్వినియోగం

  • ప్రకాశం జిల్లాలో 30 మంది భూముల అక్రమ బదిలీ: సీఐడీ

అమరావతి/దొనకొండ, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భూరికార్డుల భద్రతకు సవాల్‌ విసురుతూ వెబ్‌ల్యాండ్‌ డేటాబేస్‌లోనే అక్రమాలకు పాల్పడిన ముఠా గుట్టును సీఐడీ రట్టుచేసింది, సీనియర్‌ ఎన్‌ఐసీ అధికారి లాగిన్‌ వివరాలను ఆయనకు తెలియకుండా దుర్వినియోగం చేసి.. రెవెన్యూ అధికారుల అనుమతులు లేకుండానే భూముల రికార్డులను తారుమారు చేసిన నలుగురిని అరెస్టు చేసింది. ప్రకాశం జిల్లా దొనకొండ మండలం ఇండ్లచెరువు, పడమర లక్ష్మీపురం గ్రామాల్లోని నాలుగు భూములకు సంబంధించి 6.55 ఎకరాల రికార్డుల్లో అక్రమంగా మార్పులు చేసిన ముఠా.. మొత్తం 30 మందికి చెందిన భూ రికార్డులను మార్చినట్లు సీఐడీ దర్యాప్తులో బయట పడింది. సీఐడీ అధికారులు తెలిపిన వివరాల మేరకు..

వడ్లమూడి ఏడుకొండలు అనే వ్యక్తి తన కుటుంబానికి చెందిన భూముల వెబ్‌ల్యాండ్‌ రికార్డులను తన తండ్రి వెంకటేశ్వర్లు పేరుపై మార్పించేందుకు తన స్నేహితుడు గుంపనేని వెంకటేశ్వర్లును సంప్రదించాడు. అతడు విజయవాడ సీడీఎంఏలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న వేముల వెంకట్‌ను పరిచయం చేశాడు. వీరు వెబ్‌ల్యాండ్‌ యాక్సిస్‌ ఉన్న నిపుణుడికి మధ్యవర్తిగా పనిచేసే షేక్‌ బాషా సాయంతో.. ఎన్‌ఐసీలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి సాయికుమార్‌కు డబ్బు ఆశ చూపించి ఫోర్జరీకి పాల్పడ్డారు. ఎన్‌ఐసీలో సీనియర్‌ అధికారి జీవీఎ్‌సఆర్‌ శర్మకు తెలియకుండా ఆయన ఐడీ, పాస్‌వర్డ్‌ ఉపయోగించి నేరుగా డేటాబే్‌సలో మార్పులు చేసినట్లు సీఐడీ గుర్తించింది. ఆ తర్వాత ఏడుకొండలు, వెంకటేశ్వర్లు కలిసి ఇతరుల పేర్ల మీద ఉన్న భూముల వివరాలను గుర్తించి.. ప్రతి ఎకరా మార్పు కోసం రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకూ వసూలు చేశారు.


దాదాపు 70 ఎకరాలకు సంబంధించి అక్రమాలకు పాల్పడ్డారు. ఈ అక్రమ లావాదేవీల విలువ రూ.50 లక్షల వరకు ఉంది. ఈ విషయం తెలిసి లక్ష్మీపురం, ఇండ్లచెరువుకు చెందిన బాధితులు దొనకొండ తహశీల్దార్‌కు ఫిర్యాదుచేశారు. తహశీల్దార్‌, ఆర్‌డీవోల ప్రమేయం లేకుండానే వెబ్‌ల్యాండ్‌ రికార్డుల్లో అక్రమాలు జరుగుతున్నాయని రెవెన్యూ అధికారులు కలెక్టర్‌, జేసీకి పూర్తిస్థాయి నివేదిక సమర్పించారు. దీనిపై విచారణ జరపాలని కలెక్టర్‌ రాజాబాబు సీఐడీకి నివేదించారు. సీఐడీ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టింది. అక్రమాలకు పాల్పడిన నలుగురు నిందితులు.. వడ్లమూడి ఏడుకొండలు, రంగయ్యగారి సాయికుమార్‌, వేముల వెంకట్‌, షేక్‌ బాషాలపై కేసు నమోదుచేసి, వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచినట్లు సీఐడీ డీజీపీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. బాషా భార్య ఫోన్‌పే నుంచి జరిపిన ఆర్థిక లావాదేవీల ఆధారాలు సేకరించామన్నారు.

ఈ వ్యవహారంలో 30 మంది బాధితులు ఉన్నట్లు తెలిపారు. డిజిటల్‌ చెల్లింపులు జరిపిన మొబైల్‌ ఫోన్లు, అక్రమంగా మార్పులు చేసిన వెబ్‌ల్యాండ్‌ రికార్డులు, కంప్యూటర్లు స్వాధీనం చేసుకుని డిజిటల్‌ ఫోరెన్సిక్‌కు పంపి మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. రైతులు, భూ యజమానులు వెబ్‌ల్యాండ్‌లో తమ రికార్డులను ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకుంటూ ఉండాలని సూచించారు.

ఈ వార్తలనూ చదవండి:

విశాఖ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ సేవల రద్దు

30 ఏళ్లు దాటినా రాజీవ్ గాంధీ భౌతికకాయం ఫొటో చూడని సోనియా!

Updated Date - Nov 11 , 2026 | 04:30 AM