Share News

Baby: ఆ పురిటిబిడ్డ ఎవరో తేలింది!

ABN , Publish Date - Aug 21 , 2026 | 01:03 AM

శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల క్రీడామైదానం వద్దవున్న ఎస్సీ బాలికల వసతిగృహ సమీపంలో నాలుగురోజుల క్రితం దొరికిన పురిటిబిడ్డ ఎవరో ఎట్టకేలకూ తేలింది.

Baby: ఆ పురిటిబిడ్డ ఎవరో తేలింది!
పురిటిబిడ్డ

శ్రీకాళహస్తి, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల క్రీడామైదానం వద్దవున్న ఎస్సీ బాలికల వసతిగృహ సమీపంలో నాలుగురోజుల క్రితం దొరికిన పురిటిబిడ్డ ఎవరో ఎట్టకేలకూ తేలింది.ఆ బిడ్డకు తల్లి హాస్టల్‌ విద్యార్థినుల్లో ఒకరని తేలడంతో వార్డెన్‌ను సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.బాలికల వసతి గృహం మరుగుదొడ్ల వద్ద గత సోమవారం ఉదయం కొద్ది గంటల క్రితమే పుట్టిన మగశిశువు కేకలు హోరెత్తించాయి. వసతిగృహానికి అనుకుని ఉన్న మంచినీళ్లగుంట వాసులు శిశువు అరుపులు విని హాస్టల్‌ సిబ్బందిని ఆరా తీశారు. వార్టెన్‌ జయసుధ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐ నాగరాజు అక్కడికి చేరుకుని శిశువుకు అవసరమైన రక్షణ చర్యలు చేపట్టారు. అనంతరం వైద్యపరీక్షల నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. హాస్టల్‌కు ఒక వైపు కాంపౌండ్‌ లేకపోవడంతో అక్కడ కంచెలోనుంచి ఎవరో దూరి వచ్చి వదిలి వెళ్లివుంటారని వార్డెన్‌ పోలీసులకు వివరించారు. అయితే హాస్టల్‌లోని కొందరు విద్యార్థులు మాత్రం హాస్టల్‌ విద్యార్థిని ఒకరు రాత్రి పూట మరుగుదొడ్ల వద్దకు వెళ్లిందని పోలీసుల వద్ద అనుమానం వ్యక్తం చేశారు.విద్యార్థి సంఘాల ప్రతినిధులేమో వార్డెన్‌ జయసుధకు మొత్తం వ్యవహారం ముందే తెలుసని విద్యార్థిని గర్భం దాల్చినప్పటికీ విషయం దాచే ప్రయత్నం చేసిందని ఆరోపించారు.కాబట్టి వార్డెన్‌ జయసుధను, ఏఎ్‌సడబ్ల్యూ ఉదయశ్రీని సస్పెండ్‌ చేయాలని కోరారు. వసతిగృహ సమీప ప్రాంతాలైన మంచినీళ్లగుంట, ఎన్టీఆర్‌నగర్‌, తెలుగుగంగకాలనీ ప్రాంతాల్లో సీఐ నాగరాజు విచారించారు. శ్రీకాళహస్తి ప్రభుత్వాస్పత్రితో పాటు ప్రైవేటు వైద్యశాలలో ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు జరిగిన కాన్పుల వివరాలను సేకరించి వారందరినీ సంప్రదించారు. చివరకు హాస్టల్‌ విద్యార్థినే ప్రసవించినట్లు నిర్ధారణకు వచ్చారు.ఈ నేపథ్యంలోనే హాస్టల్‌వార్డెన్‌ జయసుధపై సస్పెన్షన్‌ వేటు పడింది.

Updated Date - Aug 21 , 2026 | 01:03 AM