TC Rajan: టీసీ రాజన్ ఇక లేరు
ABN , Publish Date - Mar 21 , 2026 | 12:12 AM
తెల్లటి పంచె.. పైజమా. మెడలో కండువా. చేతిలో కర్ర. వందేళ్లు దాటాక కూడా.. పలమనేరు వీధుల్లో నడుస్తూ.. కనిపించిన వారిని ఆప్యాయంగా పలకరించేవారు. నిరాడంబరత, నిస్వార్థ రాజకీయం, ఉన్నత వ్యక్తిత్వంతో నేటి ప్రజాప్రతినిధులకు ఆదర్శంగా నిలిచిన స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఎమ్మెల్యే టీసీ రాజన్ (108) ఇక లేరు. బెంగళూరులోని తన కుమార్తె ఇంట శుక్రవారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు.
నేడు పలమనేరులో అంత్యక్రియలు
పలమనేరు, మార్చి20 (ఆంధ్రజ్యోతి): నేడు.. చిన్నపాటి పదవిలో ఉన్న వారెందరో.. గడువు ముగిసేలోగా రూ.కోట్లకు పడగలెత్తిన ఘటనలను చూశాం.. చూస్తున్నాం. దీనికి భిన్నంగా సాగింది టీసీ రాజన్ జీవితం. ఎన్జీ రంగా అనుచరుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన.. ఐదేళ్లపాటు ఎమ్మెల్యేగా పలమనేరు నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడ్డారు. ఏనాడూ ప్రభుత్వ భూములను అక్రమంగా పొందేందుకు పూనుకోలేదు. గత ఆరు దశాబ్దాలుగా ప్రభుత్వం ఇచ్చే పెన్షన్‌తోనే నిరాడంబర జీవితాన్ని సాగించారు. ప్రజాప్రతినిధి అంటే ఇలా ఉండాలని జనం అనుకొనేలా సాగిన ఆయన రాజకీయ ప్రయాణం.. శుక్రవారంతో ముగిసింది. చిత్తూరు జిల్లాకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు, పలమనేరు మాజీ ఎమ్మెల్యే టీసీ రాజన్ (108) కన్నుమూశారు. బెంగళూరులోని తన కుమార్తె ఇంట్లో ఉన్న ఆయన శుక్రవారం ఉదయం గుండెపోటుతో అసువులు బాశారు. ప్రస్తుత పెద్దపంజాణి మండలం రాయలపేట గ్రామంలో జన్మించారు. అక్కడే ప్రాథమిక విద్య పూర్తి చేశారు. మదనపల్లెలో థియోసాఫికల్ పాఠశాలలో ఉన్నత చదువు, ఎఫ్.ఏ. రెండేళ్లు చదివారు. అక్కడే బీఏ చదువుతూ.. గాంధీజీ ప్రసంగాలకు ప్రభావితుడై స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నారు. అప్పట్లో టెలిఫోన్ వైర్లను కత్తిరించి బ్రిటీషు వాళ్ల సమాచార వ్యవస్థకు అంతరాయం కలిగించారు. దీంతో ఆయన్ను అరెస్టుచేసి జైలుకు పంపారు. స్వాతంత్ర్యానంతరం స్వతంత్ర పార్టీలో రాజన్ చేరారు. అప్పట్లో పార్లమెంట్ ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన ఎన్జీ రంగా ఓటమి చెందారు. అదే సమయంలో చిత్తూరు ఎంపీగా గెలిచిన అనంతశయనం బిహారు గవర్నరుగా నియమితులయ్యారు. ఖాళీ అయిన చిత్తూరు ఎంపీ స్థానానికి స్వతంత్ర పార్టీ తరపున ఎన్జీరంగా.. ఆర్థికంగాను, స్థానికంగా బలవంతుడైన మదనపల్లెకు చెందిన విశ్వనాథరెడ్డిపై పోటీచేశారు. ఆ ఎన్నికల్లో విశ్వనాథరెడ్డికి మదనపల్లె అసెంబ్లీ సెగ్మెంట్‌లో 18 వేల ఓట్ల మెజారిటీ వచ్చింది. అయితే, పలమనేరు అసెంబ్లీ నియోజకవర్గంలో స్వతంత్ర పార్టీకి ఇన్‌ఛార్జిగా ఉన్న టి.సి.రాజన్ విస్తృతంగా ప్రజల్లో తిరిగి ప్రచారం చేయడంతో రంగాకు 19,500 ఓట్ల మెజారిటీ వచ్చింది. మిగిలిన నియోజకవర్గాల్లో పోటాపోటీగా ఓట్లు సాధించినా చివరకు ఎన్జీ రంగా ఎంపీగా గెలుపొందారు. ఇలా ఆయన గెలుపులో కీలక పాత్ర పోషించిన టీసీ రాజన్.. 1967లో పలమనేరు ఎమ్మెల్యేగా పోటీచేసి విజయం సాధించారు.
ఇదీ కుటుంబం
టి.సి.రాజన్ సతీమణి భద్రాంబ జడ్జిగా నెల్లూరు, హైదరాబాద్, అనంతపురంలో పనిచేశారు. దశాబ్దం కిందట మృతిచెందారు. ఈయనకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. వీరిలో కవలలైన మగ పిల్లల్లో ఒకరు శ్రీకృష్ణదేవరాయ వర్సిటీలో అధ్యాపకుడిగా ఉద్యోగ విరమణ చేశారు. మరొకరు వ్యాపార రంగంలో స్థిరపడ్డారు. మరో కుమారుడు బెంగళూరులోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో ఇంజినీరుగా పనిచేస్తూ రెండేళ్లక్రితం జరిగిన రోడ్డుప్రమాదంలో మృతిచెందారు. ఆయన కుమార్తె బెంగళూరులో స్థిరపడ్డారు.
ఇదీ ఆయన వ్యక్తిత్వం
స్వాతంత్య్ర సమరయోధులు ప్రభుత్వం నుంచి 15 ఎకరాల భూమి పొందే అర్హత ఉంది. అయినా ఆయన దాన్ని తీసుకోలేదు.
ఆయనకు ప్రభుత్వం 15 సెంట్ల నివేశ స్థలం ఇచ్చింది. అదీ రోడ్డు విస్తరణలో పోయింది. మళ్లీ ఆయన నివేశ స్థలం కోసం ప్రయత్నించలేదు.
ఎమ్మెల్యేలకు పింఛను ప్రతిపాదనలు వచ్చిన రోజుల్లో టీసీ రాజన్ వ్యతిరేకించారు. పింఛను తీసుకోలేదు.
ఇప్పటికీ ఆయనకు సొంతిల్లు కానీ, ఆస్తిపాస్తులు కానీ లేవు. వాహనాలూ లేవు.
పలమనేరుకు చేరిన భౌతికకాయం
బెంగళూరులోని తన కుమార్తె వద్ద టీసీ రాజన్ ఎక్కువ కాలం ఉంటున్నారు. గతేడాది అక్కడే 108వ జన్మదినం జరుపుకొన్నారాయన. శుక్రవారం ఉదయం మృతిచెందడంతో.. సాయంత్రానికి ఆయన భౌతిక కాయాన్ని పలమనేరుకు తీసుకొచ్చారు. పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి, రేణుకారెడ్డి దంపతులు ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. పలమనేరు ఆర్డీవో పి.భవాని, తహసిల్దార్ ఇన్బనాథన్, మున్సిపల్ కమిషనరు ఎన్.వి.రమణారెడ్డి, ఎస్.ఐ.స్వర్ణతేజ, మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ మునిరాజు, పలమనేరు సూపర్ బజార్ అధ్యక్షుడు ఆర్వీబాలాజి, టీడీపీ నాయకులు కుట్టి, గిరిబాబు, నాగరాజు, బీఆర్సీ కుమార్, కిరణ్‌కుమార్, మదన్‌మోమన్, సుధాకర్, సురేష్, లోకేష్, చిన్నిలతో పాటు గంగవరం టీడీపీ నాయకులు సోమశేఖర్‌గౌడు, ప్రతా్‌పరెడ్డి, పల్లెరుచులు అమరనాథరెడ్డి, గిరిధరగోపాల్, మురళి తదితరులు నివాళులర్పించారు. టీసీరాజన్ భౌతిక కాయానికి జాతీయజెండా కప్పారు. శనివారం అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.