Rice: రేపటి నుంచి ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రాల ఏర్పాటు
ABN , Publish Date - Jul 31 , 2026 | 01:34 AM
రాష్ట్రంలో ఇటీవల పెరిగిన బియ్యం ధరలను నియంత్రించడంతో పాటు వినియోగదారులకు నాణ్యమైన బియ్యాన్ని సరసమైన ధరలకు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
చిత్తూరు కలెక్టరేట్, జూలై 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇటీవల పెరిగిన బియ్యం ధరలను నియంత్రించడంతో పాటు వినియోగదారులకు నాణ్యమైన బియ్యాన్ని సరసమైన ధరలకు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మార్కెట్ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్ (ఎంఐపీ) కింద శనివారం నుంచి ప్రత్యేక కేంద్రాల ద్వారా ఈ బియ్యం విక్రయించనున్నారు. దీనిపై గురువారం సాయంత్రం కలెక్టరేట్‌లో రైస్‌మిల్లర్లు, అధికారులతో జేసీ ఆదర్శ్ రాజేంద్రన్ సమీక్షించారు. ఈ కేంద్రాల్లో సూపర్ ఫైన్ బియ్యం కిలో రూ.52, స్టీమ్ రైస్ (బీపీటీ) కిలో రూ.52, రా రైస్ (బీపీటీ) కిలో రూ.50కి విక్రయించనున్నట్లు పేర్కొన్నారు. సూపర్ ఫైన్/స్టీమ్ విభాగంలో బీపీటీ, కేఎన్‌ఎం, ఆర్‌ఎన్‌ఆర్, హెచ్‌ఎంటీ/సోనామసూరి రకాల బియ్యం రూ.52కు అందుబాటులో ఉంటాయన్నారు. ఎక్కడైనా అధికంగా వసూలు చేసినా, నాసిరకం బియ్యం లేదా తూకంలో అవకతవకలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతు బజార్లు, రైస్‌మిల్ అవుట్‌లెట్లలో ధరల పట్టికలు, బియ్యం రకాల వివరాలు, పని వేళలు, ఫిర్యాదుల వివరాలను ప్రదర్శిస్తామన్నారు.