Share News

కూటమిలో కుదిరిన సీట్ల సర్దుబాటు

ABN , Publish Date - Nov 23 , 2026 | 01:05 AM

రుపతి, చిత్తూరు జిల్లాల్లో డిప్యూటీ మేయర్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ స్థానాలకు కూటమి పార్టీల నడుమ ఎట్టకేలకు సర్దుబాటు కుదిరింది. సుదీర్ఘంగా కొనసాగిన చర్చలు ఆదివారం రాత్రి ముగిశాయి

కూటమిలో కుదిరిన సీట్ల సర్దుబాటు

టీడీపీకి చిత్తూరు, కుప్పం, నగరి,

పుత్తూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట

జనసేన నుంచి తిరుపతి

‘డిప్యూటీ’ మేయరు అభ్యర్థిగా పాలడుగు విజయ

పలమనేరు వైస్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థి మురాదు

నాయుడుపేట బీజేపీకి

తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో

నేడే మున్సిపల్‌ ఉపాధ్యక్ష ఎన్నికలు

పుత్తూరులో ఎన్నిక రేపటికి వాయిదా

తిరుపతి, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో డిప్యూటీ మేయర్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ స్థానాలకు కూటమి పార్టీల నడుమ ఎట్టకేలకు సర్దుబాటు కుదిరింది. సుదీర్ఘంగా కొనసాగిన చర్చలు ఆదివారం రాత్రి ముగిశాయి. అందులో భాగంగా చిత్తూరు డిప్యూటీ మేయర్‌, కుప్పం, నగరి, పుత్తూరు, సూళ్ళూరుపేట, వెంకటగిరి మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ పదవులు టీడీపీకి కేటాయించారు. తిరుపతి డిప్యూటీ మేయర్‌, పలమనేరు మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ స్థానాలు జనసేనకు దక్కగా.. పాలడుగు విజయ, మురాదు పేర్లను అర్ధరాత్రి ప్రకటించారు. ఇక, నాయుడుపేట వైస్‌ ఛైర్మన్‌ పదవి బీజేపీకి దక్కింది. రెండు జిల్లాల్లో మున్సిపల్‌ డిప్యూటీ మేయర్‌, వైస్‌ చైర్మన్‌ స్థానాలకు సోమవారం ఎన్నికలు జరుగుతుండగా.. పుత్తూరులో మాత్రం మంగళవారానికి వాయిదా పడింది. టీడీపీ, బీజేపీ నుంచి అర్ధరాత్రి దాకా అభ్యర్థులు ఖరారు కాలేదు.

టీడీపీలో ఎందరో ఆశావహులు

ఫ చిత్తూరు డిప్యూటీ మేయర్‌ పదవికి టీడీపీలో తీవ్ర పోటీ నెలకొంది. మేయర్‌గా బలిజ సామాజికవర్గానికి చెందిన కఠారి హేమలత ఎన్నికయ్యారు. దీంతో డిప్యూటీ మేయర్‌ పదవిని కమ్మ వర్గం నుంచి నరిగిపల్లి గోపి, వరుణ్‌లు, రెడ్డి వర్గం నుంచి లోకేశ్‌రెడ్డి, మొదలియార్‌-బీసీ వర్గాలతో పాటు తమిళ కోటా కింద నళిని తిరుకుమరన్‌, వన్యకుల క్షత్రియ-బీసీ వర్గాల నుంచీ శంకర్‌ తదితరులు ప్రధానంగా ఆశిస్తున్నారు.

ఫ వెంకటగిరి వైస్‌ చైర్మన్‌గా జంపాల ప్రకాష్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కూడా ఆశావహులకు, పార్టీ కౌన్సిలర్లకు ఈ మేరకు సంకేతాలిచ్చినట్టు సమాచారం. ఛైర్‌పర్సన్‌ పదవి జనరల్‌ మహిళకు రిజర్వు అయినా, బీసీలకు ఇచ్చారు. దీంతో ‘వైస్‌’ను ఓసీలకు ఇచ్చే భాగంగా బలిజ సామాజికవర్గానికి చెందిన ప్రకా్‌షకు ఎమ్మెల్యే సిఫారసు చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఫ సూళ్లూరుపేటలోఓ ఛైర్‌పర్సన్‌ ఎస్సీ మహిళ కావడంతో ఓసీ లేదా బీసీ వర్గాలకు చెందిన పురుషులకు వైస్‌ ఛైర్మన్‌ ఇచ్చే పరిస్థితి ఉంది. ఈ పదవిని ఆర్యవైశ్య వర్గం నుంచీ అలవల శ్రీనివాసులు, బీసీ వర్గాల నుంచీ మేడా సాయినారాయణ, చీమల రమణయ్య, బాలచంద్ర అలియాస్‌ ఏజీ కిషోర్‌ ఆశిస్తుండగా మేడా సాయినారాయణ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

ఫ పుత్తూరులో ఛైర్మన్‌ పదవి బీసీకి కేటాయించినందున వైస్‌ ఛైర్మన్‌ పదవిని ఓసీ లేదా ఎస్సీలకు కేటాయించే అవకాశముంది. కమ్మ వర్గం నుంచీ గాలి జీవరత్నం నాయుడు, బలిజ వర్గం నుంచీ విక్కీ రాయల్‌, క్షత్రియ వర్గం నుంచీ ప్రతాప్‌ రాజు, ఎస్సీ వర్గం నుంచీ ఆనంద్‌ రేసులో వున్నారు.

ఫ కుప్పంలో ప్రధానంగా మైనారిటీలు వైస్‌ ఛైర్మన్‌ పదవిని ఆశిస్తున్నారు. షకీన, అఖిల, సుల్తానా పేర్లు ప్రచారంలో ఉన్నాయి.

ఫ నగరిలో మున్సిపల్‌ మాజీ ఛైర్మన్లు కేజే కుమార్‌, శాంతిల తనయుడు విజయ్‌భాస్కర్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఎస్సీ వర్గం నుంచీ లత, పాలేగార్‌ వర్గం నుంచీ అమ్ములు పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి.

నాయుడుపేట వైస్‌ ఛైర్మన్‌ పదవి బీజేపీకి

నాయుడుపేట మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ స్థానం కూటమిలో బీజేపీకి ఖరారైంది. ఆ పార్టీ తరపున ఎస్టీ వర్గానికి చెందిన కె.సుందరరావు, బలిజ వర్గానికి చెందిన కావేరిపాకం కోటేశ్వరరావు, రెడ్డి సామాజికవర్గం నుంచీ మంచిరెడ్డి లక్ష్మీ అనూషా, పాపిరెడ్డి రాజశేఖర్‌ గెలిచారు. వీరిలో ఒకరికి వైస్‌ ఛైర్మన్‌ పదవి దక్కనుంది.

తిరుపతి డిప్యూటీ మేయరుగా విజయ

తిరుపతి డిప్యూటీ మేయర్‌, పలమనేరు వైస్‌ ఛైర్మన్‌ పదవులు కూటమిలో జనసేనకు ఖరారయ్యాయి. ఈ రెండు చోట్ల ఆదివారం అర్ధరాత్రి తమ పార్టీ అభ్యర్థులను జనసేన ప్రకటించింది. ఆ ప్రకారం తిరుపతి డిప్యూటీ మేయరు అభ్యర్థిగా పాలడుగు విజయ.. పలమనేరు వైస్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థిత్వానికి మురాదు పేర్లను ఖరారు చేశారు.

Updated Date - Nov 23 , 2026 | 01:05 AM