Registration: రిజిస్ట్రేషన్ ఆదాయం భేష్
ABN , Publish Date - Oct 11 , 2026 | 12:56 AM
రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇటీవల ఆశాజనకంగా కనిపిస్తుంది. రిజిస్ట్రేషన్ శాఖ లెక్కలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
గత ఏడాదితో పోలిస్తే పెరిగిన డాక్యుమెంట్లు
చిత్తూరు కలెక్టరేట్, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇటీవల ఆశాజనకంగా కనిపిస్తుంది. రిజిస్ట్రేషన్ శాఖ లెక్కలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. భవనాలు, అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్ల కన్నా ఖాళీ ప్లాట్ల కొనుగోలుపైనే ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని అర్థమవుతోంది. జిల్లాలో స్టాంపులు,రిజిస్ట్రేషన్ల శాఖ రాబడిలో గతఏడాది తొలి ఆరునెలలతో పోలిస్తే ప్రస్తుతం 25.42ు వృద్ధి నమోదయ్యింది. గత ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి సెప్టెంబర్ వరకు రూ.78.14 కోట్లు వసూలు కాగా, ఈ ఏడాది రూ.101.94 కోట్లు వసూలు చేసింది.
మార్కెట్ విలువ సవరించకపోయినా.......
భూములు, భవనాలు మార్కెట్ విలువలను ఏటా సవరించే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది క్రయవిక్రయాలపై ఆ భారం పడకూడదని ప్రభుత్వం పెంచలేదు. జిల్లాలో 8 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని తొలి అర్ధ సంవత్సరంలో జిల్లాలో రూ.117.78 కోట్లు రాబడి లక్ష్యం కాగా సెప్టెంబర్ ఆఖరు నాటికి రూ.101.94 కోట్లు వసూలైంది. 33,109 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌లతో 86.5శాతం రాబడి లక్ష్యం సాధించింది. రాబడిలో బంగారుపాళ్యం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం లక్ష్యానికి మించి 116 శాతం వృద్ధిసాధించగా, పుంగనూరు 94శాతం, చిత్తూరు ఆర్వో 93శాతంతో ప్రఽథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. 73శాతంతో పలమనేరు సబ్ రిజిస్టర్ కార్యాలయం చివరిస్థానంలో నిలిచింది.
ఆశాజనకంగా రియల్ ఎస్టేట్.....
గడిచిన నాలుగు నెలలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంటున్నట్లు స్పష్టం అవుతుంది. సాధారణంగా కొనుగోలుదారులు భూమి, బంగారం లేదా వ్యాపారంపై పెట్టుబడులు పెట్టేవారు. ఇటీవల బంగారం ధరలు అమాంతంగా పెరుగుతుండడంతో దాదాపు 40 శాతం మంది భూమి మీద పెట్టుబడి పెడుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికల తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం అంచెలంచెలుగా పుంజుకోవడం, కొత్తగా పట్టణాలతో పాటు మేజర్ గ్రామపంచాయతీలో సైతం లేఅవుట్లు చకచకా వెలుస్తున్నాయి. గతంలో ఇల్లు, అపార్ట్‌మెంట్లలో, ఫ్లాట్లు కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతుండగా ... ఇటీవల ఖాళీ ప్లాట్లపైన మొగ్గుచూపుతున్నారు. మొత్తంగా రియల్ ఎస్టేట్ రంగం ఆశాధనకంగా మారుతోంది
పైరవీలతో ఆదాయానికి గండి
రిజిస్ట్రేషన్ సమయంలో డాక్యుమెంట్ రైటర్ల ద్వారా పైరవీలు జరిపి తక్కువ చెల్లింపులు చేయడంతో ఆదాయానికి గండిపడుతోంది. కొన్నిచోట్ల కమర్షియల్ ప్రాంతాల్లోని భవనాలు, భూములకు మార్కెట్ విలువ తక్కువగా చూపిస్తున్నారు. దీనికోసం డోర్ న ంబర్లు కూడా మార్చేసిన సంఘటనలు ఉన్నాయి. వీటిపై పలు ఆరోపణలు కూడా అ ందాయి. దీనివల్ల రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయానికి గండిపడుతోంది. ఇలాంటి అక్రమాలకు అడ్డువేస్తే రిజిస్ట్రేషన్ల రాబడి మరింత వృద్ధి సాధించవచ్చు.
సరళీకృతంతో మెరుగైన సేవలు : వెంకటరమణమూర్తి, జిల్లా రిజిస్ట్రార్
ప్రభుత్వం ఇటీవల క్రయవిక్రయదారుల సౌలభ్యం కోసం విప్లవాత్మక మార్పులు అమల్లోకి తెచ్చింది. స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్ సరళీకృతం చేయడంతో మెరుగైన సేవలు అందుతున్నాయి. దీంతో గత తొలి అర్ధ సంవత్సర రాబడి ఫలితాలు పరిశీలిస్తే 25.4 శాతం వృద్ధి సాధించాం. ఈఏడాది మార్చి ఆఖరునాటికి అన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాలు వంద శాతం రాబడి లక్ష్యాలు సాధిస్తాం.
6నెలల్లో డాక్యుమెంట్ల సంఖ్య: 33,109
సమకూరిన ఆదాయం: రూ.101.94 కోట్లు
పెరిగిన వృద్ధి శాతం : 25.42ు
బంగారుపాళ్యంలో : 116 శాతం