Share News

ఛార్జీల టారిఫ్‌పై అభిప్రాయం చెప్పింది ఆరుగురే!

ABN , Publish Date - Jan 21 , 2026 | 03:11 AM

విద్యుత్‌ ఛార్జీలపై ఏపీ ఈఆర్సీ చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణకు ప్రజల భాగస్వామ్యం లేకుండా పోయింది. వినియోగదారులు, రైతులు, వ్యాపార వర్గాలు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో సమావేశం వెలవెలపోయింది.

ఛార్జీల టారిఫ్‌పై అభిప్రాయం చెప్పింది ఆరుగురే!
బుక్‌ ఆవిష్కరిస్తున్న ఏపీఈఆర్సీ చైర్మన్‌ పీవీఆర్‌ రెడ్డి

వీడియో కాన్ఫరెన్స్‌లోనూ అదేతీరు

తిరుపతి, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ ఛార్జీలపై ఏపీ ఈఆర్సీ చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణకు ప్రజల భాగస్వామ్యం లేకుండా పోయింది. వినియోగదారులు, రైతులు, వ్యాపార వర్గాలు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో సమావేశం వెలవెలపోయింది. తిరుపతిలోని సదరన్‌ డిస్కం కార్పొరేట్‌ కార్యాలయంలో ఏపీ ఈఆర్సీ (ఆంధ్రప్రదేశ్‌ నియంత్రణ మండలి) చైర్మన్‌ పీవీఆర్‌ రెడ్డి అధ్యక్షతన మంగళవారం విద్యుత్‌ ఛార్జీల అంశానికి సంబంధించి 2026-27 ఆర్థిక సంవత్సరానికి అమలు చేయనున్న టారి్‌ఫలపై సమావేశం ప్రారంభమైంది. ముందుగా విద్యుత్‌ సంస్థలు ఏపీఈఆర్సీకి సమర్పించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్‌ఆర్‌) గురించి అధికారులు వివరించారు. ఆ తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ మొదలుపెట్టారు. ముందుగా నమోదు చేసుకున్న పలువురు హాజరు కాలేదు. ముగ్గురు మాత్రమే నేరుగా వచ్చి మాట్లాడారు. ఇక, ఆక్వా కరెంటు చార్జీలు తగ్గించాలని వెస్ట్‌ గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు రైతులు వర్చువల్‌గా కోరారు. మరో ఇద్దరు కూడా వర్చువల్‌గా తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాతే తుది టారిఫ్‌ ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు ఏపీఈఆర్సీ ఛైర్మన్‌ పీవీఆర్‌ రెడ్డి స్పష్టంచేశారు. ఈసమావేశంలో ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ శివశంకర్‌, వివిధ జోన్ల డైరెక్టర్లు పాల్గొన్నారు.

వాటర్‌ ప్లాంట్లకు కేటగిరీ మార్చండి : రామ్మోహన్‌, అనంతపురం

రాష్ట్రవ్యాప్తంగా 20వేల వాటర్‌ ప్లాంట్లు ఉన్నాయి. వీటిని ఆధారంగా చేసుకుని 15లక్షల కుటుంబాలు జీవిస్తున్నాయి. వాటర్‌ ప్లాంట్‌కు విద్యుత్‌ మీటరును రెండవ క్యాటగిరీ నుంచి మూడవ క్యాటగిరీకి మార్చాలి. ఆమేరకు ప్రభుత్వ ఆదేశాలు కూడా ఉన్నాయి. దీనిని అమలు చేయండి.

కబ్జాదారులకు కరెంటు కనెక్షన్‌ ఇచ్చారు : కమలకృష్ణ, ప్రభుత్వ టీచర్‌

కుప్పంలో ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తున్నా. తిరుచానూరు సర్వే నెంబరు 260లోని మా స్థలంలో కబ్జాదారులు రూము కట్టేశారు. సంబంధిత ఏఈ కరెంటు మీటరు ఇచ్చేశారు. దీనిని అదనుగా చేసుకుని న్యాయస్థానం ఆశ్రయించి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. కరెంటు మీటరును రద్దుచేయాలని పదేళ్లకు పైగా తిరుగుతున్నా న్యాయం జరగడంలేదు.

ట్రూఛార్జీల తగ్గింపు పచ్చి మోసం : కందారపు మురళి, సీపీఎం నేత

గత 26 ఏళ్లలో లేనివిధంగా ట్రూ డౌన్‌ చేసి ఛార్జీలు తగ్గించామని కూటమి ప్రభుత్వం చెబుతున్న వాదనలో పసలేదు. రెండేళ్లలో రూ17వేల కోట్ల అదనపు భారాలను వినియోగదారులపై మోపింది. వైసీపీ ప్రభుత్వం పెంచిన విద్యుత్‌ సుంకాన్ని, చార్జీలను ప్రస్తుత ప్రభుత్వం అలాగే వసూలు చేస్తోంది. విద్యుత్‌ రంగం బలహీన పడటానికి ప్రధాన కారణం అవినీతే. దీనినే క్రోనీ క్యాపటలిజంగా పిలుస్తారు. ఒక్క సంతకంతో రూ84కోట్ల లబ్ధి పొందారని మాజీ సీఎండీ గురించి మీడియా కోడై కూస్తున్నా, ప్రభుత్వం ఎందుకు స్పందించడంలేదు? కూడికలు, తీసివేతలే కాదు తప్పు, ఒప్పులను ప్రశ్నించేలా, నియంత్రించేట్టుగా రెగ్యులేటరీ కమిషన్‌ ఉండాలి. తెలంగాణ తరహాలో కార్మికులను విలీనం చేయాలి. విద్యుత్‌ బిల్లు-2025ను వ్యతిరేకించాలి.


విద్యుత్‌ చార్జీలు తగ్గంచండి

విద్యుత్‌ ఛార్జీలను తగ్గించి.. ట్రూఅప్‌ చార్జీలను ఆపేసి.. వినియోగదారులకు ఉపశమనం కల్పించాలని సీపీఎం, సీపీఐ నేతలు ఈఆర్సీ చైర్మన్‌ పీవీఆర్‌ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. సీపీఎం నేతలు వందవాసి నాగరాజు, కందారపు మురళి, టి. సుబ్రహ్మణ్యం, ఎస్‌ జయచంద్ర, కే వేణుగోపాల్‌, మాధవ్‌ కృష్ణ, సాయి లక్ష్మి, జి. బాలసుబ్రమణ్యం, మునిరాజా, బుజ్జి, నరేంద్ర, సీపీఐ నేతలు రామానాయుడు, చిన్నం పెంచలయ్య, విశ్వనాధ్‌ తదితరులు ఉన్నారు.

2026-27 ప్రతిపాదిత అంచనాలు

ప్రస్తుత టారిఫ్‌ నుంచి వచ్చే ఆదాయం: రూ.14,016,06కోట్లు

టారిఫేతర రాబడి : రూ.1,838,31కోట్లు

ప్రస్తుత టారిఫ్‌ వద్ద నికరలోటు : రూ.7923కోట్లు.

Updated Date - Jan 21 , 2026 | 06:32 AM