Drinking water: తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రణాళిక రూపొందించండి
ABN , Publish Date - Mar 10 , 2026 | 01:57 AM
వేసవిలో జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రణాళికలు రూపొందించాలని ఇన్‌చార్జి మంత్రి మండిపల్లె రాంప్రసాద్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని మీటింగ్ హాలులో సోమవారం మధ్యాహ్నం జరిగిన జిల్లా అభివృద్ధి కమిటీ సమీక్షా సమావేశంలో పది ప్రాధాన్యతాంశాలపై చర్చించారు.
చిత్తూరు కలెక్టరేట్, మార్చి 9(ఆంధ్రజ్యోతి): వేసవిలో జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రణాళికలు రూపొందించాలని ఇన్‌చార్జి మంత్రి మండిపల్లె రాంప్రసాద్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని మీటింగ్ హాలులో సోమవారం మధ్యాహ్నం జరిగిన జిల్లా అభివృద్ధి కమిటీ సమీక్షా సమావేశంలో పది ప్రాధాన్యతాంశాలపై చర్చించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల పురోగతిపై సమీక్షించారు. ‘గత ప్రభుత్వం పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించామని గొప్పలు చెప్పింది. క్షేత్రస్థాయి పరిస్థితి ఏమో అందుకు విరుద్ధంగా ఉంది. సౌకర్యాలలేమిపై తరుచూ ఫిర్యాదులు వస్తున్నాయి’ అని మంత్రి రాంప్రసాదరెడ్డి అన్నారు. పల్లె ప్రయాణం సాఫీగా సాగేలా ఆర్టీసీ నూతనంగా 2250 బస్సులను కొంటున్నట్లు చెప్పారు. గ్రామాల్లోనూ త్వరలో డ్రైనేజీ వ్యవస్థను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అపోలో ఆస్పత్రి సేవలు చెన్నై, హైదరాబాదు వంటి నగరాల్లో మెరుగ్గా ఉన్నా, చిత్తూరులో మాత్రం ఆశించిన విధంగా లేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో అపోలో ఆస్పత్రి నిర్వహణ లోపాలపై తరచూ ఫిర్యాదులు రావడంపై సీఎం దృష్టికి తీసుకెళతానని ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం జఠిలంగా ఎందుకు మారుతున్నాయని ప్రశ్నించారు. ‘పీహెచ్‌సీలలో సిబ్బంది కొరతను అధిగమించేలా చర్యలు చేపడతాం. ఉపాధి హామీ బిల్లులను వెంటనే అప్‌లోడ్ చేయాలి’ అని కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆదేశించారు. అపోలో ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యుల వినతులను యాజమాన్యం పట్టించుకోవడం లేదని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆరోపించారు. రేషన్ దుకాణాల్లో అవకతవకలపై ఆధారాలతో ఫిర్యాదులు చేసినా డీఎస్వో శంకరన్ చర్యలు చేపట్టడం లేదని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్ విమర్శించారు. ఈ సమావేశంలో జేసీ ఆదర్శ్ రాజేంద్రన్, ఏఎస్పీ రాజశేఖర్ రాజశేఖర్ రాజు, డీఆర్వో మోహన్‌కుమార్, చుడా చైర్‌పర్సన్ కఠారి హేమలత, మేయర్ అముద, డీసీసీబీ చైర్మన్ అమాస రాజశేఖర్ రెడ్డి, మొదలియార్ సంఘం కార్పొరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు త్యాగరాజన్ తదితరులు పాల్గొన్నారు.
చేతులు జోడించి కోరుతున్నా..!
ప్రజాసమస్యల పరిష్కారానికి రెవెన్యూ అధికారులు చొరవ చూపాలన్న మంత్రి
ప్రజా సమస్యల పరిష్కారంలో చొరవ చూపాలని చేతులు జోడించి రెవెన్యూ అధికారులను కోరుతున్నానని మంత్రి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. చిత్తూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భూ సమస్యల పరిష్కార దిశగా కలెక్టర్ సుమిత్‌కుమార్ చూపే శ్రద్ధ, చిత్తశుద్ధి.. క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందిలో కనిపించడం లేదన్నారు. కుప్పం డివిజన్‌లో అధికంగా రెవెన్యూ సమస్యలు వస్తున్నాయన్నారు. వైసీపీ పాలనలోలాగా తమ ప్రభుత్వం ఉద్యోగుల మెడపై కత్తిపెట్టి పనిచేయించడం లేదని గుర్తుచేశారు. అయినా ఉద్యోగులు, వీఆర్వోలు, సర్వేయర్లు స్పందించడం లేదన్నారు. తాము ఉద్యోగులపై ఎలాంటి కక్షసాధింపు చర్యలు చేపట్టడం లేదని చెప్పారు. గతంలో బ్లాక్, మండల స్థాయికే పరిమితమైన రెవెన్యూ వ్యవస్థ ఇప్పుడు క్షేత్రస్థాయి వరకు ఈ ప్రభుత్వం తీసుకెళ్లడం వల్లే భూ.. రీసర్వే సమస్యలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయని చెప్పారు. ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఎంతో చేస్తున్నా ప్రజల్లో, రైతాంగంలో ఎందుకో నిర్లిప్తత ఉందన్ననరు. ప్రతిపక్షాల ఆరోపణలను నమ్మొద్దని, అన్ని పథకాలను ఈ ప్రభుత్వం కొనసాగిస్తుందని చెప్పారు.