టోల్‌ప్లాజా వద్ద చింతమనేని టిప్పర్ డ్రైవర్ల రచ్చ
ABN , Publish Date - Oct 05 , 2026 | 04:53 AM
విజయవాడ పశ్చిమ బైపాస్‌లోవెదురుపావులూరు టోల్‌ప్లాజా దగ్గర దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు చెందిన టిప్పర్ల డ్రైవర్లు ఆదివారం రచ్చరచ్చ చేశారు
టోల్‌ప్లాజా వద్ద చింతమనేని
టిప్పర్ డ్రైవర్ల రచ్చ
ఫ్రీగా అనుమతించనందుకు సిబ్బందితో గొడవ
వెస్ట్ బైపాస్‌లో 6 లేన్లలో వాహనాల ఆపివేత
భారీగా ట్రాఫిక్ స్తంభన..
చిక్కుకున్న 4 అంబులెన్స్‌లు
పోలీసులు వచ్చాక కూడా డ్రైవర్ల వాగ్వాదం
టోల్‌ప్లాజా నుంచి 10 వరకు దూసుకెళ్లిన టిప్పర్లు
విజయవాడ/గన్నవరం, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): విజయవాడ పశ్చిమ బైపాస్‌లోవెదురుపావులూరు టోల్‌ప్లాజా దగ్గర దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు చెందిన టిప్పర్ల డ్రైవర్లు ఆదివారం రచ్చరచ్చ చేశారు. వాహనాలను ఉచితంగా అనుమతించలేదని టోల్‌ప్లాజా సిబ్బందితో గొడవ పడ్డారు. టోల్‌ప్లాజా లేన్లలో లారీలను ఆపివేసి ట్రాఫిక్‌ను స్తంభింపజేశారు. పోలీసులు వచ్చాక కూడా వారితో వాగ్వాదానికి దిగారు. పోలీసుల ముందే కొన్ని టిప్పర్లు లేన్ల నుంచి అవతలి వైపునకు దూసుకుపోయాయి. ఆ సమయంలో గేట్లు ఎత్తి ఉండటంతో నష్టం జరగలేదు. లేదంటే గేట్లు, దానితో అనుసంధానంగా ఉన్న సాంకేతిక వ్యవస్థకు నష్టం వాటిల్లి ఉండేది. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని చల్లచింతలపూడి గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎన్టీఆర్ జిల్లాలోని దొనబండలో వెట్‌మిక్స్ లోడింగ్ చేసుకోవటానికి చింతమనేనికి చెందిన టిప్పర్లు తిరుగుతున్నాయి. ఎమ్మెల్యేకు చెందిన వాహనాలు కావటంతో టోల్‌ప్లాజా నిర్వాహకులు రెండింటికి ఉచితంగా రాకపోకలు సాగించటానికి అవకాశం కల్పించారు. దొనబండ నుంచి కంకర చిప్స్‌ను తీసుకెళ్తున్నారు. ఆదివారం ఉదయం ఏకంగా 18 టిప్పర్లు వచ్చాయి. దీంతో టోల్‌ప్లాజా సిబ్బంది రెండు వాహనాలకు మినహా మిగిలిన వాటికి టోల్ చార్జీలు చెల్లించాల్సిందేనని చెప్పారు. దీంతో వాహనాల్లో ఉన్న డ్రైవర్లు కిందికి దిగి టోల్‌ప్లాజా నిర్వాహకులతో గొడవపడ్డారు. ఉచితంగా అనుమతించాలని సిబ్బందిపై ఒత్తిడి తెచ్చారు. టోల్‌ప్లాజా సిబ్బంది ససేమిరా అనటంతో మిగిలిన టిప్పర్లన్నింటినీ రోడ్డు పక్కన పార్కింగ్ చేశారు. మధ్యాహ్నం వరకు టిప్పర్లన్నీ అక్కడే ఉన్నాయి. అందులోనే సిబ్బంది ఉన్నారు.
మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారిగా డ్రైవర్లు టిప్పర్లను టోల్‌ప్లాజా లేన్లలోకి తీసుకెళ్లి ఆపివేశారు. వె దురుపావులూరు టోల్‌ప్లాజాలో రాకపోకలకు మొత్తం 12 లేన్లు ఉన్నాయి. ఆరు లేన్లలో టిప్పర్లను ఆపివేసి కిందికి దిగటంతో ఆ మార్గాల్లో వచ్చే వాహనాలన్నీ ఆగిపోయాయి. చూస్తుండగానే భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ట్రాఫిక్‌లో నాలుగు అంబులెన్స్‌లు కూడా చిక్కుకుపోయాయి. దీంతో టోల్‌ప్లాజా సిబ్బంది అంబులెన్స్‌లను బయటకు తీసుకురావటానికి అష్టక ష్టాలు పడ్డారు. వెనక్కు తీయించి గ్రామాలకు సమీపంలో ఉన్న రోడ్ల మీదుగా వాటిని విజయవాడ పంపించారు. ఈ క్రమంలో టోల్‌ప్లాజా సిబ్బంది, టిప్పర్ల డ్రైవర్ల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఉదయం నుంచి ఓపిక పట్టిన సిబ్బంది చివరకు గన్నవరం పోలీసులకు ఫోన్ చేసి చెప్పారు. గన్నవరం సీఐ బీవీ శివప్రసాద్, ఎస్‌ఐ ప్రశాంతి పోలీసులతో టోల్‌ప్లాజా దగ్గరకు వచ్చి ఆరా తీశారు. వారితోనూ డ్రైవర్లు వాగ్వాదం చేశారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు చెందిన టిప్పర్లని, దెందులూరుకు వెట్ మిక్స్ తీసుకెళ్లడం కోసం వచ్చామని చెప్పారు. ఆ తర్వాత లేన్లలో ఉన్న వాహనాలను అక్కడి నుంచి తీయించి రోడ్డు పక్కనే పార్కింగ్ చేయించారు. పార్కింగ్ చేసిన వాహనాలను తీసుకెళ్లిపోతున్నట్లుగా నటించి టోల్‌ప్లాజా నుంచి వేగంగా దూసుకుపోయే ప్రయత్నం చేశారు. పది టిప్పర్ల వరకు లేన్ల నుంచి అవతలి వైపునకు దూసుకెళ్లిపోయాయి. మిగిలిన వాహనాలు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. గన్నవరం పోలీసులు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ఈ వార్తలు కూడా చదవండి
ప్రకృతి సాగులో ఏపీ నంబర్ వన్.. సీఎం చంద్రబాబుకు శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రశంసలు
ఫిబ్రవరి 3న అమరావతి నుంచి తొలి క్వాంటమ్ కంప్యూటర్ ఆవిష్కరిస్తాం: సీఎం చంద్రబాబు