Share News

గ్రామీణ మహిళ చెంతకే మార్కెట్‌!

ABN , Publish Date - Oct 16 , 2026 | 03:42 AM

గ్రామీణ మహిళల ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు ‘స్వయం ఏపీ బ్రాండ్‌ను అందుబాటులోకి తెచ్చామని సీఎం చంద్రబాబు తెలిపారు.

గ్రామీణ మహిళ చెంతకే మార్కెట్‌!

  • ‘స్వయం ఏపీ బ్రాండ్‌’ లక్ష్యం ఇదే

  • ప్రతి మహిళా పారిశ్రామికవేత్తగా మారాలి

  • ప్రతి మహిళకూ ప్రోత్సాహమే మా విధానం: సీఎం

విజయవాడ, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): గ్రామీణ మహిళల ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు ‘స్వయం ఏపీ బ్రాండ్‌ను అందుబాటులోకి తెచ్చామని సీఎం చంద్రబాబు తెలిపారు. సరస్‌ మేళా ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహిళలను సంపద సృష్టికర్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గడిచిన ఏడాది కాలంలో లక్ష మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారుచేశామన్నారు. మరో ఐదు లక్షల మందిని ఆ దిశగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ‘‘సరస్‌.. కేవలం 14 రోజులు పాటు జరిగే ప్రదర్శన కాదు. గ్రామీణ మహిళల ఉత్పత్తులకు ఏడాది పొడవునా మార్కెటింగ్‌ అవకాశాలు కల్పించేదిశగా ప్రోత్సాహం అందిస్తాం. మహిళల ఆదాయాన్ని పెంచడం, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, గ్రామీణ ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడం మేళా ప్రధాన ఉద్దేశం.

దేశంలోని వివిధ ప్రాంతాల మహిళలు కొత్త వ్యాపార అవకాశాలు అన్వేషించాలి. ఏపీలోని 11 లక్షల ఎస్‌హెచ్‌జీల్లో 1.10 కోట్ల మంది సభ్యులు ఉన్నారు. ఈ సంఘాల ద్వారా రూ.69 వేల కోట్ల టర్నోవర్‌ జరుగుతోంది. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులు 3.50 కోట్ల మందికి చేరుతున్నాయి. వెలుగు కార్యక్రమం ద్వారా సంపద సృష్టించే దిశగా అడుగులు వేశారు. నిన్నటి వరకు పొదుపు సంఘాలుగా ఉన్న ఎస్‌హెచ్‌జీలు నేడు వ్యాపార సంస్థలుగా ఎదుగుతున్నాయి. భవిష్యత్తులో అంతర్జాతీయ బ్రాండ్‌లుగా అవి మారాలి. సంక్షేమం నుంచి అభివృద్ధి స్వావలంబన దిశగా మహిళలను ముందుకు తీసుకెళ్లడమే ప్రభుత్వ విధానం. ప్రతి స్వయం సహాయక సంఘం ఒక చిన్న ఆర్థిక శక్తిగా, ప్రతి మహిళా పారిశ్రామికవేత్తగా, ప్రతి గ్రామం ఉపాధి కేంద్రంగా ఎదగాలి. మహిళల భద్రత, ఆత్మగౌరవం, సాధికారతకు ప్రాధాన్యమిస్తూ స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని సాధిద్దాం’’ అని చంద్రబాబు కోరారు.


రాష్ట్రపతికి ఘనవీడ్కోలు

రాష్ట్రపతి ముర్ము రెండు రోజుల పర్యటనను ముగించుకుని తిరిగి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. గన్నవరం విమానాశ్రయంలో కేంద్రమంత్రులు, అధికారులు ఆమెకు ఘనంగా వీడ్కోలు పలికారు. రోడ్డు మార్గాన మధ్యాహ్నం 2.45 గంటలకు విమానాశ్రయానికి చేరుకున్నారు. గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, కేంద్ర మంత్రులు శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, పెమ్మసాని చంద్రశేఖర్‌, కమలేశ్‌ పాశ్వాన్‌, హోంమంత్రి వంగలపూడి అనిత, సీఎస్‌ సాయి ప్రసాద్‌, డీజీపీ హరీ్‌షకుమార్‌ గుప్తా తదితరులు వీడ్కోలు పలికిన వారిలో ఉన్నారు.

ఆడబిడ్డలకు ద్రౌపది ముర్ము స్ఫూర్తి : చంద్రబాబు

సరస్‌ మేళాను ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ద్రౌపది ముర్ము జీవితం ప్రతి ఆడబిడ్డకూ స్ఫూర్తిదాయకం. మారుమూల గిరిజన ప్రాంతంలో జన్మిం చి ఉపాధ్యాయురాలిగా ప్రస్థానం ప్రారంభించారు. ఎన్నో సవాళ్లను అధిగమించి, దేశ అత్యున్నత రాజ్యాంగ పదవిని అధిరోహించారు. సంకల్ప బలం, ధైర్యం ఉంటే మహిళలు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారనేందుకు ఆమె జీవితమే ఒక నిదర్శనం.’’ అని చంద్రబాబు కొనియాడారు.

ఈ వార్తలనూ చదవండి:

మీ ఛాయిస్‌ ఎవరు?

మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేయడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు

Updated Date - Oct 16 , 2026 | 03:42 AM