Share News

చేయీచేయీ కలుపుదాం!

ABN , Publish Date - Oct 14 , 2026 | 04:35 AM

గోదావరి-కావేరి నదుల అనుసంధానంతోనే దక్షిణాది రాష్ట్రాలకు మేలు జరుగుతుందని, ఇందుకోసం ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు చేతులు కలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ రాష్ట్ర సీఎం జోసెఫ్‌ విజయ్‌తో అన్నారు.

చేయీచేయీ కలుపుదాం!

  • గోదారి-కావేరి అనుసంధానంతోదక్షిణాది రాష్ట్రాలకు మేలు

  • తమిళనాడు సీఎం విజయ్‌కు చంద్రబాబు సూచన

  • ప్రధానితో తాను మాట్లాడుతున్నానని..మీరు కూడా కోరాలని వినతి

  • ఉండవల్లి నివాసంలో 25 నిమిషాలు భేటీ

  • అనుసంధానం, చెన్నైకి తాగునీటి సరఫరాపై చర్చ

  • 6 నెలలకోసారి 2 రాష్ట్రాల సీఎస్‌ల భేటీకి నిర్ణయం

  • తర్వాత ఉభయులూ కలిసి దసరా ఉత్సవ్‌కు హాజరు

  • అనుసంధానంపై చర్చించేందుకే వచ్చా

  • మీ ఆతిథ్యానికి కృతజ్ఞతలు: తమిళనాడు సీఎం

అమరావతి, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): గోదావరి-కావేరి నదుల అనుసంధానంతోనే దక్షిణాది రాష్ట్రాలకు మేలు జరుగుతుందని, ఇందుకోసం ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు చేతులు కలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ రాష్ట్ర సీఎం జోసెఫ్‌ విజయ్‌తో అన్నారు. నదుల అనుసంధానం, తమిళనాడు రాజధాని చెన్నై నగరానికి తెలుగుగంగ నుంచి తాగునీటి సరఫరాను కోరేందుకు తమ పబ్లిక్‌ వర్క్స్‌, క్రీడల మంత్రి ఆధవ్‌ అర్జున, తమిళనాడు సీఎస్‌ ఎం.సాయికుమార్‌, ఉన్నతాధికారులతో కలసి విజయ్‌ మంగళవారం సాయంత్రం రాజధాని అమరావతికి వచ్చారు. ఉండవల్లి నివాసంలో ఆయనకు చంద్రబాబు, మంత్రులు లోకేశ్‌, నిమ్మల రామానాయుడు ఎదురేగి ఘన స్వాగతం పలికారు. తర్వాత విజయ్‌కు చంద్రబాబు ప్రత్యేకంగా తేనీటి విందు ఇచ్చారు. ఈ సందర్భంగా గోదావరి-కావేరి అనుసంధానంపై చర్చించారు.

‘ఈ నదులను అనుసంధానించాలని ప్రధాని మోదీని నేను కోరుతున్నాను. తమిళనాడు ప్రజల తరఫున మీరూ అభ్యర్థించండి. ఈ విషయంలో రెండు రాష్ట్రాలూ చేతులు కలపాలి. గోదావరి-కావేరి అనుసంధాన పథకంతో దక్షిణాది రాష్ట్రాల నీటి కొరత తీరుతుంది. దీనిని అమలు చేసే సత్తా మోదీకే ఉంది. రాష్ట్రాలు వేరైనా ప్రజా సమస్యలపై ఎప్పుడూ తమిళనాడుతో ఆంధ్రప్రదేశ్‌ గళం కలుపుతూనే ఉంది. చెన్నైకి తాగునీటి సరఫరా కోసం ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ సమక్షంలో ఏపీ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర సీఎంలు చేసుకున్న ఒప్పందాన్ని గౌరవిస్తాం. చెన్నై దాహార్తి తీర్చడానికి నాటి సీఎంలు ఎన్‌టీఆర్‌, ఎంజీఆర్‌ కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందాలపై గౌరవంతోనే ఎల్‌నినో సమయంలోనూ 4.08 టీఎంసీలను చెన్నైకి ఇచ్చాం’ అని చంద్రబాబు తెలిపారు.


ఏపీపై ఎల్‌నినో తీవ్ర ప్రభావం

ఆంధ్రప్రదేశ్‌పై ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉందని.. తాగునీటికే ప్రాధాన్యం ఇస్తున్నామని.. పంటలకు సాగునీరు అందించలేకపోయామని చంద్రబాబు తమిళనాడు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురిస్తే చెన్నై తాగునీటి అవసరాల కోసం నీరు అందించగలుగుతామని తెలిపారు. ‘ఈ ఏడాది తీవ్ర కరువు నెలకొన్న పరిస్థితుల్లోనూ కండలేరుకు కృష్ణా జలాలు చేరకున్నా.. చెన్నై తాగునీటికి ప్రాధాన్యమిస్తూ 4.08 టీఎంసీలిచ్చాం’ అని గుర్తుచేశారు. అయితే రెండున్నర టీఎంసీలే వచ్చాయని తమిళనాడు సీఎస్‌ చెప్పారు.

జల వనరుల శాఖ ప్రత్యేక సీఎస్‌ శశిభూషణ్‌ కుమార్‌ జోక్యం చేసుకుని.. 4.08 టీఎంసీలూ ఇచ్చామని ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. మరో 2-3 టీఎంసీలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. చెన్నై తాగునీటి సమస్యపై ఆరు నెలలకోసారి ఇరు రాష్ట్రాల సీఎస్‌లూ సమావేశం కావాలని నిర్ణయించారు. 25 నిమిషాల పాటు సీఎంల భేటీ సాగగా.. ఆద్యంతం విజయ్‌ మౌనంగా ఉన్నారు. ఆఖర్లో వెళ్తూ వెళ్తూ చెన్నైకి తాగునీరు కోరుతూ చంద్రబాబుకు లేఖ అందజేశారు. ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌, సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

కొత్త డీఎస్సీలో 290 పోస్టులు

గిన్నిస్‌ బుక్‌లోకి 75 గంటల డప్పుమోత

Updated Date - Oct 14 , 2026 | 04:36 AM