5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలే లక్ష్యం
ABN , Publish Date - Oct 06 , 2026 | 05:44 AM
స్వయం సహాయక సంఘ సభ్యులు ఆర్థికంగా బలోపేతమయ్యేలా అన్ని శాఖలూ సమన్వయంతో కలిసి పనిచేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో సోమవారం సెర్ప్, మెప్మా అధికారులతో 5 లక్షల మంది పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దడం,..
అమరావతి, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): స్వయం సహాయక సంఘ సభ్యులు ఆర్థికంగా బలోపేతమయ్యేలా అన్ని శాఖలూ సమన్వయంతో కలిసి పనిచేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో సోమవారం సెర్ప్, మెప్మా అధికారులతో 5 లక్షల మంది పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దడం, స్వయం ఏపీ అంశాలపై సీఎం సమీక్షించారు. అవసరమైతే కార్పొరేట్ సంస్థల సహకారం తీసుకోవాలని సూచించారు. 5 లక్షల మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా చేయడం లక్ష్యం కావాలని, స్వయం ఉపాధి పొందాలనుకునేవారు ఫ్రాంచైజీలు ప్రారంభించినా... ప్రోత్సహించాలన్నారు. రాష్ట్రంలో కోటికిపైగా ఉన్న స్వయం సహాయక సంఘ సభ్యులు ఆర్థికంగా బలపడితే.. కోటి కుటుంబాలకు పైగా బలపడినట్టేనని చెప్పారు. లక్ష మంది మహిళలు ఒక్కొకరు ఏడాదికి రూ.5 లక్షల వ్యాపారం చేయగలిగితే రూ.5 వేల కోట్ల సామర్థ్యం సాధించినట్టేనన్నారు. డ్వాక్రా మహిళలు తయారు చేస్తున్న వేలాది ఉత్పత్తులకు ఒకే బ్రాండ్, నాణ్యత ప్రమాణాలు, ఆధునిక ప్యాకేజింగ్, ఈ-కామర్స్, సిగ్నేచర్ స్టోర్లు, మార్కెటింగ్ వ్యవస్థను అనుసంధానం చేస్తూ స్వయం ఏపీని తీర్చిదిద్దాలన్నారు. తొలిసారి విజయవాడలో ఈ నెల 15 నుంచి 31 వరకు నిర్వహించతలపెట్టిన నేషనల్ సరస్ మేళా 2026ను విజయవంతం చేయాలని, మహిళా సాధికారత చాటేలా సరస్ మేళా నిర్వహించాలని అధికారులను సీఎం ఆదేశించారు. దీనికి దేశవ్యాప్తంగా ఉన్న మహిళా ఎంటర్‌ప్రెన్యూర్‌లు, మహిళా ఎంపీలను ఆహ్వానించాలని నిర్దేశించారు. మేళాకు రోజుకు లక్ష మంది వస్తారని , రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధికారికంగా 15న ప్రారంభిస్తున్నారని అధికారులు తెలిపారు.
15 నుంచి స్వయం ఏపీ విక్రయాలు..
ఈనెల 15 నుంచి సిగ్నేచర్ స్టోర్లు, ఫ్లిప్‌కార్ట్‌లో స్వయం ఏపీ ఉత్పత్తుల విక్రయాలు ప్రారంభిస్తున్నట్లు సమీక్షలో అధికారులు వెల్లడించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం.. ఉద్యోగుల శిక్షణపై సీఎం స్పెషల్ ఫోకస్
ఏపీలో నాలుగు కొత్త పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం