Share News

పోలవరం ఐకానిక్‌ బ్రిడ్జ్‌కు రూ.2300 కోట్లివ్వండి!

ABN , Publish Date - Oct 06 , 2026 | 05:53 AM

పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వేను జాతీయ రహదారికి అనుసంధానిస్తూ నిర్మించే ‘ఐకానిక్‌ బ్రిడ్జ్‌’ నిర్మాణానికి రూ.2,300 కోట్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని కోరనున్నారు.

పోలవరం ఐకానిక్‌ బ్రిడ్జ్‌కు రూ.2300 కోట్లివ్వండి!

కేంద్రాన్ని కోరనున్న సీఎం చంద్రబాబు

ఎల్లుండి ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రితో భేటీ

అమరావతి, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వేను జాతీయ రహదారికి అనుసంధానిస్తూ నిర్మించే ‘ఐకానిక్‌ బ్రిడ్జ్‌’ నిర్మాణానికి రూ.2,300 కోట్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని కోరనున్నారు. బుధవారం ఆయన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం ఢిల్లీ వెళ్తున్నారు. గురువారం ప్రధాని మోదీతో భేటీ అయ్యే అవకాశం ఉంది. అదేరోజు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ను కలుస్తారు. ఈ సందర్భంగా ఐకానిక్‌ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు కోరతారు. పోలవరం నిర్మాణంలో స్పిల్‌వేపై బ్రిడ్జి నిర్మాణం ప్రస్తావన ఉన్నప్పటికీ.. దీనిపై ఇప్పటిదాకా కేంద్ర జలశక్తి శాఖతో రాష్ట్రప్రభుత్వం ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపలేదు. తొలిసారిగా సీఎం ఐకానిక్‌ బ్రిడ్జి నిర్మాణాన్ని కేంద్ర జలశక్తి మంత్రి వద్ద ప్రస్తావించనున్నారు. రాష్ట్ర జీవనాడి, ప్రజల దశాబ్దాల కల పోలవరం తొలి దశ పనులను వచ్చే ఏడాది మార్చి 31 నాటికి పూర్తి చేయాలని చంద్రబాబు లక్ష్యంగా నిర్దేశించిన సంగతి తెలిసిందే. మొదటి దశలో 41.15 మీటర్ల కాంటూరులో పనులు పూర్తి చేస్తున్నందున..

రెండో దశలో 45.72 మీటర్ల కాంటూరులో 194.60 టీఎంసీల మేర గోదావరి జలాలను నిల్వ చేసే దిశగా పనులు చేపట్టేందుకు అనుమతులివ్వాలని కూడా జలశక్తి మంత్రిని సీఎం కోరతారు. భూసేకరణ, సహాయ పునరావాసానికి రూ.33 వేల కోట్లు మంజూరు చేయాలని అభ్యర్థిస్తారు. కాగా.. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న చింతలపూడి ఎత్తిపోతల పథకానికి కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ నుంచి ఆమోదం రావడంతో పాటు.. ఈ అనుమతులపై రాష్ట్రప్రభుత్వ పరిధిలోనే నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు జారీ చేసినందుకు పాటిల్‌కు చంద్రబాబు ధన్యవాదాలు తెలియజేస్తారు.

ఈ వార్తలనూ చదవండి:

ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం.. ఉద్యోగుల శిక్షణపై సీఎం స్పెషల్ ఫోకస్

ఏపీలో నాలుగు కొత్త పోలీస్‌ కమిషనరేట్ల ఏర్పాటు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం

Updated Date - Oct 06 , 2026 | 05:53 AM