Share News

పెట్టుబడులతో రండి

ABN , Publish Date - Jun 16 , 2026 | 04:30 AM

పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానమని సీఎం చంద్రబాబు అన్నారు. సృజనాత్మకంగా ఆలోచించేవారికి ఇక్కడ విస్తృత అవకాశాలు ఉన్నాయని చెప్పారు.

పెట్టుబడులతో రండి

  • సృజనాత్మకంగా ఆలోచించేవారికి విస్తృత అవకాశాలు

  • రాష్ట్రంలో అపార సహజ వనరులు, మేధో వనరులు

  • రెండేళ్లలో క్వాంటం కంప్యూటర్లు సరఫరా చేస్తాం

  • గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ హబ్‌గా అమరావతి అభివృద్ధి

  • రాష్ట్రంలో ‘ఒక కుటుంబం- ఒక పారిశ్రామికవేత్త’ విధానం అమలు

  • పైసా ఇవ్వకుండా రాజధానికి 33 వేల ఎకరాలు సమీకరించాం

  • సింగపూర్‌లో స్టార్టప్‌ వెంచర్‌ క్యాపిటలిస్టులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం

అమరావతి, జూన్‌ 15(ఆంధ్రజ్యోతి): పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానమని సీఎం చంద్రబాబు అన్నారు. సృజనాత్మకంగా ఆలోచించేవారికి ఇక్కడ విస్తృత అవకాశాలు ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో అపారమైన సహజ వనరులు, మేధోసంపత్తితో కూడిన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సింగపూర్‌ పర్యటనలో ఉన్న ఆయన సోమవారం స్టార్టప్‌ వెంచర్‌ క్యాపిటలిస్టులతో నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, రాజధాని అమరావతిని క్వాంటం వ్యాలీగా రూపొందిస్తున్నామని, రెండేళ్లలో క్వాంటం కంప్యూటర్లు సరఫరా చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. గూగుల్‌ డేటా సెంటర్‌ను విశాఖకు రప్పించామని చెప్పారు. ఐటీ దిగ్గజ కంపెనీలన్నీ విశాఖకు వస్తున్నాయని పేర్కొన్నారు. అనకాపల్లిలో ఆర్సెల్లార్‌ మిట్టల్‌ స్టీల్‌ సిటీ నిర్మిస్తున్నామని తెలిపారు. అమరావతిలో గ్లోబల్‌ విద్యాసంస్థలు ఏర్పాటు అవుతున్నాయన్నారు. అమృత, ఎస్‌ఆర్‌ఎం, విట్‌ వంటి ప్రముఖ వర్సిటీలను ఇప్పటికే తీసుకువచ్చామని, ఇంకా మరెన్నో ప్రసిద్ధ విద్యాసంస్థలు రానున్నాయని చంద్రబాబు వివరించారు. ఆధునిక, వినూత్న ఆలోచనలతో, ఆద్భుత వేగంతో ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా మలుస్తున్నారని చంద్రబాబు ప్రశంసించారు. భారత్‌ను సంస్కరణలతో దూసుకుపోతున్న అతిపెద్ద అర్థిక శక్తిగా ఆయన అభివర్ణించారు. ఎలకా్ట్రనిక్స్‌ పరికరాలు ఇప్పుడు భారత్‌ నుంచి ఎగుమతి అవుతున్నాయని, ఐదో జనరేషన్‌ యుద్ధ విమానాల తయారీ సహా నూతనోత్పత్తులు దేశంలోనే తయారవుతున్నాయని స్పష్టం చేశారు. తయారీ, పారిశ్రామిక రంగాలను ప్రోత్సహించే దిశగా రాష్ట్రంలో ‘ఒక కుటుంబం- ఒక పారిశ్రామికవేత్త’ విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు.


భారత హైకమిషనర్‌తో సీఎం భేటీ

సింగపూర్‌ పర్యటనలో ఉన్న చంద్రబాబు సోమవారం అక్కడి భారత హైకమిషనర్‌ శిల్పక్‌ అంబులేతో భేటీతో అయ్యారు. ఏపీ అభివృద్ధి ప్రయాణంలో సింగపూర్‌ కీలక భాగస్వామి కావాలని సీఎం ఆకాంక్షించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సింగపూర్‌ కంపెనీలను ప్రోత్సహించాలని కోరారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్లర్లు, క్వాంటం టెక్నాలజీ రంగాల్లో ఉన్న అనుకూలతలను వివరించారు. ‘షిప్‌ బిల్డింగ్‌, సివిల్‌ ఏవియేషన్‌లో మెయింటెనెన్స్‌, రిపేర్‌ అండ్‌ ఆపరేషన్స్‌ (ఎంఆర్‌వో) కేంద్రాలు నెలకొల్పేందుకు రాష్ట్రంలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రకృతి సేద్యం విషయంలో కొత్త లక్ష్యాలను సాధిస్తున్నాం. 30 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యానికి రైతులు ముందుకొచ్చారు. రోబోటిక్స్‌, వైద్య పరికరాలు, హార్డ్‌వేర్‌, ఎలక్ర్టానిక్స్‌ తయారీ రంగాల్లో సహకారం కోరుతున్నాం. సింగపూర్‌ టెక్‌ అవసరాలు తీర్చేందుకు రాష్ట్రం సిద్ధంగా ఉంది. భారత్‌ను నం.1 చేయాలననే లక్ష్యంతో ప్రధాని మోదీ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆయన చొరవతో ప్రపంచ స్థాయి సంస్థలు రాష్ట్రానికి వచ్చాయి. సింగపూర్‌ వర్సిటీలు, రాష్ట్ర సంస్థల మధ్య భాగస్వా మ్యం నెలకొల్పండి’’ అని సీఎం కోరారు. హైకమిషనర్‌ స్పందిస్తూ భారత్‌లోని వివిధ రాష్ట్రాలతో కలిసి పనిచేసేందుకు సింగపూర్‌ ఆసక్తిగా ఉందని తెలిపారు.

అమరావతి పనులపై ప్రొఫెసర్ల ఆరా

నేషనల్‌ వర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌ (ఎన్‌యూఎస్‌) అధ్యక్షుడు టాస్‌ ఎంగ్‌ చేయ్‌తో సీఎం సమావేశమయ్యారు. ఎన్‌యూఎస్‌ ఇన్నోవేషన్స్‌, అర్బన్‌ స్టడీస్‌ విభాగాల సీనియర్‌ అధికారులతోనూ చర్చలు జరిపారు. ఏపీలో ఎన్‌యూఎస్‌ ఇంటర్నేషల్‌ బ్రాంచ్‌ లేదా శాటిలైట్‌ క్యాంప్‌సను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అమరావతి క్వాంటం వ్యాలీలో ప్రపంచ స్థాయి సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటుకు సాంకేతిక, పరిశోధనా సాయం కావాలని, గ్లోబల్‌ ఇన్వెస్టర్లను అకర్షించేలా సరికొత్త పాలసీ ఇన్‌స్టిట్యూట్‌ ఏర్పాటుకు సహకరించాలని కోరారు. సీఎం ప్రతిపాదనలపై టాస్‌ ఎంగ్‌ చేయ్‌ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా రాజధాని అమరావతి నిర్మాణ పనుల గురించి పలువురు ప్రొఫెసర్లు ఆరా తీశారు. గతంలో అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించడంలో తమ భాగస్వామ్యాన్ని వారు గుర్తుచేసుకున్నారు.

పరిశ్రమలకు చకచకా భూములు

ఏపీలో భూసమీకరణ విధానాన్ని అర్థవంతంగా, ప్రయోగాత్మకంగా, అచరణాత్మకంగా అమలు చేశామని సీఎం చెప్పారు. రాజధాని అమరావతి నిర్మాణం కోసం 33వేల ఎకరాల భూమిని పైసా ఖర్చులేకుండా సమీకరించామని గుర్తుచేశారు. పౌరసేవలతో పాటు అన్ని అంశాలను టెక్నాలజీతో అనుసంధానించామని తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమలు, వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలకు రికార్డు సమయంలోనే భూసమీకరణ విధానంలో భూములు కేటాయిస్తున్నామన్నారు. గూగుల్‌ డేటా సెంటర్‌కు అవసరమైన భూమిని 2 నెలల్లోనే సమకూర్చామని చెప్పారు. వివిధ పారిశ్రామిక ప్రాజెక్టుల స్థాపనకు ఇదే సరైన సమయమని, ప్రతిభావంతులు, పారిశ్రామికవేత్తలు, వినూత్న ఆలోచనలు కలిగిన మేధావులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని సీఎం ఆహ్వానించారు. రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌తో స్టార్ట్‌పలకు పెట్టుబడులకు వీలుందని చెప్పారు.


2.jpg

సింగపూర్‌ ప్రధానితో సీఎం భేటీ

సింగపూర్‌ ప్రధాని లారెన్స్‌ వాంగ్‌తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. వివిధ అంశాలపై ఇద్దరు నేతలూ దాదాపు అరగంట పాటు చర్చలు జరిపారు. టెక్నాలజీ, సెమీ కండక్టర్లు, క్వాంటం, ఏఐ, వర్సిటీల్లో పరిశోధనలకు సహకారం అందించాలని సీఎం కోరారు. రాష్ట్రంలోని నగర, పట్టణ ప్రాంతాల్లో అర్బన్‌ గవర్నెన్స్‌లోనూ సహకరించాలని కోరారు. ఏపీ నుంచి ఉద్యాన, ఆక్వా ఉత్పత్తులు దిగుమతి చేసుకొనే అంశాన్ని పరిశీలించాలని ప్రతిపాదించారు. ఈ సందర్భంగా రాజధాని అమరావతి నిర్మాణాల గురించి సింగపూర్‌ ప్రధాని అడిగి తెలుసుకున్నారు. విద్యాసంస్థలు, మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో చేపడుతున్న నిర్మాణాల గురించి ప్రత్యేకంగా ఆరా తీశారు. కాగా, సింగపూర్‌ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి వివియన్‌ బాలకృష్ణన్‌తో సీఎం సమావేశమయ్యారు. సింగపూర్‌- ఏపీ మధ్య విమాన కనెక్టివిటీని వృద్ధి చేయాలన్న అభిప్రాయాన్ని ఇరువురూ వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి పి.నారాయణ కూడా పాల్గొన్నారు.

నేడు వరల్డ్‌ సిటీస్‌ సదస్సుకు సీఎం

సింగపూర్‌ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు రెండో రోజున మంగళవారం వరల్డ్‌ సిటీస్‌ సదస్సులో పాల్గొననున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ, అమరావతి ప్రాంత అభివృద్ధి ప్రణాళికలు, సెమికండక్టర్‌ రంగ విస్తరణ లక్ష్యంగా పలు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో ఆయన చర్చిస్తారు. ముందుగా కాకతీయ కల్చరల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించే సీబీఎన్‌ః361 ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం ఆసియా పసిఫిక్‌ సెమినార్‌ ఎకో సిస్టమ్‌పై నిర్వహించనున్న రౌండ్‌టేబుల్‌ సమావేశానికి హాజరవుతారు. మధ్యాహ్నం సింగపూర్‌ ఉప ప్రధాని, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి గాన్‌ కిమ్‌ యాంగ్‌, విదేశాంగ శాఖ సహాయ మంత్రి గాన్‌సియా హువాంగ్‌, ప్రభుత్వ ఉన్నతాధికారులతో సీఎం చర్చలు జరుపుతారు. వరల్డ్‌ సిటీస్‌ సమ్మిట్‌లో లీడర్‌షిప్‌-2 విభాగంలో సీఎం ప్రసంగిస్తారు.


రాష్ట్రంలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను స్థాపించండి

యూఎన్‌-హాబిటాట్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను ఏపీలో ఏర్పాటు చేయాలని సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అనక్లాడియా రోస్‌బాక్‌ను చంద్రబాబు కోరారు. సోమవారం ఆ కంపెనీ ప్రతినిధులతో సీఎం భేటీ అయ్యారు. ఈ కేంద్రం ఏర్పాటకు ప్రతిపాదనలు అందిస్తే అవసరమయ్యే భూమిని కేటాయిస్తామని హామీ ఇచ్చారు. యూఎన్‌-హాబిటాట్‌ భాగస్వామ్యాన్ని సంపూర్ణంగా కోరుకుంటున్నామని తెలిపారు. ఈ ప్రతిపాదనకు రోస్‌బాక్‌ సానుకూలంగా స్పందించారు. విశ్వవిద్యాలయాల మధ్య భాగస్వామ్యం, ప్రణాళికా దశలో ఎస్టీజీలను చేర్చడం, ప్రొఫెషనల్స్‌ నెట్‌వర్క్‌ సహకారంపైనా ఈ సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో పట్టణాల సుస్థిరాభివృద్ధికి యూఎన్‌-హాబిటాట్‌ సహకారం అందించాలని, వాతావరణ మార్పుల నుంచి తీరప్రాంత నగరాల రక్షణకు ఉద్దేశించిన ‘రైజప్‌’ కార్యక్రమాన్ని ఏపీలోనూ అమలు చేయాలని సీఎం కోరారు.

3.jpg

గూగుల్‌ క్లౌడ్‌ బజ్వాతో సీఎం భేటీ

సింగపూర్‌ పర్యటనలో భాగంగా చంద్రబాబు సోమవారం ఉదయం నుంచి షెడ్యూల్డ్‌ కార్యక్రమాల్లో బిజీబిజీగా గడిపారు. గూగుల్‌ క్లౌడ్‌ ఆసియా- పసిఫిక్‌ అధ్యక్షుడు కరణ్‌ బజ్వాతో సీఎం సమావేశమయ్యారు. దేశంలోనే అతిపెద్ద ఏఐ, డేటా సెంటర్‌, డిజిటల్‌ మౌలిక సదుపాయాల కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడంపై వీరి మధ్య చర్చ జరిగింది. ఏఐ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, డిజిటల్‌ గవర్నెన్స్‌ రంగాల్లో గూగుల్‌ ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. ప్రభుత్వ సేవల్లో ఏఐ వినియోగంపై గూగుల్‌ క్లౌడ్‌ సహకారం కావాలని సీఎం కోరారు. ఏఐ స్కిల్లింగ్‌, క్లౌడ్‌ సర్టిఫికేషన్‌ కార్యక్రమాలు విస్తరించాలని భావిస్తున్నట్లు వివరించారు. వర్సిటీలు, ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ఏఐ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ కేంద్రాల ఏర్పాటుపైనా చర్చించారు. సంజీవని ప్రాజెక్టులో భాగస్వాములు కావాలని కరణ్‌ను చంద్రబాబు కోరారు.

Updated Date - Jun 16 , 2026 | 04:30 AM