అభివృద్ధి పరుగు
ABN , Publish Date - Feb 23 , 2026 | 03:54 AM
సంక్షేమాన్ని రాష్ట్ర ప్రజలందరికీ అందిస్తున్నామని.. అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రజలకు అందే సంక్షేమంలో 33 శాతం తపాలా శాఖ ద్వారానే అందుతున్నట్లు చెబుతున్నారని..
ప్రజలందరికీ సంక్షేమం అందిస్తున్నాం: సీఎం
గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పూర్తి
ప్రజారాజధాని అమరావతినీ పూర్తిచేసి రాష్ట్ర ప్రజలకు కానుకగా ఇస్తాం
కేంద్ర, రాష్ట్రాలు చేసే మంచిని గ్రామీణ డాక్ సేవకులే జనంలోకి తీసుకెళ్లాలి
తపాలా సేవలకు సాటి లేదు
గుంటూరు సమ్మేళనంలో సీఎం చంద్రబాబు
ఎంత టెక్నాలజీ వచ్చినా గ్రామీణ డాక్ సేవకులు లేకపోతే గ్రామాల్లో లాజిస్టిక్ సేవలు అందించలేరు. లేఖలు, వస్తువులను చేర్చలేరు. బ్యాంకింగ్ సేవలు, బీమా సేవలు, డీబీటీ, ఈ కామర్స్ సేవలతో ఇండియా పోస్ట్ సేవలు విస్తరించాయి.
- సీఎం చంద్రబాబు
దేహానికి గుండెలాగే భారత మాతకు జీడీఎస్‌లే గుండెకాయ! ఈ దేశంలోని చిట్టచి వరి ప్రాంతం వరకూ ఇండియా పోస్ట్ సేవ లు అందిస్తోంది.
- కేంద్ర మంత్రి సింధియా
గుంటూరు, ఫిబ్రవరి 22(ఆంద్రజ్యోతి): సంక్షేమాన్ని రాష్ట్ర ప్రజలందరికీ అందిస్తున్నామని.. అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రజలకు అందే సంక్షేమంలో 33 శాతం తపాలా శాఖ ద్వారానే అందుతున్నట్లు చెబుతున్నారని.. ఈ నిజాలన్నీ జనాలకు తెలియాల్సి ఉందని చెప్పారు. కేంద్ర, రాష్ట్రాలు చేసే మంచిని గ్రామీణ డాక్ సేవక్ (గ్రామీణ తపాలా సేవకులు-జీడీఎ్‌స)లే వారికి చేర్చాలన్నారు. వికసిత్ భారత్, స్వర్ణాంద్ర- 2047 లక్ష్య సాధనలో వారు భాగం కావాలని పిలుపిచ్చారు. ఆదివారం గుంటూరు శివారులో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామీణ డాక్ సేవక్ సమ్మేళనానికి సీఎం, కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చంద్రబాబు మాట్లాడుతూ.. టెక్నాలజీ ఎంత పెరిగినా.. ఎన్ని ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినా జీడీఎస్‌లను మించి ఎవరూ నిర్వర్తించలేరని స్పష్టంచేశారు. రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్‌సిక్స్ హామీలు సూపర్ సక్సెస్ అయ్యాయంటే అందుకు కారణం వారేనన్నారు. తపాలా సేవలకు ప్రత్యామ్నాయం లేదని తేల్చిచెప్పారు. గత ప్రభుత్వ పెద్దలు పోలవరం ప్రాజెక్టును గోదావరిలో కలిపేశారని.. కానీ తాము 2027 గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేసి జాతికి కానుకగా ఇస్తామన్నారు.
‘దేవతల రాజధాని అమరావతిని శ్మశానమన్నారు. కానీ నేడది ప్రజా రాజధాని. దానిని పూర్తిచేసి రాష్ట్ర ప్రజలకు కానుకగా ఇస్తాం! కేంద్ర సహకారంతో విశాఖ స్టీల్‌ను లాభాల బాటలో పెట్టాం’ అని తెలిపారు. జీడీఎస్ ఉద్యోగులకు ప్రత్యేక డ్రెస్‌కోడ్ ఇచ్చి, ప్రత్యేక గౌరవం కల్పించేందుకు సింధియా కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ‘ఎన్ని యంత్రాలు వచ్చినా, కృత్రిమ మేధ ఎంత వచ్చినా.. మానవీయ స్పర్శతో పనిచేయడం సమర్థులైన జీడీఎ్‌సలకే సాధ్యం. వారికి విద్యుత్ సైకిళ్లు ఇవ్వాలని సింధియా యోచించడం హర్షణీయం. ఏపీ నుంచే దానిని ప్రారంభించాలని.. రాష్ట్రంలోని 17 వేల మందికి విద్యుత్ సైకిళ్లు ఇవ్వాలని కోరుతున్నాను’ అని తెలిపారు.
పాత రోజులు గుర్తొస్తున్నాయి..
‘ఈ సభలో జీడీఎస్‌లను చూస్తుంటే పాత రోజులు గుర్తొస్తున్నాయి. మేం చదువుకునే రోజుల్లో పోస్టుమ్యాన్‌పైనే ఆధారపడేవాళ్లం.. ఎప్పుడు లెటర్ వస్తుందా.. మనీ ఆర్డర్ వస్తుందా అని ఎదురుచూసేవాళ్లం. ఇప్పుడు ప్రతిచేతిలో మొబైల్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అయినా తపాలా శాఖకు ప్రత్యామ్నాయం లేదు’ అని సీఎం చెప్పారు. రాష్ట్రంలో 9,100 పోస్టాఫీసుల్లో 17 వేల మంది జీడీఎస్‌లు సేవలు అందిస్తున్నారని తెలిపారు.
యూత్ కాంగ్రెస్ తీరును ఖండించాలి
‘ప్రపంచం గర్వించదగ్గ స్థాయిలో ఢిల్లీలో ఏఐ సదస్సు జరిగింది. 80 దేశాలు పాల్గొన్నాయి. వ్యవసాయం, ఆరోగ్యం, పాడి పరిశ్రమరంగంలో మనం చేస్తున్న ఏఐ అన్వయంపై ఆ దేశాలు ఆశ్యర్యపోయాయి. అలాంటి కార్యక్రమం వద్ద దేశ ప్రతిష్ఠను దెబ్బతీసేలా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన చేయడం సరికాదు’ అని చంద్రబాబు అన్నారు. అక్కడ అర్ధనగ్న ప్రదర్శనతో దేశం పరువు తీశారని ధ్వజమెత్తారు.
భారత మాతకు జీడీఎస్‌లే గుండెకాయ: సింధియా
‘తెలుగు సినిమా పుష్పలో ఒక ఫేమస్ డైలాగ్ ఉంది.. అది.. ‘తగ్గేదే లే!’.. ప్రకాశం నుంచి ఢిల్లీకైనా.. తెనాలి నుంచి ముంబైకైనా, ప్రపంచ దేశాలకైనా నెల్లూరు రొయ్యలు.. గుంటూరు కారం యూరప్, యూఎస్, పశ్చిమాసియాకైనా.. ఎక్కడి నుంచి ఎక్కడికైనా.. గ్రామీణ డాక్ సేవకులు తగ్గేదే లే! ఎండ, వర్షం, చలి, మంచు కొండలు, ఏ వాతావరణం అయినా, ఏ ప్రాంతమైనా కనిపించేది గ్రామీణ డాక్ సేవకులే!’ అని సింధియా అన్నారు. విజనరీ లీడర్ చంద్రబాబుతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పారు. ‘జీడీఎస్‌లు భారత మాతకు గొప్ప ఆభరణాలు. వారితో నాకు 2007నుంచీ సంబంధబాంధవ్యాలు ఉన్నాయి. అప్పుడు కేంద్ర సహాయ మంత్రిగా ఉండి, పట్టుబట్టి వారికి గొడుగు, షూ, సైకిల్ అలవెన్సులు ఏర్పాటు చేశాం. కేంద్రీయ విద్యాలయాల్లో వారి పిల్లలకు ప్రవేశాలు కల్పించాం’ అని చెప్పారు. టెక్నాలజీని పోస్టల్ సేవలకు జోడిస్తామని.. సేవలను మరింత మెరుగుపరుస్తూ ‘ముందుకే వెళ్తాం’ అని సింధియా మరో తెలుగు పంచ్ డైలాగ్ వదిలారు. పెమ్మసాని మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 7 శాతం వృద్ధి రేటు ఉన్న సమయంలో ఏపీని దేశానికే ఆదర్శంగా నిలుపుతూ.. 14 శాతం వృద్ధి సాధించిన జీడీఎ్‌సలకు శుభాకాంక్షలు తెలిపారు.
పోస్ట్‌మాస్టర్లకు సన్మానం
తొలుత చిత్తూరు, కర్నూలు, విశాఖపట్నం, కడప డివిజన్, కర్నూలు రీజియన్‌ల నుంచి 10 మంది జీడీఎస్ బ్రాంచ్ పోస్టు మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లను సింధియా, చంద్రబాబు సన్మానించారు. వారికి జ్ఞాపికలు అందించారు. సింధియా ఉత్తమ సేవకులకు స్వయంగా కోట్లు తొడిగి, గుండీలుపెట్టి వారిని ఆప్యాయంగా పలకరించారు. కార్యక్రమంలో గుంటూరు మేయర్ కోవెలమూడి రవీంద్ర, ఎమ్మెల్యేలు మొహమ్మద్ నసీర్, గళ్లా మాధవి, బి.రామాంజనేయులు, చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
సింధియా.. సింధియాను సందర్శించాలి: చంద్రబాబు
సింధియా కుటుంబంతో తన అనుబంధం దశాబ్దాలుగా కొనసాగుతోందని చెప్పారు. ‘రాజమాత వసుంధరరాజె సింధియాతో కలిసి పనిచేశాను. ఎన్టీఆర్ అంటే ఆమె ఎంతో అభిమానంగా ఉండేవారు. సింధియా తండ్రి మాధవరావు సింధియాతోనూ పనిచేశాను. వారిది రాజకుటుంబమైనా చాలా సాధారణ వ్యక్తిలా ఉండేవారు. వినయ సంపన్నుడు. సింధియా పూర్వీకులు వందేళక్రితం షిప్ బిల్డింగ్ యూనిట్ నిర్మించిన సింధియా అనే తీర గ్రామం నేడు గాజువాకలో ఉంది. త్వరలోనే ఆ గ్రామాన్ని జ్యోతిరాదిత్య సందర్శించాలని కోరుకుంటున్నా’ అని తెలిపారు. కేంద్రమంత్రి స్పందిస్తూ.. విశాఖలో ఆ ప్రదేశం ఇప్పటికీ సింధియాగా విరాజిల్లుతుండడం తమ అనుబంధానికి నిదర్శనమన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
రిటైర్మెంట్ వరకూ సస్పెన్షన్‌లోనే!