వర్షపు నీటిని నిల్వ చేయండి
ABN , Publish Date - Sep 25 , 2026 | 05:51 AM
రాష్ట్రంలో వర్షాలకు వస్తున్న ప్రవాహాలను సమీపంలోని చెరువులకు మళ్లించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కృష్ణా, గోదావరి డెల్టాల్లో వరద ప్రవాహాలతో రిజర్వాయర్లను, ఇతర నీటి వనరులతో వివిధ చెరువులను నింపాలని సూచించారు.
ప్రవాహాలతో చెరువుల్ని నింపండి
వరదలను రిజర్వాయర్లకు మళ్లించాలి
అవసరమైతే మోటార్లతో లిఫ్ట్ చేయాలి
భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి
ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం నిర్దేశం
క్షేత్రస్థాయి నుంచి ఎలాంటి సాయం కోరినా వెంటనే స్పందించాలని కలెక్టర్లకు ఆదేశాలు
అమరావతి, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వర్షాలకు వస్తున్న ప్రవాహాలను సమీపంలోని చెరువులకు మళ్లించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కృష్ణా, గోదావరి డెల్టాల్లో వరద ప్రవాహాలతో రిజర్వాయర్లను, ఇతర నీటి వనరులతో వివిధ చెరువులను నింపాలని సూచించారు. గురువారం సచివాలయంలోని ఆర్టీజీఎస్‌లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏఐ ఆధారిత సాంకేతిక వినియోగం, డేటా అనలిటిక్స్, ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనే వ్యూహాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్ష ప్రభావంపై సీఎం చర్చించారు. తీవ్ర వాయుగుండం కారణంగా మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు భూగర్భ జలాలు కొంతమేర పెరిగాయని అధికారులు సీఎంకు వివరించారు. ప్రకాశం బ్యారేజీ సహా మున్నేరు, ఇతర క్యాచ్‌మెంట్ ఏరియా నుంచి 11 వేల క్యూసెక్కుల నీరు వస్తోందని చెప్పారు. ప్రాజెక్టుల దిగువనున్న అన్ని నీటి వనరుల్లో వర్షపు నీరు నిల్వ చేయాలని సీఎం సూచించారు. అవసరమైన చోట మోటార్లను వాడి నీటిని లిఫ్ట్ చేయాలన్నారు. గోదావరి నుంచి వస్తున్న ప్రవాహాల ద్వారా 24 టీఎంసీల నీరు ఏలేరు రిజర్వాయర్‌లో నింపాలని ఆదేశించారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి వరకు నీటి వనరుల్లోకి నీటిని పంపాలన్నారు.
రిజర్వాయర్లకు పెరగనున్న ఇన్‌ఫ్లో
16 జిల్లాల్లో వర్షాలు అధికంగా నమోదయ్యాయని అధికారులు వివరించారు. ముఖ్యంగా విశాఖ, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, మన్యం, కాకినాడ, ఉభయగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలు సహా వివిధ జిల్లాల్లో వర్ష ప్రభావం బాగా ఉందన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న వర్షాలు, గాలుల తీవ్రత, నదులు-వాగుల్లో పెరుగుతున్న ప్రవాహాలు, రిజర్వాయర్లలోకి చేరుతున్న వరద నీరు, రాబోయే రోజుల్లో అంచనా వేసిన వర్షపాతంపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. తాజా పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టేలా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ప్రకృతి సాగుతో ఎల్‌నినో ప్రభావానికి చెక్
ఎల్‌నినో నేపథ్యంలో వాతావరణ పరిస్థితులను మార్చడం సాధ్యం కాకపోయినా.. వాటి ప్రభావాన్ని తగ్గించేలా అంతర్గత పరిస్థితులను మార్చుకోవచ్చని సీఎం అన్నారు. ప్రకృతి వ్యవసాయంతో ఎల్‌నినో ప్రభావాన్ని తగ్గించవచ్చని తెలిపారు. మరో రెండురోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు.
శాప్ ద్వారా క్రీడా క్యాలెండర్
శాప్ ఆధ్వర్యంలో ఏడాది క్రీడా క్యాలెండర్‌ను రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. పట్టణాలకే పరిమితం కాకుండా గ్రామ స్థాయిలోనూ క్రీడా పోటీలు నిర్వహించాలని సూచించారు. విద్యుత్ టారీఫ్‌ను పెంచకపోయినా సేవల్లో లోపంతో ప్రజల్లో సంతృప్తి తగ్గుతోందన్నారు. ఈ పరిస్థితిని సరిచేయాలని ఆదేశించారు.
ఈ వార్తలనూ చదవండి...