Share News

పెన్షన్ల కోసం.. ఉమ్మడి కుటుంబాలు చీలిపోవాలా?

ABN , Publish Date - Sep 12 , 2026 | 05:13 AM

ప్రభుత్వం అందించే సంక్షేమ, అభివృద్ధి పథకాల కోసం.. పెద్దవిగా ఉన్న ఉమ్మడి కుటుంబాలు చిన్న చిన్న కుటుంబాలుగా విడిపోవడం బాధాకరమని సీఎం చంద్రబాబు అన్నారు. సంక్షేమ పథకాల ప్రయోజనాల కోసం పెద్ద కుటుంబాలను చిన్న కుటుంబాలుగా విడగొట్టకుండా.. భవిష్యత్‌లో అన్ని పథకాలనూ ఫ్యామిలీ యూనిట్‌గానే అమలుచేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు.

పెన్షన్ల కోసం..  ఉమ్మడి కుటుంబాలు చీలిపోవాలా?
CHANDRABABUNAIDU

  • ఉమ్మడి కుటుంబాల విభజనకు

ప్రభుత్వ విధానాలు కారణం కాకూడదు

  • భవిష్యత్‌లో కుటుంబమే యూనిట్‌గా అన్ని పథకాలూ అమలు: సీఎం

అమరావతి, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం అందించే సంక్షేమ, అభివృద్ధి పథకాల కోసం.. పెద్దవిగా ఉన్న ఉమ్మడి కుటుంబాలు చిన్న చిన్న కుటుంబాలుగా విడిపోవడం బాధాకరమని సీఎం చంద్రబాబు అన్నారు. సంక్షేమ పథకాల ప్రయోజనాల కోసం పెద్ద కుటుంబాలను చిన్న కుటుంబాలుగా విడగొట్టకుండా.. భవిష్యత్‌లో అన్ని పథకాలనూ ఫ్యామిలీ యూనిట్‌గానే అమలుచేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో శుక్రవారం రెండోరోజు కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ.. కొత్త పెన్షన్ల జారీకి ముందే కుటుంబాల మ్యాపింగ్‌ పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న లబ్ధిదారులను యథాతథంగా కొనసాగిస్తూనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ‘మనిషికి 5 కిలోల చొప్పున ఐదుగురు సభ్యుల కుటుంబానికి 25కిలోల బియ్యం ఇచ్చే విధానం వల్ల సమస్యలు వస్తున్నాయి. ఒక కుటుంబంలో ఏడుగురు సభ్యులుంటే.. రేషన్‌ తక్కువగా వస్తోంది. ఇది కూడా కుటుంబాలు విడిపోవడానికి కారణమవుతోంది. కుటుంబంలో ఎంతమంది ఉంటే... అంతమందికి 5 కిలోల చొప్పున రేషన్‌ బియ్యం అందించేలా చూడాలి. ఏడుగురు కుటుంబ సభ్యులుంటే నెలకు 35 కిలోల బియ్యం ఇవ్వాలి. ఇదే కూటమి ప్రభుత్వ విధానం. దానికి అనుగుణంగానే పాలసీలు, కార్యాచరణ ఉండాలి’ అని స్పష్టంచేశారు. 15మంది సభ్యులున్న కుటుంబానికి కిలో బియ్యం ఎక్కువ ఇద్దామన్నారు. సూపర్‌ సిక్స్‌ పథకాలపై దిశానిర్దేశం చేశారు. సీఎం ఇంకా ఏమన్నారంటే..

సంక్షేమానికి రూ.1.50లక్షల కోట్లు..

సంక్షేమ పథకాల అమలులో కుటుంబం యూనిట్‌గా తీసుకుని సమగ్ర ప్రయోజనాలు అందించే విధానాన్ని రూపొందించాలి. వివిధ పథకాల్లో లోటుపాట్లను సరిచేసి అత్యుత్తమ విధానాలు రూపొందించాలి. రాష్ట్రంలో సంక్షేమం కోసం రూ.1.50లక్షల కోట్ల మేర ఖర్చు చేశాం. ఇందులో ఒక్క పెన్షన్లకే రూ.75 వేల కోట్లు వ్యయం చేశాం. సంక్షేమం నుంచి కుటుంబాలను సాధికారత దిశగా తీసుకెళ్లే ‘వెల్ఫేర్‌ టు ఎంపవరింగ్‌ ఫ్యామిలీస్‌’ విధానంతో ముందుకు సాగాలి. ప్రతినెలా మొదటి తేదీని ‘పేదల సేవలో’ కార్యక్రమం ద్వారా సంక్షేమానికి కేటాయించాం. ఆ రోజంతా జిల్లా అధికార యంత్రాంగం ప్రజల సేవలోనే ఉండాలి. ప్రతినెలా 9న ‘మీ భూమి-మీ హక్కు’ ద్వారా భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టాలి. మూడో శనివారం ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’తో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. నాలుగో శనివారం ‘సంజీవని’ కార్యక్రమాన్ని అమలు చేయాలి. ప్రభుత్వం ఆరోగ్య శాఖపై ఏటా 20 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. ఇందులో 5వేల కోట్లు తగ్గితే బాగుంటుంది.


యానాటి కొండలకు ఎస్టీ ప్రయోజనాలు..

శ్రీకాకుళం జిల్లాలో యానాటి కొండ సామాజిక వర్గాన్ని ఎస్టీల్లో చేర్చే అంశం కేంద్రం పరిధిలో ఉంటుంది. ఈలోగా ఎస్టీలకు వర్తింపచేసే ప్రయోజనాలను ఆ సామాజిక వర్గానికి అందించాలి. అసంపూర్తిగా ఉన్న కాపు కార్పొరేషన్‌ భవనాలతో సహా ఇతర కులాలకు చెందిన భవనాలు పూర్తి చేయాలి.

కలెక్టర్లు, సెక్రటరీలకు ఓనర్‌షిప్‌ ఉండాలి..!

పాత పద్ధతులు వీడండి. సమయం వృథా చేయవద్దు. కలెక్టర్లు, సెక్రటరీలు లీడర్లుగా ప్రవర్తించాలి. వారికి ఓనర్‌షిప్‌ ఉండాలి. రియాక్టివ్‌ గవర్నెన్స్‌ నుంచి ప్రో-యాక్టివ్‌ గవర్నెన్స్‌కు మళ్లాలి. ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా ఫలితాలు తీసుకొచ్చే బాధ్యత కలెక్టర్లదే. ఎల్‌నినో నేపథ్యంలో కరువు నివారణ చర్యలు, నీటి సంరక్షణ కార్యక్రమాలు చేపట్టాలి. ఏయే పంటలు వేయాలో ముందే రైతులకు అవగాహన కల్పించి, తక్కువ నీటితో పంటలు పండించే ఏర్పాట్లు చేయాలి. కరువు నివారణ, నీటి సంరక్షణపై ముందస్తు ప్లానింగ్‌ చాలా ముఖ్యం. సంక్షోభాన్ని సవాల్‌గా తీసుకుంటే.. వినూత్న ఆలోచనలు వస్తాయి. అప్పుడే కలెక్టర్ల నాయకత్వం నిరూపణ అవుతుంది. కలెక్టర్ల సదస్సులో తీసుకునే నిర్ణయాలను నిర్దిష్ట గడువులో అమలు చేయాలి. కలెక్టర్లు మానవతా దృక్పథంతో ఆలోచించాలి.

ప్రతి నెలా పేదల సేవలో..

ప్రతినెలా 1న ‘పేదల సేవలో-వెల్ఫేర్‌ డే’ నిర్వహించాల్సిందే. ఉదయం గ్రామాలకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయాలి. సాయంత్రం అదే గ్రామంలో ప్రత్యేక సభ పెట్టి ప్రభుత్వం ఇస్తున్న డబ్బులు వారికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో తెలుసుకోవాలి. కలెక్టర్లు, అధికారులు కచ్చితంగా క్షేత్ర పర్యటనలు చేయాలి. బి.రాజశేఖర్‌, వాకాటి కరుణ, కాటంనేని భాస్కర్‌, మనీశ్‌కుమార్‌ బాగా తిరిగారు. హెచ్‌వోడీల్లో హార్టీకల్చర్‌ శ్రీనివాస్‌, దేవదాయ శాఖ కమిషనర్‌ రామచంద్రమోహన్‌ క్షేత్రస్థాయి పర్యటనలు చేశారు. మిగిలినవారూ వెళ్లాల్సిందే. ఆఫీసులో కూర్చుని సమీక్షలంటే ఏమీ తెలియదు. ప్రజల వద్దకు వెళ్తేనే వాస్తవాలు తెలుస్తాయి. నేను నెలకు 4-5 రోజులు ఫీల్డ్‌లో ఉంటున్నాను. దీనివల్ల గ్రామీణ స్థాయిలో సమస్యలు తెలుస్తున్నాయి. ఈవిషయంలో ఎవరికీ మినహాయింపు ఉండదు. ఫీల్డ్‌ విజిట్స్‌ చేయకపోతే చర్యలు తీసుకోవలసి వస్తుంది.


రేషన్‌, పెన్షన్లు, ఇళ్ల పట్టాలు, ఇళ్ల కోసం పెద్ద కుటుంబాలు చిన్న కుటుంబాలుగా చీలిపోవడం సరికాదు. పెద్ద కుటుంబాలు చిన్నవిగా మారడం బాధాకరం. పెద్ద కుటుంబానికి ప్రాధాన్యమివ్వడం, ఆ కుటుంబానికి ఎక్కువ ప్రయోజనాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం.

ప్రభుత్వం అంటే గుడ్డిగా పని చేయడం కాదు. ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకోవాలి. ప్రతి కలెక్టర్‌ ప్రత్యేక ముద్ర వేసుకోవాలి. ఏసీ రూమ్‌లో కూర్చుంటే.. కడుపు మండినవాడు తప్పుడు ప్రచారమే చేస్తాడు. - సీఎం చంద్రబాబు

ఈ వార్తలు కూడా చదవండి..

ఆర్‌డబ్ల్యూఎస్‌ కాంట్రాక్టర్లకు గుడ్ న్యూస్.. రూ.620 కోట్లు విడుదల చేసిన కూటమి ప్రభుత్వం

ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడు ఫస్ట్: సీఎం చంద్రబాబు

Updated Date - Sep 12 , 2026 | 05:33 AM