Share News

ప్రభుత్వ సేవల్లో నాణ్యత పెరగాలి

ABN , Publish Date - Oct 06 , 2026 | 06:12 AM

ప్రజలకు అందించే ప్రభుత్వ సేవల్లో నాణ్యత పెరగాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అందుకు ప్రభుత్వ ఉద్యోగులు నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటూ తమ నైపుణ్యాలను, సామర్థ్యాన్ని మెరుగు పరుచుకోవాలన్నారు.

ప్రభుత్వ సేవల్లో నాణ్యత పెరగాలి

  • ఆర్టీజీఎస్‌ సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశాలు

అమరావతి, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): ప్రజలకు అందించే ప్రభుత్వ సేవల్లో నాణ్యత పెరగాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అందుకు ప్రభుత్వ ఉద్యోగులు నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటూ తమ నైపుణ్యాలను, సామర్థ్యాన్ని మెరుగు పరుచుకోవాలన్నారు. కెపాసిటీ బిల్డింగ్‌ కమిషన్‌, మిషన్‌ కర్మయోగి పోర్టల్‌, ఉన్నతి ద్వారా అందుబాటులో ఉన్న ఆన్‌లైన్‌ కోర్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్‌తో పాటు ఐఐఎంలు, ఐఐటీలు, విశ్వవిద్యాలయాలు తదితర సంస్థల్లో ఆఫ్‌లైన్‌ శిక్షణ కూడా పొందాలన్నారు. సోమవారం అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ఆర్టీజీఎస్‌ సమీక్షలో భాగంగా వివిధ శాఖలు అందిస్తున్న పౌర సేవలపై ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ టీచర్‌ ఏకంగా 4,200 కోర్సులు పూర్తి చేసి, తన సామర్థ్యాన్ని పెంచుకున్న విషయాన్ని ప్రస్తావించారు. ఉద్యోగులు తమ విధులకు సంబంధించిన అంశాలతో పాటు ఆధునిక సాంకేతికత, పరిపాలన, ప్రజాసేవకు సంబంధించిన కోర్సులను అభ్యసించాలని సూచించారు.

గృహ నిర్మాణ లక్ష్యాలను పూర్తి చేయాలి

రోడ్లపై గుంతల పూడ్చివేతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని సీఎం ఆదేశించారు. రహదారుల నిర్వహణపై నిరంతరం దృష్టి పెట్టాలని సూచించారు. ఆర్టీసీ బస్సులు నిర్ణీత సమయానికి గమ్య స్థానాలకు చేరేలా టైమ్‌ మేనేజ్‌మెంట్‌ పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం చేపట్టిన 3 లక్షల ఇళ్ల నిర్మాణంతో పాటు మరో 6 లక్షల ఇళ్ల నిర్మాణానికి కార్యాచరణ రూపొందించాలని సూచించారు. వచ్చే రెండున్నర ఏళ్లలో నిర్దేశించుకున్న లక్ష్యాలను పూర్తి చేయాన్నారు. జల్‌జీవన్‌ మిషన్‌తో ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా తాగునీరు అందించే లక్ష్యాన్ని రెండేళ్లలో పూర్తిచేయాలని చంద్రబాబు నిర్దేశించారు. పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన పనులను వేగవంతం చేయాలన్నారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో మొబైల్‌ కనెక్టివిటీ పెంచేందుకు అవసరమైన ప్రాంతాల్లో సెల్‌ టవర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పీఎం సూర్యఘర్‌ పథకం కింద ఇళ్లపై సోలార్‌ ప్యానెళ్ల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల ఇళ్లకు సోలార్‌ కనెక్షన్లు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు.


నిరంతర ప్రక్రియగా ఉద్యోగ అవకాశాల కల్పన

కొత్త పెట్టుబడులకు అనుగుణంగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను రూపొందించాలని సీఎం సూచించారు. ప్రస్తుత పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు అందించాలన్నారు. ఐటీఐలు, పాలిటెక్నిక్‌ కళాశాలలను పరిశ్రమలతో అనుసంధానించి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ఉద్యోగావకాశాల కల్పన నిరంతర ప్రక్రియగా ఉండాలని, యువతకు ఆన్‌లైన్‌ కోర్సుల ద్వారా కూడా నైపుణ్యాలు పెంపొందించాలని సూచించారు. నైపుణ్య పోర్టల్‌ను ఇతర వ్యవస్థలతో సమగ్రంగా అనుసంధానం చేయాలన్నారు. సమీక్షలో రెవెన్యూ, ఆర్థిక, ఐటీ, మహిళా శిశుసంక్షేమం, సెర్ప్‌ రవాణా, దేవదాయ, అగ్నిమాపకశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం.. ఉద్యోగుల శిక్షణపై సీఎం స్పెషల్ ఫోకస్

ఏపీలో నాలుగు కొత్త పోలీస్‌ కమిషనరేట్ల ఏర్పాటు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం

Updated Date - Oct 06 , 2026 | 06:12 AM