ఎందుకింత కక్ష?
ABN , Publish Date - Jul 02 , 2026 | 03:43 AM
ఒక్కసారి అధికారం ఇచ్చిన పాపానికి గొడ్డలి పార్టీ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు.
నాడు మూడు ముక్కలు.. ఇప్పుడేమో మావిగన్
రాజధానిని ఇంతలా వ్యతిరేకించే పార్టీ రాష్ట్రానికి అవసరమా?
నాడు రాజధానికి మద్దతు ప్రకటించి..అడుగడుగునా జగన్ అడ్డంకులు
నిన్న పరిరక్షణ పేరిట రౌడీలతో దండయాత్ర
అధికారం కోసం మళ్లీ అరాచక పర్వం
నాడు సభలో నా భార్యను అవమానించారు
నిన్న దళిత హోం మంత్రిని కించపరిచారు
నేడు పవన్ కుమార్తెను అవమానిస్తూ పోస్టులు
కులం, మతం పేరుతో చిచ్చుకు ప్రయత్నాలు
ఈ గంజాయి బ్యాచ్‌కు భయపడే ప్రశ్నే లేదు
ప్రజాస్వామ్యం, శాంతి కావాలంటే గొడ్డలి పార్టీని తరిమేయాలి: సీఎం చంద్రబాబు
నెల్లూరు జిల్లాలో పింఛన్లు పంపిణీ
నెల్లూరు, జూలై 1 (ఆంధ్రజ్యోతి): ఒక్కసారి అధికారం ఇచ్చిన పాపానికి గొడ్డలి పార్టీ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ‘‘ఒక రాజధాని మీద ఎందుకు ఇంత కక్ష? రాష్ట్రానికి ఒక రాజధాని ఉండటాన్ని ఇంతలా, ఇన్ని రకాలుగా వ్యతిరేకించే పార్టీని రాజకీయ పార్టీ అంటారా? ఇలాంటి పార్టీ మనకు అవసరమా? ప్రజలే ఆలోచించుకోవాలి.’’ అని సీఎం అన్నారు. రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్‌లో తీర్మానం చేస్తే గొడ్డలి పార్టీ దానిని వ్యతిరేకించిందని, ఇప్పుడు కొత్తగా మావిగన్ అని అంటోందని ఆయన ఆగ్రహించారు. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం పున్నపువారిపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను సీఎం అందించారు. అనంతరం ‘పేదల సేవలో’ ప్రజావేదికపై ఆయన ప్రసంగించారు. ‘‘ప్రపంచ దేశాల్లో ఏ రాష్ట్రంలో లేనంత గొప్పగా 25 రకాల సామాజిక పింఛన్లు పంపిణీ చేస్తున్నాం. రెండేళ్లలోనే పింఛన్ల కోసం రూ. 65,598 కోట్లు ఖర్చు చేశాం. ప్రతి నెలా మొదటి తేదీ వచ్చిందంటే ఆ నెల మొత్తం పడిన శ్రమనంతా మరిచిపోతా. పేదల మధ్య గడపడం నాకెంతో తృప్తి.’’ అని వ్యాఖ్యానించారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి కట్టుబడిన విధానాన్ని వివరిస్తూ, అరాచకాలు సృష్టించాలని ప్రయత్నించే వారిని ఉక్కుపాదం కింద అణచివేస్తామని హెచ్చరించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
నాతోనే కన్నీళ్లు పెట్టించిన సైకోలు వీళ్లు..
‘‘తీవ్రవాదులు నన్ను చంపడానికి క్లెమోర్‌మైన్లు పేల్చినప్పుడు కూడా నేను కంట తడి పెట్టలేదు. అలాంటిది నా భార్య గురించి అసెంబ్లీ సాక్షిగా అవమానకరంగా మాట్లాడినప్పుడు మాత్రం, ఉక్కుమనిషినైన నేనే తట్టుకోలేక, కన్నీళ్లు పెట్టుకున్నాను. కుటుంబ సభ్యులను అవమానించడం ద్వారా మమ్మల్ని కుంగదీయాలని సైకో నాయకుడు తన మనుషులను రెచ్చగొడుతున్నాడు. మొన్న గొడ్డలి పార్టీ మాజీ మంత్రి... దళిత మహిళ అయిన హోం మంత్రి అనితను అవమానకరంగా మాట్లాడాడు. నిన్న నా మిత్రుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కుమార్తె గురించి అవమానకరంగా పోస్టింగ్‌లు పెట్టారు. కులాల పేరుతో, మతాల పేరుతో రాష్ట్రంలో చిచ్చు రగిలించాలని చూస్తున్నారు. ఇలాంటి వాటికి నేను భయపడే ప్రసక్తి లేదు.’’
ఆడ పడుచులను అవమానిస్తే..
‘‘రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం, ప్రజా రంజక పాలన... ఇవీ మా లక్ష్యాలు. వీటి నుంచి మమ్మల్ని ఎవరూ వేరు చేయలేరు. నా ఆడపడుచులను అవమానించినవారు ఎవరైనా సరే వారికి అవే ఆఖరి రోజులు. రాష్ట్రంలో శాశ్వత పేదరిక నిర్మూలన కోసం పవిత్రాశయంతో కూటమి ప్రభుత్వం యజ్ఞం చేస్తుంటే, గొడ్డలి పార్టీ రాక్షసులు దానికి అడ్డంకులు సృష్టిస్తున్నారు. దేశ చిత్రపటంలో రాష్ట్రాన్ని నంబర్ వన్ స్థానంలో నిలపాలి. అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు ఇబ్బంది లేని పాలన..ఇవీ నా ప్రయత్నాలు. ఇవే ఆశయాలతో పవన్ కల్యాణ్ చేతులు కలిపారు. ప్రధాని మోదీ కలిసి వచ్చారు. ముగ్గురం కలిసి రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు కష్ణపడుతున్నాం. కానీ ఇది చూసి ఓర్వలేక రోజుకో తప్పుడు న్యూస్‌ను గొడ్డలి పార్టీ నేతలు సృష్టిస్తున్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చు రగిలిస్తున్నారు. నేను ఎన్నో పార్టీలను చూశాను. కానీ నేరాలు చేయించే పార్టీని, నేరస్థులను కాపాడే పార్టీని, నేరస్థులతో రాజకీయాలు చేయించే పార్టీని నా 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ, ఎక్కడా చూడలేదు. విజయవాడలో ఒక వ్యక్తి మిస్ అయ్యాడు. దీనిపై విచారణకు సిట్‌ను నియమించాను. కానీ గొడ్డలి పార్టీ సైకోలు ఆ సంఘటనకు కులం ముద్ర వేశారు. పవన్ మీద నిందలు వేశారు. ఆయన కుమార్తె మీద పోస్టింగ్‌లు పెట్టారు. ఇదేం అన్యాయం? మహిళలను గౌరవం లేకుండా అవమానిస్తారా? ఒక్కసారి అధికారం ఇచ్చిన పాపానికి రాష్ట్రాన్ని అధోగతిపాల్జేశారు. గంజాయి హబ్‌గా మార్చేశారు. గత ప్రభుత్వంలో స్వేచ్ఛగా ఉన్నారా? ఈ ప్రభుత్వంలో స్వేచ్ఛగా ఉన్నారా? శాంతిభద్రతలు అప్పుడు బాగున్నాయా.. లేక ఇప్పుడా? గంజాయి బ్యాచ్‌ను అణచివేశామా లేదా!? రౌడీయిజాన్ని తరిమికొట్టామా లేదా!? మీరే చెప్పండి.’’
సుస్థిర అధికారంతోనే అభివృద్ధికి బాట
‘‘గుజరాత్‌లో 25 సంవత్సరాలుగా ఒకే పార్టీ అధికారంలో ఉంది. అందువల్లే ఆ రాష్ట్రం అభివృద్ధిలో నంబర్ వన్ స్థానంలో ఉంది. కేంద్రంలో నరేంద్రమోదీ మూడు పర్యాయాలు ప్రధానిగా ఎన్నికయ్యారు. ఆ కారణంగానే దేశవ్యాప్తంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రపంచ దేశాల్లో భారత్ బలమైన దేశంగా గుర్తింపు పొందింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నేను వరుసగా తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నాను. హైదరాబాద్‌ను అభివృద్ధి చేశాను. ఇప్పుడు ఆ నగరం దేశంలో నంబర్ వన్ స్థానంలో ఉంది. అలాంటి అవకాశమే ఇక్కడ కూటమి ప్రభుత్వానికి ఇవ్వండి. రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా అభివృద్ధి చేసి చూపిస్తాం. వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో విధ్వంసం జరిగింది. సాధారణంగా అయితే 30, 40 ఏళ్లపాటు రాష్ట్రం కోలుకునే పరిస్థితి లేదు. కానీ నిరంతర కృషితో, కేంద్రం సహకారంతో రెండేళ్లలోనే ఏపీని గాడిలో పెట్టాం. మళ్లీ ఎన్నికల్లో తప్పుడు నిర్ణయం తీసుకుంటే, రాష్ట్రం అథోగతిపాలవుతుంది. వైకుంఠపాళీ ఆడినట్లే అవుతుంది. నేరస్థులకు వంత పాడటం మంచిది కాదు. జీవితంలో అలాంటి పార్టీ గెలవడానికి వీలులేదని సంకల్పం పూనాలి.’’
నెల్లూరు జిల్లాకు 27 భారీ పరిశ్రమలు
‘‘నెల్లూరు జిల్లాకు 27 భారీ పరిశ్రమలు రాబోతున్నాయి. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ఉదయగిరి ప్రాంతంలో డిఫెన్స్ పరిశ్రమలు వస్తున్నాయి. క్రిష్ సిటీ దేశంలో నంబర్ వన్ పారిశ్రామికవాడగా అభివృద్ధి చెందబోతోంది. రెండ్రోజుల్లో కడపలో స్టీల్ ప్లాంట్‌కు భూమి పూజ చేయబోతున్నాం. సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించడమే నా జీవిత ఆశయం. అందుకే బంగారు కుటుంబాల పథకం ఎంచుకున్నాను. ఆగస్టు 15 నుంచి సంజీవిని పథకం అమలులోకి వస్తుంది. వెలిగొండ ప్రాజెక్టు ఫస్ట్ ఫేజ్ ఈ ఏడాదిలోపు పూర్తి చేస్తాం. నిర్వాసితులకు తొలివిడతగా 300 కోట్లు ఇచ్చాం. ఈ రెండేళ్ల కాలంలో దేశంలోకి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 26శాతం వాటా ఆంధ్రకు వచ్చాయంటే రాష్ట్రం, ప్రభుత్వం పట్ల పారిశ్రామికవేత్తలకు ఉన్న నమ్మకం ఎలాంటిదో అర్థం చేసుకోవాలి. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే రాజకీయంగా ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలి. నేరాలు చేసే పార్టీని, నేరస్థులను కాపాడే పార్టీని, నేరస్థులతో రాజకీయాలు చేయించే గొడ్డలి పార్టీని భవిష్యత్‌లో గెలిపించకూడదు’’ అని చంద్రబాబు కోరారు. కార్యక్రమంలో మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, ఫరూక్, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, గూడూరు ఎమ్మెల్యే పాశిం సునీల్, ఎమ్మెల్సీలు బీద రవిచంద్ర, బల్లి కల్యాణ్ చక్రవర్తి, కలెక్టర్ హిమాన్షు శుక్లా తదితరులు పాల్గొన్నారు.
నెల్లూరు కలెక్టర్ పనితీరు భేష్.. హిమాన్షు శుక్లాకు సీఎం అభినందన
ప్రజా సేవలో నెల్లూరు అధికార యంత్రాంగం పనితీరు అద్భుతంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న 57 సేవలకుగాను 55 సేవల అమలులో ప్రజల సంతృప్తి శాతం రాష్ట్ర సగటు కంటే నెల్లూరు జిల్లాలో ఎక్కువగా ఉందని తెలిపారు. సంతృప్తి స్థాయిలో గతేడాది రెండో స్థానంలో ఉన్న జిల్లాను, ఇప్పుడు మొదటి స్థానంలోకి తీసుకొచ్చారంటూ కలెక్టర్ హిమాన్షు శుక్లాను అభినందించారు. ప్రజావేదిక కార్యక్రమంలో వివిధ శాఖల ప్రగతి నివేదికలను చంద్రబాబు చదివి వినిపించారు. పీజీఆర్‌ఎస్ అర్జీల పరిష్కారంలో మెరుగైన పనితీరు కనబరుస్తున్నారంటూ జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లను అభినందించారు. గంజాయి, మహిళలపై నేరాల నియంత్రణలో నెల్లూరు జిల్లా పోలీసు శాఖ సమర్థవంతంగా పనిచేస్తోందంటూ ఎస్పీ అజిత వేజండ్లను ప్రశంసించారు.