తక్షణం సాయం చేసి ఆదుకోండి!
ABN , Publish Date - Nov 03 , 2026 | 03:52 AM
అర్నబ్ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లిందని, కేంద్ర ప్రభుత్వ సహాయం తక్షణం అందేలా చూడాలని సీఎం చంద్రబాబు కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు.
తుఫాన్ నష్టాన్ని సమగ్రంగా పరిశీలించి, త్వరితగతిన సిఫారసులు సమర్పించండి
కేంద్ర బృందానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
‘అర్నబ్’ నష్టం నుంచి కోలుకోకముందే మరో తుఫాన్ వస్తోందని వెల్లడి
రాష్ట్ర ప్రభుత్వ తక్షణ స్పందన, సహాయ చర్యలపై కేంద్ర అధికారుల ప్రశంసలు
అమరావతి, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): అర్నబ్ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లిందని, కేంద్ర ప్రభుత్వ సహాయం తక్షణం అందేలా చూడాలని సీఎం చంద్రబాబు కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు. ప్రాథమిక అంచనా ప్రకారం రూ.4,526 కోట్ల మేర నష్టం జరిగిందని, దీనిపై ఇప్పటికే నివేదికను కేంద్రానికి సమర్పించామని తెలిపారు. తుఫాన్ నష్టాన్ని అంచనా వేసేందుకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందం సభ్యులు.. సోమవారం సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. కేంద్ర హోం, ఆర్థిక, వ్యవసాయ, జలవనరులు, జాతీయ రహదారులకు చెందిన అధికారులు ఈ బృందంలో ఉన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక అంచనా నివేదికను సమర్పించిన వెంటనే.. నష్టం అంచనాకు కేంద్ర బృందం రాష్ట్రానికి రావడంపై సీఎం ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని సమగ్రంగా పరిశీలించి, త్వరితగతిన సిఫారసులు సమర్పించాలని కోరారు. సత్వర ఆర్థిక సహాయం అందితే ఎంతో ఊరట కలుగుతుందన్నారు. ఈ సందర్భంగా అర్నబ్ తుఫాన్ నష్టం అంచనాలో భాగంగా కోనసీమ, పశ్చిమగోదావరి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో పర్యటనపై కేంద్ర బృంద సభ్యులు సీఎంకు వివరించారు. నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు తెలిపారు. వరి, కొబ్బరి, అరటి, ఇతర పంటలకు తీవ్ర నష్టం జరిగినట్లు గుర్తించినట్లు తెలిపారు. పంట చేతికొచ్చే సమయంలో తుఫాన్ కారణంగా రైతులకు నష్టం మరింత పెరిగిందని పేర్కొన్నారు.
ఓ వైపు కరువు.. మరోవైపు తుఫాన్లు
వ్యవసాయ పంటలతో పాటు ఉద్యాన, ఆక్వా కల్చర్ వంటి వాణిజ్య పంటలు కూడా దెబ్బతిన్నాయని సీఎం చంద్రబాబు కేంద్ర బృందానికి చెప్పారు. మత్స్యకారుల పడవలకు కూడా నష్టం వాటిల్లిందన్నారు. అర్నబ్ తుఫాన్ మిగిల్చిన నష్టం నుంచి ఇంకా కోలుకోకముందే మరో తుఫాన్ ‘మురసు’ రాష్ట్రాన్ని తాకుతోందని పేర్కొన్నారు. హుద్‌హుద్, తిత్లీ, మొంథా వంటి తుఫాన్లు గతంలోనూ రాష్ట్రానికి తీవ్ర నష్టాన్ని కలిగించాయని గుర్తుచేశారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ఒక ప్రాంతం ఎల్‌నినోతో తీవ్ర కరువు పరిస్థితులను ఎదుర్కొంటుండగా, మరో ప్రాంతం తుఫాన్ల ప్రభావానికి గురవుతోందన్నారు.
కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఉద్యాన పంటల వైపు మరలుతున్నామని, అలాగే తుఫాన్లను ఎదుర్కొనేందుకు టెక్నాలజీని వినియోగిస్తున్నామని వివరించారు. రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రంతో పాటు వివిధ సాంకేతిక పరిజ్ఞానాలను అనుసంధానం చేయడం ద్వారా తుఫాన్ల సమయంలో ప్రాణనష్టాన్ని భారీగా తగ్గించగలుగతున్నామని చెప్పారు. ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించడంలో ఆర్టీజీఎస్, మనమిత్ర వాట్సాప్ సేవలు కీలకంగా పనిచేశాయని కేంద్ర బృందం అభిప్రాయపడింది. ఏపీ ప్రభుత్వం అనుసరించిన ఈ ఉత్తమ విధానాలను ఇతర రాష్ట్రాలకు కూడా సిఫారసు చేస్తామని తెలిపింది.
రాష్ట్ర ప్రభుత్వ స్పందన భేష్
తుఫాన్ కారణంగా విద్యుత్, రహదారుల వంటి మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని సీఎం తెలిపారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కోసం 7 వేల మంది సిబ్బందితో యుద్ధప్రాతిపదికన పనిచేసినట్లు వెల్లడించారు. పునరావాసం, సహాయక చర్యలు, పునరుద్ధరణ పనులను ఆర్టీజీఎస్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులను పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన తీరు, సహాయక చర్యలు-పునరుద్ధరణ పనులకు చేసిన కృషిని కేంద్ర బృందం ప్రశంసించింది. ముఖ్యంగా విద్యుత్, రహదారుల పునరుద్ధరణకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టడం అభినందనీయమని పేర్కొంది. మారుమూల ప్రాంతాల్లో సైతం ఈ పనులు వేగంగా జరుగుతున్నాయని వెల్లడించింది.
ఈ వార్తలనూ చదవండి:
త్వరితగతిన రాష్ట్రానికి సాయం అందించండి.. కేంద్రానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
ఏపీ లిక్కర్ స్కామ్.. ఈడీ కస్టడీలో నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి