Share News

మరీ ఇంత నీచమా?

ABN , Publish Date - Feb 22 , 2026 | 03:34 AM

తిరుమలలో నాడు నాసిరకం ప్రసాదాలను భక్తులకు పంచిపెట్టారని, ఇప్పుడేమో తాము చేసిన తప్పును వైసీపీ నేతలు వేరే వాళ్లపైకి నెట్టేసే నీచానికి పాల్పడుతున్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహించారు.

మరీ ఇంత నీచమా?
CM Chandrababu Naidu

  • తప్పు చేసి మాపై నిందలా?

  • తిరుమల పవిత్రత దెబ్బతీసే హక్కు వైసీపీ వాళ్లకు ఎవరిచ్చారు?

  • చెప్పులేసుకుని స్వామి ఫొటోను సభలోకి తెచ్చి విసిరికొడతారా?

  • అధికారంలో ఉన్నా, విపక్షంలో

  • ఉన్నా బూతులు తిడుతున్నారు

  • ఆంబోతుల్లా ప్రవర్తిస్తున్నారు

  • బూతులు తిట్టేవారికి పరామర్శలు

  • వైసీపీ వాహనాల కింద నలిగేవారిని మాత్రం పట్టించుకోరా?

  • పల్నాడు జిల్లా వినుకొండ పర్యటనలో సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం

  • గ్రామాల్లో 100శాతం చెత్త సేకరణ

  • వృత్తాకార ఆర్థిక వ్యవస్థను పునర్నిర్వచిస్తున్నాం: సీఎం

నేను బాంబులకు కూడా భయపడలేదు. 23 క్లైమోర్‌ మైన్స్‌ పెడితే వేంకటేశ్వరస్వామి కిందకు దిగి వచ్చి నన్ను కాపాడారు. మా ఇంటి దైవం వేంకటేశ్వరస్వామి. అలాంటి స్వామికి అపచారం తలపెడుతున్నారు. తమ తప్పును వేరే వాళ్లపై వేసే నీచులు వీళ్లు. శివుడి తలపై పాము ఉంటే, అది ఎక్కడ కాటు వేస్తుందోనని అంతా భయపడతారు. నేను మాత్రం శివుడికి నమస్కారం పెట్టి, ఆ పామును బయటకు తీసుకొచ్చి ఏం చేయాలో అది చేస్తాను.

- సీఎం చంద్రబాబు

గుంటూరు(వినుకొండ), ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో నాడు నాసిరకం ప్రసాదాలను భక్తులకు పంచిపెట్టారని, ఇప్పుడేమో తాము చేసిన తప్పును వైసీపీ నేతలు వేరే వాళ్లపైకి నెట్టేసే నీచానికి పాల్పడుతున్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహించారు. వేంకటేశ్వర స్వామిపై భక్తులకు ఉన్న నమ్మకాన్ని, పవిత్రతను దెబ్బతీసే అధికారం వీళ్లకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ‘‘‘‘సాక్ష్యాత్తు వేంకటేశ్వరస్వామి ఫొటోను కౌన్సిల్‌లోకి తీసుకెళ్లారంటే వీళ్లని ఏమనాలి? చెప్పులేసుకొని ఫొటోలు తీసుకొని వచ్చి వాటిని విసిరి పారేశారు. తమ రాజకీయ పార్టీ ఉందన్న అహంకారమే దీనంతటికి కారణం.’’ అని మండిపడ్డారు. శనివారం స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు పల్నాడు జిల్లా వినుకొండ పట్టణానికి వచ్చారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ‘‘మేం అధికారం చేపట్టగానే తిరుమల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టి కొత్త ఈవోను నియమించాం. నెయ్యిలో కల్తీ ఉందని అప్పుడే తేలింది.


ఆ శాంపిల్‌ను ఎన్‌డీడీబీకి పంపిస్తే అందులో జంతుకొవ్వు ఉందని నివేదిక వచ్చింది. అదే విషయం నేను చెప్పాను. వైసీపీ వాళ్లు లేనిపోనివి సృష్టించి సుప్రీంకు వెళితే సిట్‌ను ఏర్పాటు చేసింది. సిట్‌ నివేదికలో లడ్డూ తయారీలో వినియోగించినది నెయ్యే కాదని చెప్పింది. దీనిపై చర్యలు తీసుకోమని ప్రభుత్వానికి సూచించింది.’’ అని తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..

రాజకీయ ప్రక్షాళనకు ప్రజలు కలిసిరావాలి

‘‘శివుడి తలపై పాము ఉంటే, అది ఎక్కడ కాటు వేస్తుందోనని అంతా భయపడతారు. నేను శివుడి తలపై పాము ఉంటే, ఆయనకు నమస్కారం పెట్టి, పామును బయటకు తీసుకొచ్చి ఏమి చేయాలో అది చేస్తాను. ప్రజలు కూడా తమకెందుకని కూర్చోకుండా ముందుకొచ్చి వైసీపీ లాంటి చెడు పార్టీలను నిరాకరిస్తే రాజకీయాలు ప్రక్షాళన అవుతాయి. వైసీపీ వాళ్లు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా బూతులు తిడుతున్నారు. నేను ప్రతిపక్షంలో ఉండగా, నా భార్యను దూషించారు. ఆంబోతుల మాదిరిగా ప్రవర్తిస్తూ రెచ్చగొడుతున్నారు. రాష్ట్రాన్ని గంజాయితో సర్వనాశనం చేశారు.’’

బాలికల రేపిస్టులను హెచ్చరిస్తున్నా..

‘‘గంజాయి సేవించి మదనపల్లెలో ఒక వ్యక్తి మృగంలా మారి ఏడేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నేను ఒకటే చెబుతున్నా. ఆడబిడ్డల జోలికొస్తే అదే వాళ్లకు చివరి రోజు. ఆ మాటకు కట్టుబడి ఉన్నాను. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వాళ్లకు ఈ సమాజంలో చోటు లేదు. వాళ్లకి ఉరిశిక్ష పడాలి.’’


బూతులు తిట్టేవారికి పరామర్శలా?

‘‘ 2019 ఎన్నిలకు ముందు మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యను తొలుత గుండెపోటుగా చిత్రీకరించారు. ఆయన కుమార్తె విజ్ఞప్తి మేరకు పోస్టుమార్టం చేస్తే అది హత్య అని తేలింది. దీంతో వాళ్లు నాటకాలు మార్చి మరుసటి రోజు ఉదయం వాళ్ల పత్రికలో ‘నారాసుర రక్తచరిత్ర’ అని రాశారు. నేను రాజకీయం చేస్తాను. రౌడీల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తా. సంఘ విద్రోహ శక్తులను అణచివేస్తాను తప్పించి నేరాలు చెయ్యను. ఇప్పుడు కల్తీ నెయ్యి వ్యవహారంలోకి హెరిటేజ్‌ను తీసుకొచ్చి నాపై తప్పు వేయాలని చూస్తున్నారు. ఇలాంటి కరుడుగట్టిన నేరస్తులతో రాజకీయం చేయాల్సి రావడం బాధాకరం. ‘వైసీపీ నేత జగన్‌ బయటకు వస్తే బలవంతంగా మనుషులను తీసుకొస్తారు. పోతూపోతూ వాళ్ల కార్ల కిందనే అమాయక మనుషులను చంపేస్తారు. ఆ తర్వాత వాళ్లను ఏమాత్రం పట్టించుకోరు. బూతులు తిట్టిన వాళ్లను మాత్రం ఇళ్లకు వెళ్లి పరామర్శిస్తారు. వాళ్ల కోసం వచ్చి చనిపోయిన వాళ్లకు ఎలాంటి పరామర్శలు ఉండవు. దీనిని బట్టి ఆ పార్టీ నాయకుల వైఖరిపై ప్రజలే ఆలోచన చేయాలి.’’

కాంగ్రెస్‌ వైఖరి గర్హనీయం.. ‘‘ఢిల్లీలోని ఏఐ సదస్సుకు అన్ని దేశాల నుంచి ప్రతినిధులు వచ్చి వాళ్లు చేసిన ఆవిష్కరణలను ప్రదర్శించారు. ఆ సదస్సు దేశానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిని స్వాగతించాల్సిందిపోయి కాంగ్రెస్‌ పార్టీ వాళ్లు అర్ధనగ్నంగా సదస్సులోకి ప్రవేశిస్తారా? వాళ్లను ఏమనాలో. బాధ్యత లేకుండా ప్రవర్తించిన కాంగ్రెస్‌ తీరును తీవ్రంగా గర్హిస్తున్నాను.’’


పిల్లలకు ఏఐ మాస్టరు.. ప్రజలకు ఏఐ డాక్టరు

‘‘సాంకేతిక రంగంలో కొత్త విషయాలు తెలుసుకొని వాటి ద్వారా ప్రజలకు మేలు చేయడం నాకు ఇష్టం. అది నా అభిరుచి. 1995లో ఐటీకి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల నేడు తెలంగాణ రాష్ట్రం తలసరి ఆదాయంలో దేశంలోనే నం.1గా నిలిచింది. ఇప్పుడు వైజాగ్‌లో గూగుల్‌ డేటా సెంటర్‌ను 15 బిలియన్‌ డాలర్ల పెట్టుబడితో ఏర్పాటు చేయిస్తున్నాం. అమరావతిలో క్వాంటం కంప్యూటర్‌ నెలకొల్పుతున్నాం. తద్వారా ప్రపంచంలోని ఆరు, ఏడు దేశాల సరసన అమరావతిని చేరుస్తున్నాం. ఇటీవల ఉండవల్లికి బిల్‌గేట్స్‌ వచ్చి మనం వ్యవసాయ రంగంలో వినియోగిస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని చూసి ఆనందపడ్డారు. త్వరలో ఏఐ ద్వారా అగ్రి టెక్‌ తీసుకొస్తాం. అలానే పిల్లలందరికీ ఏఐ ట్యూషన్‌ మాస్టర్‌, ప్రజలకు ఏఐ డాక్టర్‌ వస్తారు.’’


ఈ వార్తలు కూడా చదవండి

అనంతబాబు కేసులో పోలీసులపై వేటు

విశాఖ స్టీల్‌ ప్లాంటు డైరెక్టర్‌ రాజీనామా?

Updated Date - Feb 22 , 2026 | 07:39 AM