విశాఖ స్టీల్ ప్లాంటు డైరెక్టర్ రాజీనామా?
ABN , Publish Date - Feb 22 , 2026 | 05:26 AM
విశాఖపట్నం స్టీల్ ప్లాంటులో డైరెక్టర్ ఒకరు తన పదవికి రాజీనామా చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
ఇటీవలే బాధ్యతలు స్వీకారం
ఏకపక్ష నిర్ణయాలను అమలు చేయలేకే?
విశాఖపట్నం, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం స్టీల్ ప్లాంటులో డైరెక్టర్ ఒకరు తన పదవికి రాజీనామా చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆయన వేరే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఇక్కడికి వచ్చారు. విధుల్లో భాగంగా పలు వ్యవహారాలను పరిశీలించినప్పుడు నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడి యాజమాన్యం కొన్ని ఏకపక్ష నిర్ణయాలను అమలు చేస్తున్నట్టు గుర్తించారు. ఈ విషయాన్ని సంస్థలో ముఖ్య అధికారి దృష్టికి తీసుకువెళ్లగా, పూర్తిస్థాయి సీఎండీ వచ్చాక అన్ని నిర్ణయాలు తీసుకుంటారని, అంతవరకు యథావిధిగా నడిపించాలని సూచించినట్టు సమాచారం. మరో మూడు నెలల వరకూ కొత్త సీఎండీ వచ్చే అవకాశం లేదని, భవిష్యత్తులో ఉద్యోగ సంఘాలకు అనుకూలంగా కోర్టు ఏ తీర్పు ఇచ్చినా దాని పర్యవసానాలు అనుభవించాల్సి ఉంటుందని ఆలోచించిన ఆ డైరెక్టర్.. తన రాజీనామాను ఉన్నతాధికారులకు పంపినట్టు తెలిసింది. ఆ ఫైల్ విజిలెన్స్ విభాగం విచారణకు కూడా వెళ్లినట్టు ప్లాంటులో ప్రచారం జరుగుతోంది. ఆర్‌ఐఎన్‌ఎల్ వెబ్‌సైట్‌లో అందరి డైరెక్టర్ల ఫొటోలు, పేర్లు ఉండగా, ఆ ఒక్క డైరెక్టర్ వివరాలు లేకపోవడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. అయితే ప్లాంటు అధికార వర్గాలు అలాంటిదేమీ లేదని చెబుతున్నాయి.