పునర్విభజనపై ఏకాభిప్రాయానికి సహకరించండి
ABN , Publish Date - May 12 , 2026 | 05:33 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలిశారు. దాదాపు 45 నిమిషాలు కీలక చర్చలు జరిపారు.
చంద్రబాబుకు అమిత్‌షా వినతి
ఢిల్లీలో 45 నిమిషాలు కీలక చర్చలు
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలపై మంతనాలు!
హస్తిన వచ్చినందునే షాను కలిశానన్న బాబు
వివరాలేమీ లేవని మీడియాకు దాటవేత
న్యూఢిల్లీ, మే 11 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలిశారు. దాదాపు 45 నిమిషాలు కీలక చర్చలు జరిపారు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలతో పాటు దేశ రాజకీయ పరిస్థితులూ ప్రస్తావనకు వచ్చాయి. ఆదివారం ప్రధాని మోదీ హైదరాబాద్‌లో చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులతో గడిపి.. ఆయనతో, మంత్రి లోకేశ్‌తో ప్రత్యేకంగా చర్చించిన మరుసటి రోజే అమిత్ షాతో సీఎం భేటీ అవడానికి ప్రాధాన్యం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మోదీ చర్చించిన అంశాలనే అమిత్ షా కూడా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై ప్రతిపక్షాలతో ఏకాభిప్రాయ సాధనకు చంద్రబాబు సహకారాన్ని ఆయన కోరినట్లు తెలిసింది. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుల ఆమోదానికి కేం ద్రం పట్టుదలతో ఉన్నట్లు సమాచారం. అది సాధ్యం కాకపోతే రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో సీట్ల పెంపు కోరాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలిసింది. అలాగే రాష్ట్రానికి వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాలతో పాటు గతంలో హామీ ఇచ్చి న మేరకు నిధులు విడుదలచేయాలని షాకు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. అమిత్ షాతో చర్చల వివరాలేమిటని మీడియా ప్రశ్నించగా.. ఢిల్లీకి వచ్చిన సందర్భంగా ఆయన్ను కలిశానని, పెద్దగా వివరాలేమీ లేవని సీఎం దాటవేశారు. మోదీతో భేటీ వివరాల గురించి చెప్పేందుకూ నిరాకరించారు. నవ్వుతూ.. మీరు ఊహించుకోండని అన్నారు.
చంద్రబాబుతో ఈఏసీ, నీతి ఆయోగ్ చర్చలు
గల్ఫ్ యుద్ధంతో దేశంలో ఇంధన సంక్షోభం నేపథ్యంలో తీసుకోవలసిన చర్యలపై కేంద్రం చంద్రబాబుతో చర్చిస్తున్నట్లు తెలిసింది. సౌర శక్తి, ఈవీ విధానాలు, ఇంధన పొదుపు చర్యలు, ఇతర కీలక ఆర్థిక నిర్ణయాలపై ఆయన తన అభిప్రాయాలు చెప్పినట్లు సమాచారం. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ) చైర్మన్ డా.ఎ్‌స.మహేంద్రదేవ్, నీతి ఆయోగ్ సభ్యులు రాజీవ్ గౌబా, కేవీ రాజు, డా.ఆర్.బాలసుబ్రహ్మణ్యం తదితరులు ఢిల్లీ జనపథ్‌లో చంద్రబాబు నివాసానికి వచ్చి చర్చలు జరిపారు. ఇంధన పొదుపు, విదేశీ మారకద్రవ్యం ఆదా తదితర అంశాలపై విధాన రూపకల్పనలో సీఎం వారికి తోడ్పడుతున్నట్లు తెలిసింది.