ఏ పథకమైనా పేదలకే
ABN , Publish Date - Mar 19 , 2026 | 06:05 AM
దివ్యాంగుల శక్తిని ప్రపంచానికి చాటేలా.. ఆత్మస్థైర్యంతో వారు పనిచేసేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
దివ్యాంగుల ఆత్మగౌరవం పెంచుతాం
‘దివ్యాంగ శక్తి’ ఆ సంకల్పంలో భాగమే: సీఎం
మంగళగిరి బస్టాండ్‌లో దివ్యాంగులకు ఉచిత బస్సు పథకం ప్రారంభం
అమరావతి, మంగళగిరి, తాడేపల్లి టౌన్, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): దివ్యాంగుల శక్తిని ప్రపంచానికి చాటేలా.. ఆత్మస్థైర్యంతో వారు పనిచేసేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో దివ్యాగులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తూ దివ్యాంగ శక్తి పథకాన్ని బుధవారం ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్‌తో కలిసి గుంటూరు జిల్లా మంగళగిరి ఆర్టీసీ బస్‌స్టేషన్‌లో ప్రారంభించారు. దివ్యాంగుల్లో ఆత్మగౌరవాన్ని పెంపొందించేందుకే ఈ పథకం తెచ్చామని ముఖ్యమంత్రి తెలిపారు. అనంతరం సీఎం క్యాంపు కార్యాలయంలో దివ్యాంగులకు ఆయన ఆత్మీయ విందు ఇచ్చారు. వారితో కలిసి చంద్రబాబు, లోకేశ్ భోజనం చేశారు. ఆయా సందర్భాల్లో చంద్రబాబు మాట్లాడారు. దివ్యాంగ శక్తి పథకం ప్రారంభించడం తనకు సంతృప్తిని, సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ‘‘గతంలో చేయూత కార్యక్రమం ద్వారా దివ్యాంగులకు ట్రై సైకిళ్లు అందించాను. రూ.500 ఉండే దివ్యాంగుల పెన్షన్‌ను రూ.6వేలకు పెంచి అమలుచేస్తున్న రాష్ట్రం మాదే. తీవ్ర ఆరోగ్య ఇబ్బందులుండే వారికి రూ.10వేలు, మంచానికే పరిమితమైన వారికి రూ.15వేలు ఇస్తున్నాం. ఏటా రూ.33 వేల కోట్లు పింఛన్ల రూపంలో అందిస్తున్నాం. దివ్యాంగులు అంటే విభిన్న ప్రతిభావంతులు, సమస్యలను అధిగమించి విజయాలు సాధించే శక్తి వారిలో పుష్కలంగా ఉంది. పట్టుదలకు మారుపేరు. కఠోరంగా శ్రమిస్తారు. ఏదైనా సాధించే వరకు నిద్రపోరు.’’ అంటూ అభినందించారు. ఇంకా ఏమన్నారంటే..
21 కేటగిరీ బస్సుల్లో ఉచిత ప్రయాణం..
‘‘ఎలాంటి ఖర్చు లేకుండా 21 కేటగిరీల బస్సుల్లో దివ్యాంగులు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఈ పథకం ద్వారా ఒక్కొక్కరికి నెలకు రూ.2వేల దాకా ఆదా అయ్యే అవకాశం ఉంది. మొదటి నుంచీ దివ్యాంగుల సంక్షేమానికి పని చేస్తోంది టీడీపీ మాత్రమే. భవిష్యత్తులోనూ దివ్యాంగులను ఆదుకునేలా మరిన్ని ఆలోచనలు చేస్తాం. వారికి త్వరలో మరింత మేలు చేకూరుస్తాం. దివ్యాంగ శక్తి ద్వారా 12.75 లక్షల మందికి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాం. ఈ పథకం కోసం ఏటా రూ.207 కోట్లు ఖర్చు చేస్తాం. కూటమి అమలు చేసే ఏ పథకం, ఏ కార్యక్రమమైనా నిరుపేదల సంక్షేమం కోసమే. ఎక్కువ సమస్యలు ఎదుర్కొనే దివ్యాంగులకు అండగా నిలబడాలనే కూటమి పనిచేస్తోంది. మహిళల కోసం తీసుకొచ్చిన స్త్రీశక్తి పథకం ద్వారా ఇప్పటి వరకు 52 కోట్ల ప్రయాణాలు జరిగాయి. దివ్యాంగుల సమస్యలపై ఎప్పుడూ పోరాటాలు చేసే మంద కృష్ణ మాదిగ, గోనుగుంట్ల కోటేశ్వరరావును అభినందిస్తున్నాను.’’
అది నీచం..బాధాకరం..
‘‘2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రాకుండా ఉంటే దివ్యాంగుల పింఛన్లు పెరిగేవి కాదు. దివ్యాంగశక్తి పథకం వచ్చేది కాదు. దివ్యాంగులకు గతంలో స్కూటర్లు ఇచ్చాం. ల్యాప్‌టా్‌పలు ఇచ్చాం. వారికి మరింత మంచి చేస్తాం. జరిగిన మంచిని 10 మందికి చెప్పాలి. సుస్థిర ప్రభుత్వం ఉంటే అభివృద్ధి పెద్దఎత్తున జరుగుతుంది. గత ప్రభుత్వంలో చాలా తప్పులు జరిగాయి. దివ్యాంగుల పేరుతో బాగున్నవారు కూడా పింఛన్లు పొందారు. ఉద్యోగాలు పొందారు. ఇది నీచం.. బాధాకరం.’’
‘ఎమ్మెల్యే కార్డులు లేవు..టికెట్లు ఇవ్వండి’
మహిళా కండక్టర్‌తో లోకేశ్ సరదా వ్యాఖ్యలు
గంభీరంగా ఉండే ఆ నేతలు దివ్యాంగ శక్తి పథకం ప్రారంభోత్సవంలో భాగంగా బస్సులో ప్రయాణిస్తూ, సరదాగా గడిపారు. తన వెనుకే బస్సులో ఎక్కి కూర్చున్న పవన్, లోకేశ్‌లను చూపిస్తూ.. వారికి టిక్కెట్లను చింపాలని మహిళా కండక్టర్‌ను చంద్రబాబు కోరారు. లేదంటే..చర్యలు తప్పవని సరదాగా అన్నారు. ఆ వ్యాఖ్యలతో బస్సులో ఉత్సాహ వాతావరణం నెలకొంది. పవన్ నవ్వుతూ కూర్చోగా, లోకేశ్ వెంటనే స్పందించారు. ‘‘మేం శాసనసభ్యులమైనందున ఫ్రీగా ప్రయాణించొచ్చు. అయితే, ఎమ్మెల్యే ఐడీ కార్డును మర్చిపోయి వచ్చినందుకు టిక్కెట్లు తీసుకుంటాం’’ అని లోకేశ్ అన్నారు. ఆ వెంటనే తన జేబులో నుంచి డబ్బులు తీసి కండక్టర్‌కు ఇచ్చి ముగ్గురికీ టికెట్లు తీసుకున్నారు. లోకేశ్ స్పందనపై చంద్రబాబు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ... ‘ఓకే.. ఐ అ గ్రిడ్’ అని అన్నారు.
దివ్యాంగులతో ప్రయాణిస్తూ..
దివ్యాంగులకు భరోసాగా బస్సులో వారితోపాటు సీఎం చంద్రబాబు ప్రయాణించారు. స్వయంగా వారికి జీరో ఫేర్ టికెట్లు అందించారు. పవన్ కల్యాణ్, లోకేశ్‌తో కలిసి.. భారీగా తరలొచ్చిన అభిమానులు, శ్రేణులకు విజయచిహ్నం ప్రదర్శిస్తూ.. సీఎం సరదాగా గడిపారు. అంతకుముందు, దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే దివ్యాంగ శక్తి పథకాన్ని మంగళగిరి బస్టాండ్‌లో ఆయన ప్రారంభించారు. పల్లె వెలుగు బస్సులో 26 మంది దివ్యాంగులతో కలిసి పెనుమాక వరకు ప్రయాణించారు.
దివ్యాంగుల గౌరవాన్ని పెంచుతాం ప్రతి ఉగాదికీ జాబ్ క్యాలెండర్: లోకేశ్
దివ్యాంగుల గౌరవం పెంచేలా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. దివ్యాంగుల ఆత్మీయ విందులో పాల్గొన్న ఆయన అనంతరం వారితో మాట్లాడారు. శివనాగరాజు, సౌభాగ్య, ఖాశీంబీ, అన్నపూర్ణమ్మ తదితర దివ్యాంగుల తల్లులతో ముచ్చటించారు. తమ పిల్లలకు ఉద్యోగవకాశాలను కల్పించాలని, పక్కా గృహాలను నిర్మించి ఇవ్వాలని వారు కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారు. అనంతరం లోకేశ్ మాట్లాడుతూ.. దివ్యాంగుల్లో పట్టుదల ఎక్కువ అని, అవకాశాలు కల్పిస్తే వారు అద్భుతాలు సృష్టిస్తారని అన్నారు. వారి నుంచి ఎంతో నేర్చుకోవచ్చని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో ఇప్పటికే డీఎస్సీ ద్వారా 16వేల పోస్టులు భర్తీ చేశామని, ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నామన్నారు.
కూటమి కలకాలం ఉండాలి: దివ్యాంగులు
విందులో పాల్గొన్న దివ్యాంగులు తమ అభిప్రాయాలను చంద్రబాబు, లోకేశ్‌తో పంచుకున్నారు. కూటమి కలకాలం ఉండాలని కోరుకున్నారు. మంచి ప్రభుత్వం కొనసాగితే తమకు సంక్షేమ పథకాలు అందుతూ ఉంటాయని చెప్పారు. తమను క్రీడల్లోనూ ప్రోత్సహిస్తున్నారని, గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని అభిప్రాయపడ్డారు. కాగా, ఉండవల్లిలో బస్సు ఆగిన సమయంలో పెద్దఎత్తున మహిళలు తరలిరావడంతో స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. ఈ సందర్భంలో ఉండవల్లి సెంటరుకు చెందిన పి.వెంకటేశ్వరమ్మ కాలికి గాయమైంది. అక్కడ ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలోని నర్సులు ఆమెకు ప్రాథమిక చికిత్స అందించి, ఆటోలో ఆస్పత్రికి తరలించారు.

42 ఏళ్ల సమస్య... లోకేశ్ పరిష్కరించారు
చంద్రబాబుకు తెలిపిన ఓ నేత కార్మికుడు
దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించేందుకు బుధవారం మంగళగిరి బస్టాండుకు వచ్చిన సీఎం చంద్రబాబు కొద్దిసేపు అక్కడ వేచి ఉన్న దివ్యాంగులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా చేనేత కార్మికుడు నాగులపల్లి వెంకన్న సీఎం దగ్గరకు వచ్చారు. తనకు తీవ్రమైన కీళ్ల వాపు సమస్య వచ్చి వెన్నుపూస పూర్తిగా వంగిపోగా, చికిత్సకు రూ.8 లక్షలు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పారన్నారు. అతి నిరుపేదనైన తనకు అంత ఆర్థిక స్తోమత లేకపోవడంతో స్థానిక తెలుగుదేశం నాయకుల ద్వారా మంత్రి లోకేశ్‌కు అర్జీ పెట్టుకున్నానని తెలిపారు. సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఆ మొత్తాన్ని విడుదల చేయించి, తనకు లోకేశ్ శస్త్రచికిత్స చేయించారంటూ సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే, రత్నాలచెరువులో 42 ఏళ్ల నాటి నివేశన పట్టాల సమస్యను లోకేశ్ ఎమ్మెల్యే అయిన వెంటనే పరిష్కరించారని తెలిపారు. పక్కనే వున్న లోకేశ్ జోక్యం చేసుకుంటూ.. మంత్రివర్గ సమావేశంలో కొత్తగా తీసుకొచ్చిన జీవో ద్వారా ఎక్కువ లబ్ధి మంగళగిరి రత్నాలచెరువు వాసులకే కలిగిందని వివరించారు.