విపత్తులతో రైతు నష్టపోవద్దు!
ABN , Publish Date - Nov 03 , 2026 | 07:06 AM
ప్రకృతి విపత్తుల సమయంలో రైతులకు ప్రభుత్వం ఇచ్చే ఇన్‌పుట్ సబ్సిడీతో పాటు పంటల బీమా పరిహారం కూడా అందాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు
వారికి ఇన్‌పుట్ సబ్సిడీతో పాటు పంటల బీమా పరిహారం కూడా అందాలి
తద్వారా కష్టకాలంలో ఆర్థిక ఉపశమనం: సీఎం
వ్యవసాయ అధికారులు, బీమా కంపెనీలతో సమీక్ష
రైతుసేవా కేంద్రాల సిబ్బందితో టెలికాన్ఫరెన్స్
అమరావతి, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): ప్రకృతి విపత్తుల సమయంలో రైతులకు ప్రభుత్వం ఇచ్చే ఇన్‌పుట్ సబ్సిడీతో పాటు పంటల బీమా పరిహారం కూడా అందాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలోని ఆర్టీజీఎస్ నుంచి వ్యవసాయశాఖ అధికారులు, పంటల బీమా కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతుసేవా కేంద్రాల సిబ్బందితో సీఎం టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ‘‘విపత్తుల సమయంలో రైతులకు పంటల బీమా ఎంతో ఉపశమనంగా ఉంటుంది. రైతులకు రూ.25 వేల చొప్పున ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తున్నాం. దీనికి బీమా పరిహారం కూడా తోడైతే వారికి ఆర్థికంగా మరింత వెసులుబాటు కలుగుతుంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనతో పాటు ప్రకృతి వైపరీత్యాల సమయంలో నష్టంపై పంటల బీమా అమలు చేస్తున్నాం.
బీమా క్లెయిమ్‌ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రైతులకు ఏ విధంగా కల్పించాలన్న దానిపై వ్యవసాయ, ఉద్యాన శాఖలు చర్యలు తీసుకోవాలి. కష్టకాలంలో రైతులు, కౌలు సాగుదారులు నష్టపోకుండా చూడాలి. ఈ ఏడాది రైతులకు పెద్దఎత్తున పంటల బీమా చేశాం. కలెక్టర్లు చొరవ చూపిస్తేనే.. పూర్తి ప్రయోజనం కలుగుతుంది. బీమా అనేది రైతులకు అలవాటుగా మారితే, వారికి ఆర్థికంగా నష్టం జరగదు. ప్రకృతి విపత్తులు, వాతావరణానికి అనుగుణంగా పంటల బీమా జరగాలి. ఖరీఫ్ సీజన్ పూర్తవుతున్నందున రైతులకు దీనిపై మరింత అవగాహన కల్పించాలి’’ అని ఆదేశించారు. అర్నబ్ తుఫాన్ వల్ల శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు పంట నష్టం జరిగిందని, ఇప్పుడు మురసు తుఫాన్ వల్ల దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పంటలపై ప్రభావం ఉంటుందని సీఎం పేర్కొన్నారు. దీనిపై త్వరతగతిన అంచనాలు రూపొందించేలా వ్యవసాయశాఖ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఖరీఫ్‌లో 22, రబీలో 16 రకాల పంటలకు బీమా కల్పించినట్లు ఈ సందర్భంగా అధికారులు సీఎంకు చెప్పారు. వేరుశనగ, పత్తి, టమాటా లాంటి వాణిజ్య పంటలకూ బీమా చేసినట్లు కంపెనీల ప్రతినిధులు వివరించారు.
‘అర్నబ్’ ప్రభావిత కుటుంబాలకు 10 కిలోల ఉచిత బియ్యం
కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాల్లో అర్నబ్ తుఫాన్ ప్రభావానికి గురైన ఒక్కో కుటుంబానికి 10 కిలోల బియ్యం ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు అనుమతి మంజూరు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్డీఆర్‌ఎఫ్ నిబంధనల కింద లభించే ప్రయోజనాలకు ఇది అదనంగా ఇవ్వాలని కలెక్టర్లకు సూచించింది. ఉచిత బియ్యం పంపిణీకి తగిన చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ను ఆదేశించింది.
ఈ వార్తలనూ చదవండి:
త్వరితగతిన రాష్ట్రానికి సాయం అందించండి.. కేంద్రానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
ఏపీ లిక్కర్ స్కామ్.. ఈడీ కస్టడీలో నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి