సుజలాం.. సస్యశ్యామలాం!
ABN , Publish Date - Jan 27 , 2026 | 03:34 AM
కేంద్ర పథకాలను గరిష్ఠ స్థాయిలో ఉపయోగించుకోవడం... భారీగా కేంద్ర నిధులు సాధించడం... రాయలసీమ, ప్రకాశం, పశ్చిమ నెల్లూరు జిల్లాలను ‘సస్యశ్యామలం’ చేయడం! దీంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ...
కేంద్ర నిధులతో రాష్ట్రమంతా జలకళ
రెండు దశల్లో రూ.10 వేల కోట్లు!
కేంద్రం సూత్రప్రాయ అంగీకారం
రాయలసీమ, నెల్లూరు, ప్రకాశంలో పండ్ల తోటలు, సాగునీటికి ఊతం
మౌలిక సదుపాయాలూ అభివృద్ధి
రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి లక్ష్యం
గరిష్ఠ స్థాయిలో ‘పూర్వోదయ’ నిధులకు యత్నం
సంబంధిత శాఖలపై నేడు సీఎం కీలక సమీక్ష
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
కేంద్ర పథకాలను గరిష్ఠ స్థాయిలో ఉపయోగించుకోవడం... భారీగా కేంద్ర నిధులు సాధించడం... రాయలసీమ, ప్రకాశం, పశ్చిమ నెల్లూరు జిల్లాలను ‘సస్యశ్యామలం’ చేయడం! దీంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి, పొలాలకు ‘సుజలాలు’ ప్రవహించడం! ఈ రెండు బృహత్ లక్ష్యాలు పూర్తి చేసే దిశగా ప్రణాళికలు రూపుదిద్దుకోనున్నాయి. దీనికి నిధులు ఇచ్చేందుకు కేంద్రం ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిసింది. గ్రామీణాభివృద్ధి, జల వనరులకు సంబంధించి కేంద్రం అమలు చేస్తున్న వివిధ పథకాల నుంచి రాష్ట్రానికి రూ.10వేల కోట్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది. రెండు దశల్లో రూ.10,000 కోట్లు రాష్ట్రానికి ఇచ్చేందుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. అలాగే... పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి రూ.14,100 కోట్లు అవసరమని ఇప్పటికే గుర్తించారు. కేంద్రం అమలు చేస్తున్న ‘పూర్వోదయ’ పథకం ద్వారా గరిష్ఠ స్థాయిలో నిధులు సాధించేందుకు రంగం సిద్ధం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కేంద్రం నుంచి అందే ఈ నిధులను సమర్థంగా వినియోగించుకుని, సత్వర ఫలితాలు సాధించే దిశగా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్థిక, వ్యవసాయ-అనుబంధ, ఉద్యానవన, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, జల వనరుల శాఖలను ఆదేశించారు. దీనిపై మంగళవారం ఆయా శాఖలతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్రం నుంచి అందే నిధులు, చేపట్టే పనులపై ఈ భేటీలో పూర్తిస్థాయి స్పష్టత వచ్చే అవకాశముంది. ‘సుజలాం - సస్యశ్యామలాం’ లేదా మరో పేరుతో రాష్ట్రవ్యాప్తంగా జలగలగలలు వినిపించేలా బృహత్తర ప్రణాళికను అమలు చేయనున్నట్లు తెలిసింది.
ఉద్యాన వన‘సీమ’
ఒకప్పుడు కరువు సీమగా పేరొందిన రాయలసీమ ఇప్పటికే పండ్ల తోటలకు (హార్టికల్చర్) చిరునామాగా మారింది. ఇప్పుడు రాయలసీమతోపాటు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పశ్చిమ ప్రాంతం, ప్రకాశం జిల్లాలనూ కలిపి ‘హార్టికల్చర్ హబ్’గా మార్చేందుకు కేంద్ర నిధులను ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. దీనికోసం కేంద్రం రెండు దశల్లో రూ.10వేల కోట్లు ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. ఆ జిల్లాల్లో పండ్లతోటలకు, పొలాలకు నీరందించడతోపాటు, వాటి రవాణా కోసం గ్రామీణ రహదారులను అభివృద్ధి చేస్తారు. దీనికోసం ‘జీరామ్‌జీ’ (ఉపాధి హామీ)పథకం, వాటర్ షెడ్, బిందు సేద్యం సంబంధిత కేంద్ర ప్రాజెక్టుల నుంచి నిధులు రాబడతారు. పండ్ల తోటలకు నీరందించడం నుంచి మార్కెటింగ్‌కు అవసరమైన రవాణా దాకా ప్రతి దశలో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తారు.
‘పూర్వోదయ’ ద్వారా...
తూర్పు తీరంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, ఒడిసా, పశ్చిమ బెంగాల్‌తోపాటు బిహార్, జార్ఖండ్ రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం ‘పూర్వోదయ’ పథకం పరిధిలోకి తెచ్చింది. ఈ ఐదు రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, ఆర్థికాభివృద్ధికి నిధులు కేటాయించి... వేగవంతమైన అభివృద్ధికి బాటలు పరచడం, ‘వికసిత్ భారత్’లో తూర్పు భారత భాగస్వామ్యాన్ని కీలకంగా మార్చడమే ఈ పథకం లక్ష్యం. దీని ద్వారా రాష్ట్రానికి గరిష్ఠ స్థాయిలో నిధులు రాబట్టేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఈ పథకం ద్వారా అందే నిధులతో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని భావిస్తున్నారు. అదే జరిగితే 3,97,339 ఎకరాల కొత్త ఆయకట్టు ఏర్పాటవుతుంది. 25 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చు. తోటపల్లి బ్యారేజీ, తారకరామతీర్థ సాగర్, వంశధార రెండో దశలో స్టేజ్-2, గొట్టా బ్యారేజీ ఎత్తిపోతల నుంచి హిరమండలం దాకా నీటి తరలింపు, మహేంద్ర తనయ ఆఫ్‌షోర్, గజపతినగరం బ్రాంచి కెనాల్, వంశధార-నాగావళి లింక్ కెనాల్, నాగావళి - చంపావతి అనుసంధానం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాల పూర్తికి రూ.5వేల కోట్లు అవసరమని జల వనరుల శాఖ అంచనా వేసింది. గోదావరి డెల్టా సిస్టమ్ కాలువల అభివృద్ధి, కృష్ణా డెల్టా సిస్టమ్ కాలువల అభివృద్ధి, బుడమేరు, ఉప్పుటేరు కాలువల అభివృద్ధి, బుడమేరు కాలువ మళ్లింపు, వరికెలపూడిశెల, ఏఎ్‌సఆర్ సోమశిల హెచ్‌ఎల్‌సీ ప్రాజెక్టు తొలిదశ... ఈ పనుల పూర్తికి రూ.9100 కోట్లు అవసరం. అంటే... మొత్తంగా రూ.14,100 కోట్లతో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయవచ్చు. ‘పూర్వోదయ’ నిధులను ఈ ప్రాజెక్టుల పూర్తికి ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
ప్రాజెక్టులపై ఫోకస్
2024లో అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లోనే హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రధాన కాలువను అభివృద్ధి చేయడం ద్వారా కుప్పం దాకా నీటిని తీసుకు వెళ్లగలిగారు. ప్రాజెక్టులలో సమర్థ నీటి యాజమాన్య విధానాలను ఆచరించడం ద్వారా భూగర్భ జలాలు భారీగా పెరిగాయి. ప్రాజెక్టులను పూర్తి చేసి.. వరదల కాలంలో నీటిని ఎత్తిపోతల పథకాలు, చెరువుల్లోకి పంపించడం ద్వారా భూగర్భ జలాలను పెంచుకోవచ్చని గడచిన రెండేళ్లుగా అమలు చేస్తున్న నీటి యాజమాన్య విధానాలు రుజువు చేశాయి. దీంతో... పెండింగ్ ప్రాజెక్టుల పూర్తిపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది.
‘ప్రణాళికా’ బద్ధంగా...
‘సుజలాం - సస్యశ్యామలం’ కోసం కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు ముఖ్యమంత్రి కొన్నాళ్లుగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. తన ఢిల్లీ పర్యటనల్లో దీనిపైనే దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో... రెండు దశల్లో రూ.10వేల కోట్లు ఇచ్చేందుకు కేంద్రం ఇప్పటికే సూత్రప్రాయ ఆమోదం తెలిపినట్లు సమాచారం. అలాగే... పెండింగ్ ప్రాజెక్టుల కోసం ‘పూర్వోదయ’ నిధులను గరిష్ఠ స్థాయిలో రాబట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మంగళవారంనాటి సమావేశంలో శాఖల వారీగా సమగ్ర నివేదికలను యుద్ధ ప్రాతిపదికన తయారు చేయాలని సూచిం చే అవకాశముంది.
ఈ వార్తలు కూడా చదవండి:
గల్ఫ్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు