గల్ఫ్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు
ABN , Publish Date - Jan 27 , 2026 | 05:08 AM
భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను గల్ఫ్ దేశాల్లో ప్రవాసీయులు ఘనంగా జరుపుకొన్నారు. సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో జరిగిన కార్యక్రమంలో...
భారతీయ కాన్సుల్ జనరల్స్ ఆధ్వర్యంలో జెడ్డా, దుబాయ్, రియాధ్‌లో కార్యక్రమాలు
దుబాయ్‌లో వేడుకల్లో పాల్గొన్న శశి థరూర్
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)
భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను గల్ఫ్ దేశాల్లో ప్రవాసీయులు ఘనంగా జరుపుకొన్నారు. సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో జరిగిన కార్యక్రమంలో భారతీయ కాన్సుల్ జనరల్ ఫహాద్ ఖాన్ సూరి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్రపతి ప్రసంగంలోని ముఖ్యాంశాలను చదివి వినిపించారు. సూరి స్వస్థలం కర్నూలు నగరం కావడం విశేషం. రియాధ్‌లో భారత రాయబారి సోహల్ అహ్మద్ పతాకవిష్కరణ చేశారు. దుబాయిలో వర్షం కురుస్తున్నా పెద్ద సంఖ్యలో భారతీయులు త్రివర్ణ పతాకాన్ని చేత పట్టుకుని కాన్సులేట్‌కు చేరుకున్నారు. అక్కడ కాన్సుల్ జనరల్ సతీశ్ శివన్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విందు కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పాల్గొన్నారు. బహ్రెయిన్‌లో తెలుగు కళా సమితి తన కార్యాలయ ప్రాంగణంలో వేడుకలను నిర్వహించింది. ఆ సంస్థ అధ్యక్షుడు జగదీశ్ పతాకవిష్కరణ చేశారు. ఆబుధాబి, మస్కట్, కువైత్, దోహా నగరాల్లోనూ వేడుకలు జరిగాయి. జెడ్డా, రియాధ్, దమ్మాం, జుబైల్, తాయిఫ్, తబూక్ నగరాల్లోని భారతీయ పాఠశాలల్లో వేడుకలు నిర్వహించారు.