‘గ్రూప్-2’పై నత్తనడక!
ABN , Publish Date - Jan 27 , 2026 | 04:44 AM
రెండేళ్ల క్రితం 2023 డిసెంబరు 7న జారీ అయిన గ్రూప్-2 నోటిఫికేషన్ ప్రక్రియ నేటికీ నత్తనడకన సాగుతోంది. ప్రిలిమ్స్, మెయిన్స్, సర్టిఫికెట్ల పరిశీలన వంటి కీలక దశలు పూర్తి చేసుకున్నప్పటికీ..
రెండేళ్లు దాటినా పూర్తికాని నోటిఫికేషన్
మెయిన్స్ పరీక్ష జరిగి దాదాపు ఏడాది
అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయినా తుది ఫలితాల వెల్లడికి కలగని మోక్షం
న్యాయ వివాదాలతో ఇంతకాలం ఆలస్యం
హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినా ముందుకెళ్లని ఏపీపీఎస్సీ
ఈలోగా మళ్లీ పుట్టుకొస్తున్న కొత్త కేసులు
అభ్యర్థుల్లో పెరుగుతున్న ఆందోళన, ఆవేదన
‘రోస్టర్’ కేసు పెండింగ్‌తో ఆగిన గ్రూపు-1 ఫలితాలూ..
గ్రూప్-2 నోటిఫికేషన్ ప్రక్రియ ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతోంది. ఓవైపు తుది ఫలితాల కోసం అభ్యర్థులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తుంటే.. మరోవైపు ఆలస్యమయ్యే కొద్దీ కొత్తగా న్యాయ వివాదాలు పుట్టుకొస్తున్నాయి. ఇటీవల హైకోర్టు ఆదేశాలతో ఫలితాలు వెలువరించే అవకాశం వచ్చినా, ఏపీపీఎస్సీ పలు కారణాలతో దానిపై ముందుకెళ్లలేదు. దీంతో ఇప్పుడు రోస్టర్, క్రీడా కోటా వివాదాలు ఫలితాల వెల్లడికి అడ్డంకిగా మారాయి. నోటిఫికేషన్ జారీ చేసి రెండేళ్లు దాటిపోయినా.. ఇప్పటికీ తుది ఫలితాలను విడుదల చేయకపోవడంతో అభ్యర్థుల్లో ఆవేదన పెరుగుతోంది. ఈ జాప్యం వల్ల ఫలితాల్లో పారదర్శకత లోపిస్తుందేమోనన్న కొత్త చర్చ కూడా తలెత్తుతోంది.
అమరావతి, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): రెండేళ్ల క్రితం 2023 డిసెంబరు 7న జారీ అయిన గ్రూప్-2 నోటిఫికేషన్ ప్రక్రియ నేటికీ నత్తనడకన సాగుతోంది. ప్రిలిమ్స్, మెయిన్స్, సర్టిఫికెట్ల పరిశీలన వంటి కీలక దశలు పూర్తి చేసుకున్నప్పటికీ.. తుది ఫలితాల వెల్లడికి మోక్షం కలగడం లేదు. ఉద్యోగార్థులకు ఎదురుచూపులు తప్పడం లేదు. 2023కు ముందు 2018లో గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదలైంది. అంటే ఇప్పటివరకు ఏడేళ్ల కాలంలో రెండో నోటిఫికేషన్లు మాత్రమే వచ్చాయి. తరచూ నోటిఫికేషన్లు లేకపోవడంతో 2023 చివర్లో భారీ సంఖ్యలో 905 పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైంది.
వైసీపీ ప్రభుత్వంలో ఏపీపీఎస్సీ ఇచ్చిన ఏకైక గ్రూప్-2 నోటిఫికేషన్ ఇదే. 2024 ఫిబ్రవరి 25న ప్రిలిమ్స్ పరీక్షలు జరిగాయి. ఆ తర్వాత ఏడాదికి 2025 ఫిబ్రవరి 23న మెయిన్స్ జరిగాయి. 4.04 లక్షల మంది ప్రిలిమ్స్ రాయగా.. మెయిన్స్‌కు 92,250 మంది ఎంపికయ్యారు. వారిలో సర్టిఫికెట్ల పరిశీలనకు 2,559 మంది అర్హత సాధించారు. ఆ ప్రక్రియ కూడా పూర్తవగా.. కోర్టు కేసులు, ఇతర కారణాలతో తుది ఫలితాలు మాత్రం విడుదల కావట్లేదు.
ఇవీ వివాదాలు
రాష్ట్ర ప్రభుత్వం అంతకుముందున్న రోస్టర్ విధానం స్థానంలో కొత్తగా హారిజంటల్ రోస్టర్ విధానం ప్రవేశపెట్టింది. మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికులు, క్రీడా కోటా అభ్యర్థులకు ఈ విధానంతో సమాన అవకాశాలు లభిస్తాయి. అయితే గత విధానం తరహాలో ఏ పోస్టు ఎవరికి వస్తుందనేది హారిజంటల్ రిజర్వేషన్‌లో కచ్చితంగా అంచనా వేయలేరు. కాగా, అసలు ఈ రోస్టర్‌లోనే తప్పులున్నాయంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లారు. దానిపై చాలాకాలం విచారణ అనంతరం గత డిసెంబరు 30న హైకోర్టు ఆ పిటిషన్లను కొట్టివేసింది. కాగా, మరో ముగ్గురు క్రీడా కోటా అభ్యర్థులు క్రీడా కోటా అంశంపై హైకోర్టును ఆశ్రయించారు. అప్పటికే చాలాకాలం అయినందున క్రీడా కోటాలో ఇద్దరు అభ్యర్థులకు రెండు పోస్టులు రిజర్వ్ చేసి, ఫలితాలపై ముందుకెళ్లాలని న్యాయస్థానం ఆదేశించింది. కొట్టేసిన రోస్టర్ వివాదంలో ఇప్పుడు మరో పిటిషన్ హైకోర్టులో దాఖలైంది. దానిని న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. దీనిపై వాదనలు మొదలైతే.. తుది తీర్పు వెల్లడికి ఎంతకాలం పడుతుందో తెలియని పరిస్థితి. ఇలా కేసులు నమోదవుతూ, ఫలితాలు ఆగిపోతూ ఉంటే తామేం చేయాలని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు.
భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయంటూ..
హైకోర్టు స్పష్టతనిచ్చినా ఏపీపీఎస్సీ ఫలితాల వెల్లడిపై నిర్ణయం తీసుకోలేకపోతోంది. మొత్తం 905 పోస్టుల్లో క్రీడా కోటా కింద 21 పోస్టులున్నాయి. వాటిలో రెండు పోస్టులు రిజర్వ్ చేయాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. హారిజంటల్ రిజర్వేషన్ విధానంలో ఆ రెండు పోస్టులు ఎక్కడ వస్తాయో చెప్పలేమని, ఆ రెండు పోస్టులను పక్కనపెట్టి ముందుకెళ్తే, తుది ఫలితాల అనంతరం మళ్లీ వివాదాలు తలెత్తుతాయని ఏపీపీఎస్సీ అభిప్రాయపడుతోంది. అప్పుడు మళ్లీ మొదటి నుంచీ తిరిగి పోస్టింగులు మార్చాల్సి వస్తుందని భావిస్తోంది. కాగా, గ్రూప్-1 ఫలితాల కోసమే గ్రూప్-2 ఫలితాలను ఆపేశారని అభ్యర్థులు సందేహిస్తున్నారు. ఎందుకంటే గ్రూప్-1 ఫలితాలపైనా రోస్టర్ కేసు పెండింగ్‌లో ఉండటంతో ఫలితాలు ఆగిపోయాయి. గ్రూప్-1, 2 నోటిఫికేషన్లలో తుది ఫలితాలకు ఎంపికైన అభ్యర్థులు సుమారు 20 మంది రెండింట్లోనూ ఉన్నారు. దీంతో ముందు గ్రూప్-2 ఫలితాలు ఇస్తే... వారిలో కొందరు తర్వాత ఇచ్చే గ్రూప్-1లోనూ ఎంపికైతే గ్రూప్-2 ఉద్యోగాలు వదిలేసి వెళ్లిపోతారు. ఆ పోస్టులు తర్వాత నోటిఫికేషన్లకు క్యారీ ఫార్వార్డ్ అవుతాయి. ఇలా కాకూడదనే ఉద్దేశంతోనే ఫలితాలను ఆపేస్తున్నారని, 10-20 మంది కోసం వేలాది మందిని ఆందోళనకు గురిచేస్తున్నారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.
అభ్యర్థుల్లో పలు అనుమానాలు
పలు కారణాలతో గ్రూప్-2 ఫలితాలు ఆగిపోగా.. అభ్యర్థులు మాత్రం అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. న్యాయ వివాదాలు పరిష్కారమై ఫలితాలు ఇచ్చే పరిస్థితి ఉన్నా, ఆ సమయంలో ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు. కొన్ని పోస్టుల్లో కావాల్సిన వారి కోసం ఫలితాలు ఆపుతున్నారంటూ ప్రచారం మొదలైంది. ఈ అంశంపై అధికార పార్టీలోనూ అసంతృప్తి కనిపిస్తోంది. హైకోర్టు ఫలితాలు ఇవొచ్చని చెప్పినా, ఇవ్వకపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన పెరుగుతోందని, 2 వేల మందికి పైగా అభ్యర్థులు ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారని టీడీపీ నాయకులు అంటున్నారు. వీలైనంత త్వరగా ఫలితాలు వెల్లడిస్తే భవిష్యత్తు నోటిఫికేషన్లకు అవకాశం ఏర్పడుతుందని అభిప్రాయపడుతున్నారు.