బీ‘టెక్కే’ కావాలి!
ABN , Publish Date - Sep 27 , 2026 | 03:10 AM
రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యకు డిమాండ్ పెరగడంతో ఏంబీఏ, ఎంసీఏ వంటి కోర్సులకు ఆదరణ తగ్గిపోతోంది. ఒకప్పుడు బీటెక్ సీట్లు తక్కువగా ఉన్న సమయంలో ఎక్కువ మంది ఇంటర్ తర్వాత డిగ్రీ పూర్తి చేసి అనంతరం ఏంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపేవారు. కానీ....
ఆదరణ లేక ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు వెలవెల
ఈ ఏడాది ఐసెట్‌లో భర్తీఅయిన సీట్లు 16.5 శాతమే
ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ వైపే విద్యార్థుల చూపు
సాధారణ డిగ్రీలో చేరేందుకుఅనాసక్తి..
ఫలితంగా పీజీ కోర్సుల్లో తగ్గుతున్న అడ్మిషన్లు
ఫీజు రీయింబర్స్‌మెంట్ లేకపోవడమూ ప్రతికూలత
(అమరావతి-ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యకు డిమాండ్ పెరగడంతో ఏంబీఏ, ఎంసీఏ వంటి కోర్సులకు ఆదరణ తగ్గిపోతోంది. ఒకప్పుడు బీటెక్ సీట్లు తక్కువగా ఉన్న సమయంలో ఎక్కువ మంది ఇంటర్ తర్వాత డిగ్రీ పూర్తి చేసి అనంతరం ఏంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపేవారు. కానీ ఇప్పుడు ఇంజనీరింగ్ సీట్లు భారీగా పెరగడంతో అటువైపే విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా డిగ్రీ చదివి, అనంతరం ఏంబీఏ, ఎంసీఏల్లో చేరేవారు తగ్గిపోతున్నారు. తాజాగా ముగిసిన 2026-27 ఐసెట్ అడ్మిషన్ల తుది కౌన్సెలింగ్ వివరాలను పరిశీలిస్తే ఇది స్పష్టమవుతోంది. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో కన్వీనర్ కోటాలో 46,620 సీట్లు అందుబాటులో ఉంటే కేవలం 7696 సీట్లు (16.5శాతం) మాత్రమే భర్తీ అయ్యాయి. ఏకంగా 38,924 సీట్లు మిగిలిపోయాయి. అందులోనూ ఎంసీఏలో పరిస్థితి దారుణంగా ఉంది. 16,804 సీట్లు ఉంటే కేవలం 2642 సీట్లు (15.72 శాతం) మాత్రమే నిండాయి. ఎంబీఏలో 29,816 సీట్లకుగాను 5054 సీట్లు(16.9 శాతం) భర్తీ అయ్యాయి.
‘రీయింబర్స్‌మెంట్’ లేకపోవడంతో..
పీజీ కోర్సులకు ఫీజు రీయింబర్స్‌మెట్ విషయంలో గత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం ఆ కోర్సుల్లో చేరికలపై మరింత ప్రతికూల ప్రభావం చూపింది. పీజీ కోర్సుల్లో గోల్‌మాల్ జరుగుతోందని, విద్యార్థులు కాలేజీలకు వెళ్లడం లేదంటూ జగన్ సర్కార్ ఆ కోర్సులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిలిపివేసింది. దానిపై విచారణ చేసి, తిరిగి పునరుద్ధరిస్తామని చెప్పి పూర్తిగా ఆపేసింది. పీజీ కోర్సులను యూనివర్సిటీ కాలేజీల్లో చదివితేనే రీయింబర్స్‌మెంట్ వర్తించేలా మార్పులు చేసింది. కూటమి ప్రభుత్వం కూడా దీనిని సమీక్షించలేదు. దీంతో గత వైసీపీ ప్రభుత్వ నిర్ణయమే కొనసాగుతోంది. ఫలితంగా విద్యార్థులు యూనివర్సిటీ కాలేజీల్లో చేరేందుకు ఎక్కువ ఆప్షన్లు పెట్టుకుంటున్నారు. పీజీ కోర్సులకు కూడా ఏ కాలేజీలో చదివినా రీయింబర్స్‌మెంట్ వర్తింపజేస్తే.. ఇంకొంత అడ్మిషన్లు పెరిగే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ, యూనివర్సిటీ కాలేజీలు తక్కువ ఉండడంతో.. డిగ్రీ తర్వాత పీజీలో చేరాలన్నా అంత దూరం వెళ్లలేక కొందరు చదువు ఆపేస్తున్నారు. అదే సమీపంలోని ప్రైవేటు కాలేజీల్లోనూ ఫీజు రీయింబర్స్‌మెంట్ ఉంటే చేరికలు పెరిగేందుకు అవకాశం ఉంటుంది.
మారిపోయిన ట్రెండ్
రాష్ట్రంలో కొన్నేళ్లుగా ట్రెండ్ మారిపోయింది. సాధారణ డిగ్రీలో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపట్లేదు. బీటెక్ సీట్లు పెరిగిపోవడం, పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఉండటంతో మొదట ఇంజనీరింగ్‌కు మొగ్గు చూపుతున్నారు. లేనిపక్షంలో పదో తరగతి తర్వాత డిప్లొమాలో చేరిలో మూడేళ్ల తర్వాత బీటెక్‌లోకి వెళ్తున్నారు. దీంతో డిగ్రీ చదివేవారు భారీగా తగ్గిపోయారు. రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో 4.5 లక్షల సీట్లు అందుబాటులో ఉంటే, అందులో 1.5 లక్షలు భర్తీ కావడమే గగనంగా మారింది. డిగ్రీలోనూ కంప్యూటర్స్ ఉండే బ్యాచ్‌లర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (బీసీఏ) లేదా బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ర్టేషన్ (బీబీఏ) కోర్సుల్లోనే ఎక్కువగా చేరుతున్నారు. బీసీఏ చదివిన వారు ఎంసీఏలో చేరే అవకాశం ఉన్నప్పటికీ ఎక్కువ మంది ఆ విద్యార్హతతోనే ఉద్యోగాలకు వెళ్లిపోతున్నారు. బీబీఏ తర్వాత ఎంబీఏ కోర్సులో చేరేందుకు కొంతమేర ఆసక్తి చూపుతున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల ఉచిత బియ్యం.. సీఎం చంద్రబాబు ఆదేశాలు