Share News

సమష్టి కృషితో బ్రహ్మోత్సవాలు విజయవంతం

ABN , Publish Date - Sep 24 , 2026 | 06:36 AM

యంత్రాంగం సమష్టి కృషితో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించామని టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు వెల్లడించారు. తిరుమల వచ్చిన ప్రతి భక్తుడికీ అటు మూలవిరాట్టుతో పాటు ఇటు వాహన సేవల్లో మలయప్ప దర్శన భాగ్యం కల్పించినట్టు తెలిపారు.

సమష్టి కృషితో బ్రహ్మోత్సవాలు విజయవంతం

  • రెండు రోజుల్లో భక్తులకు అందుబాటులోకి ఎస్వీ మ్యూజియం

  • టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు వెల్లడి

తిరుపతి(టీటీడీ), సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): యంత్రాంగం సమష్టి కృషితో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించామని టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు వెల్లడించారు. తిరుమల వచ్చిన ప్రతి భక్తుడికీ అటు మూలవిరాట్టుతో పాటు ఇటు వాహన సేవల్లో మలయప్ప దర్శన భాగ్యం కల్పించినట్టు తెలిపారు. బుధవారం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో టీటీడీ ఈవో రవిచంద్ర తదితరులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 15 నుంచి 22వ తేదీ వరకు శ్రీవారిని మొత్తం 5.76 లక్షల మంది దర్శించుకున్నట్టు పేర్కొన్నారు. హుండీ ద్వారా రూ.29 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు.

21.80 లక్షల అన్నప్రసాదాలు అందించామని, 2.04 లక్షలమంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నట్టు వెల్లడించారు. 33 లక్షల లడ్డూలు విక్రయించామన్నారు. వాహన సేవల్లో 20 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం నుంచి 295 కళా బృందాలతో దాదాపు 7,871 మంది కళాకారులు ప్రదర్శనలు అందించినట్లు చెప్పారు. తొలిసారి జర్మనీ, సింగపూర్‌ కళా బృందాలు తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నాయన్నారు. 4వేల మంది శ్రీవారి సేవకులు విశేష సేవలందించినట్లు చెప్పారు. 3వేల మంది పోలీసులు, 2,400 మంది విజిలెన్స్‌ సిబ్బందితో భద్రతాచర్యలు తీసుకున్నామన్నారు. తిరుమలలో ఆధునికీకరించిన ఎస్వీ మ్యూజియాన్ని రెండు రోజుల్లో భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని చైర్మన్‌ తెలిపారు. అలాగే తిరుమల, తిరుపతి పరిధిలో పచ్చదనాన్ని పెంచేందుకు వృక్ష గోవిందం కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు చెప్పారు.

Updated Date - Sep 24 , 2026 | 06:36 AM