Share News

బీపీసీఎల్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన

ABN , Publish Date - Oct 28 , 2026 | 04:57 AM

రాష్ట్రంలో భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌) గ్రీన్‌ ఫీల్డ్‌ రిఫైనరీ, పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి చకచకా అడుగులు పడుతున్నాయి. రూ. 1.03 లక్షల కోట్లతో ప్రకాశం జిల్లా రామాయపట్నం పోర్టు సమీపంలో చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు డిసెంబరు 5న శంకుస్థాపన చేసేందుకు ముహూర్తం నిర్ణయించారు.

బీపీసీఎల్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన

  • డిసెంబరు 5న! ప్రధాని చేతుల మీదుగా చేయించేందుకు ప్రయత్నాలు

  • ప్రకాశంలో 1.03 లక్షల కోట్లతో గ్రీన్‌ఫీల్డ్‌ రిఫైనరీ

  • ఏటా 9 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం

రాష్ట్రంలో భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌) గ్రీన్‌ ఫీల్డ్‌ రిఫైనరీ, పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి చకచకా అడుగులు పడుతున్నాయి. రూ. 1.03 లక్షల కోట్లతో ప్రకాశం జిల్లా రామాయపట్నం పోర్టు సమీపంలో చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు డిసెంబరు 5న శంకుస్థాపన చేసేందుకు ముహూర్తం నిర్ణయించారు. ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా చేయాలని నిర్ణయించారు. దీని కోసం ఢిల్లీ స్థాయిలో పీఎంవోతో బీపీసీఎల్‌ యాజమాన్యం సంప్రదింపులు జరుపుతున్నట్లు ఉన్నతవర్గాల ద్వారా తెలిసింది. డిసెంబరు 4 నుంచి 6వ తేదీ వరకూ తిరుపతిలోని ఐసర్‌ వేదికగా జరగనున్న అన్ని రాష్ట్రాల డీజీపీలు, ఐజీపీల వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి విచ్చేస్తున్నారు. తొలి రెండు రోజులు ఈ కాన్ఫరెన్స్‌లో ప్రధాని పాల్గొనే అవకాశాలు ఉన్నాయి.

ఇదే సమయంలో బీపీసీఎల్‌ కాంప్లెక్స్‌కు కూడా శంకుస్థాపన చేసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే అధికారికంగా ప్రధాని పర్యటన ఖరారు కావలసి ఉంది. రామాయపట్నం పోర్టు సమీపంలో 5,200 ఎకరాల్లో బీపీసీఎల్‌ గ్రీన్‌ ఫీల్డ్‌ రిఫైనరీ, పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయనుంది. దేశంలోని అతిపెద్ద రిఫైనరీల్లో ఇది ఒకటి కావడం గమనార్హం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేసి బీపీసీఎల్‌కు భూములు అప్పగించింది. ప్రాజెక్ట్‌ ఏర్పాటు కోసం బీపీసీఎల్‌ కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు దరఖాస్తు చేసుకోగా, ఇటీవల ఎక్స్‌పర్ట్‌ కమిటీ కూడా ఎటువంటి అభ్యంతరాలు లేవని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసింది.


ఇక అనుమతులు మంజూరు కావడమే మిగిలి ఉంది. వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు మొదలు పెట్టాలన్న యోచనలో బీపీసీఎల్‌ యాజమాన్యం ఉంది. ఈ ప్రాజెక్టుతో రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిలో మరో కీలక ముందడుగు పడనుంది. సంవత్సరానికి 9 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ రిఫైనరీ, పెట్రో కమికల్‌ కాంప్లెక్స్‌లో పెట్రోల్‌, డీజిల్‌, ఏవియేషన్‌ ఫ్యూయల్‌, నాఫ్తా, ఎల్‌పీజీ, బిటుమినస్‌ వంటి వాటిని ఉత్పత్తి చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణ దశలో ప్రత్యక్షంగా 400 మందికి, పరోక్షంగా 13,600 మందికి.. ప్రాజెక్ట్‌ పూర్తయ్యాక ప్రత్యక్షంగా 1,250 మందికి, పరోక్షంగా 3,750 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

ఈ వార్తలనూ చదవండి:

తీరం దాటుతున్న ఆర్నబ్ తుఫాన్..!

ఆర్నబ్ తుఫాన్ వేళ.. రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు

Updated Date - Oct 28 , 2026 | 04:57 AM