ప్రభుత్వాస్పత్రుల్లో బోన్‌మ్యారో చికిత్స
ABN , Publish Date - Oct 08 , 2026 | 05:12 AM
రాష్ట్రంలోని మూడు ప్రభుత్వాస్పత్రుల్లో బోన్‌మ్యారో చికిత్సను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. విశాఖలోని కింగ్ జార్జ్, గుంటూరు ప్రభుత్వాస్పత్రులతోపాటు కర్నూలులోని స్టేట్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌లో
నిర్దిష్ట గడువులోగా అందుబాటులోకి తేవాలి: హైకోర్టు
అమరావతి, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని మూడు ప్రభుత్వాస్పత్రుల్లో బోన్‌మ్యారో చికిత్సను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. విశాఖలోని కింగ్ జార్జ్, గుంటూరు ప్రభుత్వాస్పత్రులతోపాటు కర్నూలులోని స్టేట్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌లో బోన్‌మ్యారో చికిత్సకు అవసరమైన ప్రత్యేక మౌలిక సదుపాయాల అభివృద్ధికి డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రతిపాదనలు పంపారని ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాది(ఎస్‌జీపీ) ప్రణతి కోర్టుకు తెలిపారు. బడ్జెట్ ఆమోదం కోసం ఫైలు ప్రస్తుత ఆర్థికశాఖ వద్ద ఉందని, ఫైల్ ఆమోదం పొందిన తర్వాత.. ఎప్పటిలోగా చికిత్స అందుబాటులోకి వస్తుందనే విషయంపై స్పష్టత వస్తుందన్నారు.
వివరాలు సమర్పించేందుకు కొంత సమయం ఇవ్వాలని కోరారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం నిర్దిష్ట గడువులు నిర్దేశించుకొని, సాధ్యమైనంత త్వరగా చికిత్సను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎప్పటిలోగా చికిత్సను అందుబాటులోకి తీసుకొస్తారో స్పష్టతనిస్తూ.. పురోగతిపై వివరాలను తదుపరి విచారణలో తమ ముందు ఉంచాలని అధికారులకు స్పష్టం చేసింది. విచారణను వాయిదా వేసింది. ఈమేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసాగిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ఽధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఎన్టీఆర్ జిల్లా పెనుగొలను గ్రామానికి చెందిన గుంత వెంకట సాయికుమార్ దాఖలు చేసిన పిల్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది. వివిధ ప్రభుత్వ పథకాల కింద రోగులకు అందించే ఆర్థిక సహాయం పరిమితిని పెంచే విషయాన్ని పరిశీలించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
ఈ వార్తలనూ చదవండి..