బిల్ గేట్స్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Feb 16 , 2026 | 05:54 PM
సోమవారం బిల్ గేట్స్ అమరావతి పర్యటనలో భాగంగా సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు.. బిల్ గేట్స్‌తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
అమరావతి, ఫిబ్రవరి 16: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంతో రాష్ట్ర అభివృద్ధికి కొత్త దశ-దిశ ఏర్పడుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ అమరావతి రాక చారిత్రాత్మకంగా నిలుస్తుందని, ఆంధ్రప్రదేశ్ ప్రజల సాధికారతకు ఇది దోహదపడుతుందని చెప్పారు. సోమవారం బిల్ గేట్స్ అమరావతి పర్యటనలో భాగంగా సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బిల్ గేట్స్‌తో తన అనుబంధాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. 1997లో మొదటిసారి తాను బిల్ గేట్స్‌ను కలిశానని, హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను వివరించానని అన్నారు. మైక్రోసాఫ్ట్ రాకతో ఇప్పుడు హైదరాబాద్ ఐటీ రంగంలో మేటిగా నిలబడిందన్నారు. రాష్ట్ర విభజన అనంతరం తాను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పనిచేస్తున్నానని ముఖ్యమంత్రి చెప్పారు. ఏపీలో వనరులకు లోటు లేదని, సంపద సృష్టి జరగాల్సి ఉందన్నారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో 2047 నాటికి రాష్ట్రాన్ని నెంబర్ వన్ చేస్తామనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
చంద్రబాబు విజనరీ అని ఆనాడే తెలిసింది: బిల్‌గేట్స్
ఈ సమావేశంలో బిల్ గేట్స్ మాట్లాడుతూ.. డిజిటల్ విప్లవానికి భారత్‌లో బలమైన పునాదులు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. భారతదేశ డిజిటల్ విప్లవంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషిస్తున్నారని కితాబిచ్చారు. తాను మొదటిసారి చంద్రబాబును కలిసినప్పుడు ఆయన ఆలోచనల్లో ముందుచూపు ఉందనే విషయాన్ని ఆనాడే గ్రహించినట్టు వెల్లడించారు. ఈ విషయంలో నాటి సింగపూర్ ప్రధాని మాత్రమే చంద్రబాబుకు కొంత దగ్గరగా ఉన్నారని చెప్పారు. గేట్స్ ఫౌండేషన్ చేపడుతున్న కార్యక్రమాల్లో ఆరోగ్య రంగానికి చెందిన ప్రాజెక్టులే మెజార్టీ ప్రాజెక్టులని తెలిపారు. ఆరోగ్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలన్నది తన ఆశయమన్నారు. కుప్పంలో అమలు చేస్తున్న సంజీవని కార్యక్రమం అద్భుతంగా ఉందని అభినందించారు. విద్యార్థుల సమస్యలను అర్థం చేసుకోవడానికి, వారికి సరైన రీతిలో.. తగిన స్థాయిలో విద్యా బోధన చేయడానికి ఏఐ సహాయపడుతుందన్నారు.
విద్యారంగంలో మార్పు తీసుకురావడానికి ఏఐ-టెక్నాలజీ ఉపయోగపడుతుందని చెప్పిన బిల్ గేట్స్, వ్యవసాయం రంగం చాలా ముఖ్యమైనదిగా అభిప్రాయపడ్డారు. టెక్నాలజీ సాయంతో ఏపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం, టెక్నాలజీని రైతులకు అందించేందుకు ఏఐని వ్యవసాయంతో ఇంటిగ్రేట్ చేస్తూ కృషి చేయడాన్ని ఆయన అభినందించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా వ్యవసాయంలో ఏఐని ఇంతలా వినియోగంచడం లేదని.. కానీ, ఆంధ్రప్రదేశ్ ఈ విషయంలో ముందుండటం మంచి పరిణామమని చెప్పారు. విపత్తుల నిర్వహణ కోసం టెక్నాలజీతో ముందస్తు అంచనాలు వేసి ప్రాణ నష్టం జరగ్గకుండా జాగ్రత్తలు తీసుకునే వ్యవస్థ ఏర్పాటు చేయడం బాగుందన్నారు. చంద్రబాబు తనకు గుడ్ ఓల్డ్ ఫ్రెండ్ అని సమావేశంలో బిల్ గేట్స్ సరదాగా వ్యాఖ్యానించారు.
బిల్‌గేట్స్‌తో మంత్రుల ఇంటరాక్షన్
సమావేశంలో పలు అంశాలపై ప్రశ్నలు వేసి మంత్రులు పయ్యావుల, సత్యకుమార్ యాదవ్.. గేట్స్ అభిప్రాయాలు తెలుసుకున్నారు. హైదరాబాద్‌లో మైక్రో సాఫ్ట్ సెంటర్ ఏర్పాటు చేయాలనే ఆలోచనకు కారణమేంటని మంత్రి పయ్యావుల అడగ్గా.. దీనికి బిల్ గేట్స్ ఆసక్తికర సమాధానం చెప్పారు. నాడు చంద్రబాబు ఐటీని ప్రమోట్ చేయడం వల్ల టెక్ నిపుణులు చాలా మంది హైదరాబాద్ నుంచే వచ్చేవారని అన్నారు. అదే సమయంలో చంద్రబాబు మైక్రో సాఫ్ట్ కార్యాలయాన్ని హైదరాబాద్‌లో పెట్టాలనే ప్రతిపాదన పెట్టారని బిల్ గేట్స్ తెలిపారు. దీనిపై తమ వద్ద పని చేసే వారి అభిప్రాయం కోరితే.. హైదరాబాద్ సెంటర్ ఏర్పాటు చేస్తే తాము వెళ్లడానికి సిద్దంగా ఉన్నట్టు చెప్పారని బిల్ గేట్స్ సమావేశంలో వివరించారు. ఇప్పుడు కూడా భారతదేశంలో మైక్రో సాఫ్ట్ కంపెనీల్లో పని చేసే చాలా మంది ఉద్యోగుల్లో హైదరాబాద్ వారే ఎక్కువగా ఉన్నారని బిల్ గేట్స్ అన్నారు.
ఇవి కూడా చదవండి
ఏపీ ప్రభుత్వంపై బిల్‌గేట్స్ ప్రశంసలు..
ఏపీ అభివృద్ధికి గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యం కీలక మలుపు: పవన్ కల్యాణ్