Share News

ఉత్తర కోస్తాపై ఆర్నబ్‌ పంజా

ABN , Publish Date - Oct 28 , 2026 | 04:09 AM

అతితీవ్ర తుఫాన్‌ ‘ఆర్నబ్‌’ మంగళవారం కోస్తా జిల్లాలను వణికించింది. పెనుగాలులు, కుంభవృష్టితో అనేకచోట్ల జనజీవనం అస్తవ్యస్తమైంది. శ్రీకాకుళం నుంచి బాపట్ల వరకు అనేక ప్రాంతాల్లో పెనుగాలులు వీచాయి.

ఉత్తర కోస్తాపై ఆర్నబ్‌ పంజా

  • విరుచుకుపడిన అతి తీవ్ర తుఫాను

  • పెనుగాలులు.. రాకాసి అలల బీభత్సం

  • విశాఖలో 20.2 సెం.మీ. రికార్డు వర్షం

  • నేడూ 11 జిల్లాల్లో కుంభవృష్టి

  • మరో 4 జిల్లాల్లో అతిభారీ వర్షాలు

  • కాకినాడ, కోనసీమకు రెడ్‌ అలర్ట్‌

  • కోస్తాంధ్రలోని మిగిలిన జిల్లాలకు భారీ వర్ష సూచన

  • భారీగా రైళ్లు, విమానాలు రద్దు

  • ప్రయాణాలు వాయిదా వేసుకోండి

  • ఇళ్లలోనే సురక్షితంగా ఉండండి

  • లోతట్టు, తీర, లంక ప్రాంతాల ప్రజలు షెల్టర్లకు తరలి వెళ్లండి

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): అతితీవ్ర తుఫాన్‌ ‘ఆర్నబ్‌’ మంగళవారం కోస్తా జిల్లాలను వణికించింది. పెనుగాలులు, కుంభవృష్టితో అనేకచోట్ల జనజీవనం అస్తవ్యస్తమైంది. శ్రీకాకుళం నుంచి బాపట్ల వరకు అనేక ప్రాంతాల్లో పెనుగాలులు వీచాయి. కుంభవృష్టి కురిసింది. విశాఖ జిల్లాలో అత్యధికంగా 20.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీనిని కేటగిరీ-3 తుఫాన్‌గా నిపుణులు విశ్లేషించారు. అతి తీవ్ర తుఫాన్‌ తీరాన్ని తాకే ప్రక్రియ మంగళవారం రాత్రి రాజోలు, నరసాపురం ప్రాంతాల్లో ప్రారంభమైంది. బుధవారం తెల్లవారుజాము వరకు తీరం దాటే ప్రక్రియ కొనసాగనుందని ఐఎండీ తెలిపింది. గాలులు గంటకు 125 నుంచి 135, అప్పుడప్పుడు 150 కి.మీ. వేగంతో వీస్తాయని పేర్కొంది. కాకినాడ, యానాం పరిసరాల్లో సముద్ర అలలు 1.5 నుంచి 2.5 మీటర్ల ఎత్తున ఎగసిపడతాయని తెలిపింది.


తీరం దాటిన తర్వాత ఉత్తరంగా దిశ మార్చుకుని ఉమ్మడి గోదావరి, విశాఖ జిల్లాల మీదుగా దక్షిణ ఛత్తీస్‌గఢ్, ఒడిశా వైపు పయనించనున్నది. తుఫాన్‌ దిశ మార్చుకునే సమయంలో బాగా నెమ్మదించనుండడంతో గాలుల ఉధృతి, వర్షాలు మరింత పెరగనున్నాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు కోస్తా భూభాగంలోనే తుఫాను పయనిస్తూ క్రమేపీ బలహీనపడనున్నదని ఒక అంచనా. దీనివల్ల కోస్తా, దానికి ఆనుకుని తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో వర్షాలు పెరగనున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలపై ఎక్కువ ప్రభావం చూపుతుందని నిపుణులు తెలిపారు.

కాగా, అతి తీవ్ర తుఫాన్‌ తీరం దిశగా వచ్చే క్రమంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మంగళవారం గంటకు 160 నుంచి 180 కి.మీ. వేగంతో గాలులు వీచాయి. సముద్రం అల్లకల్లోలంగా మారి తీరం దిశగా అలలు ఎగిసిపడుతున్నాయి. పలుచోట్ల సముద్రం ముందుకువచ్చింది. కాకినాడ రేవులో గ్రేట్‌ డేంజర్‌ సిగ్నల్‌ 10, భీమిలి, విశాఖపట్నం, గంగవరంలో 9, మచిలీపట్నం, నిజాంపట్నంలలో 8వ నంబరు హెచ్చరికలు ఎగురవేశారు. గ్రేట్‌ డేంజర్‌ సిగ్సల్స్‌ ఎగురవేయడం అంటే ఆ ఓడరేవులో అన్ని కార్యకలాపాలు నిలిచిపోయినట్టు. సముద్రంలో చేపల వేటను నిషేధించారు. మరో రెండురోజుల పాటు నిషేధం కొనసాగనున్నది. పలు జిల్లాల్లో సోమవారం రాత్రి నుంచే వర్షం, గాలులు మొదలయ్యాయి.


మంగళవారం ఉదయం నుంచి గాలుల వేగం, వర్షం జోరు పెరిగింది. గంటకు 80 నుంచి 90 కి.మీ., అప్పుడప్పుడు 100 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయి. కోస్తాలో అనేకచోట్ల, ముఖ్యంగా ఉత్తరకోస్తాలో కుంభవృష్టి కురిసింది. ఉత్తరకోస్తాలో అనేకచోట్ల చెట్లు కూలిపోవడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. ఉద్యానవన తోటలు ధ్వంసమయ్యాయి. కోతకు వచ్చిన వరి, పత్తి పంటలకు నష్టం వాటిల్లింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కుండపోత వర్షం, ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది. కాకినాడ జిల్లాలోని తొండంగి, యు.కొత్తపల్లి, కాకినాడ రూరల్‌ మండలాలు, కోనసీమ జిల్లాలోని అల్లవరం మండలం ఓడలరేవు వంటి తీర ప్రాంతాల్లో సముద్రం ఉగ్రరూపాన్ని ప్రదర్శించింది.

ఉప్పాడ-కాకినాడ బీచ్‌ రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. రాళ్లు పైకి లేచాయి. సముద్రపు కోత నివారణకు వేసిన బండరాళ్లు సైతం ముక్కలుగా మారి రోడ్డుపైకి చేరాయి. యానాం నుంచి కాకినాడ వరకు ఉప్పెన ఉపద్రవం తలెత్తే ప్రమాదం ఉందనే హెచ్చరికలతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. మధ్యాహ్నం నుంచి పలు గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. కాకినాడ జిల్లా అంతటా అంధకారం అలుముకుంది. పలు మండలాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. కాకినాడ, కోనసీమ జిల్లాల్లో వందలాది విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. వంద లాది హోర్డింగ్‌లు కూలిపోయాయి. సెల్‌టవర్లు సైతం ఒరిగిపోయాయి. వీటికి విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో అనేక సెల్‌టవర్లు పనిచేయక సిగ్నల్స్‌ నిలిచిపోయాయి. అల్లవరం వద్ద ఓఎన్జీసీ ప్లాంట్‌ ప్రహారీని సముద్రం తాకింది. గ్రామాల్లో అనేక రేకుల షెడ్లు ఎగిరిపోయాయి. కోళ్లఫారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. యానాంలో పలుచోట్ల చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. యానాం సావిత్రినగర్‌లో సముద్రపు నీరు 3 నుంచి 4 అడుగుల మేర పెరిగి ఇళ్లలోకి చేరింది.


అక్కడ ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో గ్రౌండ్‌ ఫ్లోర్‌ అంతా నీరు చేరడంతో ప్రజలను మొదటి అంతస్తుకు తరలించారు. శ్రీకాకుళం జిల్లాలోనూ సముద్రం కొన్ని మీటర్లమేర ముందుకొచ్చింది. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఆవరణలోకి వర్షపు నీరు చేరడతో సిబ్బంది, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విజయనగరం జిల్లాలో 200 చెట్లు నేలకొరిగాయి, 10 విద్యుత్‌ స్థంభాలు విరిగిపడ్డాయి. సహాయక చర్యల్లో భాగంగా విద్యుత్‌శాఖ అధికారులు 600 మంది సిబ్బందిని రంగంలోకి దించారు. వరి, పత్తి, చెరకు, బొప్పాయి, మునగ పంటలతో పాటు.. ఉద్యాన పంటలకు నష్టం కలిగింది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోనూ పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. విద్యుత్‌ సరఫరా నిలిచి పట్టణంతోపాటు గ్రామాల్లో అంధకారం అలముకొంది. చిన్న లంక, పీఎం లంక, తూర్పు తాళ్లు, వేములదీవి గ్రామాల్లో సుమారు మూడు వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. అనకాపల్లి జిల్లావ్యాప్తంగా మంగళవారం భారీవర్షం కురిసింది. పలు మండలాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది.

కేటగిరీ-3 తుఫాన్‌ అంటే..

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న పరిస్థితులను బట్టి ‘ఆర్నబ్‌’ను కేటగిరీ-3 తుఫాన్‌గా వాతావరణ నిపుణులు విశ్లేషించారు. తుఫాన్‌ల తీవ్రత ముఖ్యంగా గాలుల వేగాన్ని పరిగణనలోకి తీసుకుని కేటగిరీలుగా విభజిస్తారు. 157 కిలోమీటర్ల పైబడి గాలులు వీస్తున్నందున ఆర్నబ్‌ను కేటగిరీ-3గా పరిగణిస్తున్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మంగళవారం 180 కి.మీ. కంటే ఎక్కువ వేగంతో గాలులు వీచాయని తెలిపారు.


సముద్రంలోకి కొట్టుకుపోయిన ఇళ్లు!

కాకినాడ, కోనసీమ తీరప్రాంతాలను చాలావరకు సముద్రం మింగేసింది. భారీ కెరటాలు గ్రామాల్లోకి చొచ్చుకురావడంతో మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో ప్రజలు పొలాల వెంబడి, గట్ల వెంబడి కారుచీకట్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. కాకినాడ రూరల్‌, కరప, యు.కొత్తపల్లి మండలాల్లో అనేక ఇళ్లు సముద్రంలోకి కొట్టుకుపోయాయి.

విశాఖలో రికార్డు స్థాయిలో 20.2 సెం.మీ. వర్షం

విశాఖ రూరల్‌లోని 16వ పోలీస్‌ బెటాలియన్‌ ప్రాంతంలో అత్యధికంగా 20.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంగళవారం ఉదయం 8.30 నుంచి రా త్రి 11 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.

నేడూ కుంభవృష్టి

బుధవారం విశాఖపట్నం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, ఉభయ గోదావరి, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్‌, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో కుంభవృష్టి, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, గుంటూరు జిల్లాల్లో అతిభారీగా, కోస్తాంధ్రలోని మిగిలిన జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది. గురువారం కూడా వర్షాలు కొనసాగుతాయని తెలిపింది.

ఈ వార్తలనూ చదవండి:

తీరం దాటుతున్న ఆర్నబ్ తుఫాన్..!

ఆర్నబ్ తుఫాన్ వేళ.. రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు

Updated Date - Oct 28 , 2026 | 04:09 AM