Share News

దసరాకు 5,261 ప్రత్యేక బస్సులు

ABN , Publish Date - Oct 13 , 2026 | 04:25 AM

దసరా పండుగ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు జాయింట్‌ ఎండీ శివప్రసాద్‌ తెలిపారు. ఈ నెల 20న దసరా పండుగకు ముందు, ఆ తర్వాత రద్దీని అంచనా వేసి 5,261 ప్రత్యేక సర్వీసుల్ని నడపనున్నట్టు చెప్పారు.

దసరాకు 5,261 ప్రత్యేక బస్సులు

  • సాధారణ చార్జీలతోనే అదనపు సర్వీసులు

అమరావతి, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): దసరా పండుగ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు జాయింట్‌ ఎండీ శివప్రసాద్‌ తెలిపారు. ఈ నెల 20న దసరా పండుగకు ముందు, ఆ తర్వాత రద్దీని అంచనా వేసి 5,261 ప్రత్యేక సర్వీసుల్ని నడపనున్నట్టు చెప్పారు. విజయవాడలోని ఆర్టీసీ హౌస్‌లో సోమవారం ఆయన మాట్లాడుతూ.. పండుగ నేపథ్యంలో హైదరాబాద్‌, బెంగుళూరు, చెన్నైతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం ఈ నెల 16 నుంచి 19 వరకూ 3,207 బస్సులు సిద్ధం చేసినట్టు తెలిపారు. పండుగ తర్వాత తిరిగి వెళ్లే ప్రయాణీకుల కోసం అక్టోబరు 20 నుంచి 25 వరకూ 2,054 బస్సులు అందుబాటులో ఉంటాయని, ప్రయాణీకుల రద్దీని బట్టి ప్రయాణ సేవల్లో అంతరాయం ఏర్పడకుండా బస్సులు నడుపుతామని వెల్లడించారు. సాధారణ చార్జీలతో నడిపే ప్రత్యేక సర్వీసుల్లో అత్యధికంగా హైదరాబాద్‌ నుంచి మన రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు 1,186 బస్సులు కేటాయించామని, విజయవాడకు 1,053, బెంగుళూరుకు 475, చెన్నైకి 153, విశాఖపట్నానికి 440, రాజమండ్రికి 347, తిరుపతికి 247బస్సులు నడుపుతున్నట్టు జేఎండీ వివరించారు. ఆర్టీసీ సేవల్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆయన కోరారు.


  • 2027 చివరికి 3 వేల ఎలక్ట్రిక్‌ బస్సులు

ఆర్టీసీలో మూడు వేల ఎలక్ట్రిక్‌ బస్సులు వచ్చే ఏడాది చివరికల్లా అందుబాటులోకి వస్తాయని శివప్రసాద్‌ తెలిపారు. మరో మూడు నెలల్లో 150 బస్సులు రాబోతున్నాయని, ఆర్టీసీ సొంతంగా 500 సీఎన్‌జీ బస్సులు వచ్చే ఏడాది మే నాటికి కొనుగోలు చేస్తోందని పేర్కొన్నారు. మరో 1,450 అదే ఏడాది చివరికల్లా అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. ఆర్టీసీలో సిబ్బంది పదవీ విరమణతో ఏర్పడిన ఖాళీల భర్తీ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. కాగా, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లపై దాడులు చేస్తే చట్టపరంగా కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించారు. ఆర్టీసీలో పనిచేస్తోన్న ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి ఎస్‌బీఐ ద్వారా రూ.30 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పిస్తామని జేఎండీ చెప్పారు. ఇటీవల తూర్పు గోదావరి జిల్లాలో గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన డ్రైవర్‌ కుటుంబానికి సంస్థ నుంచి ఆర్థిక సాయం చేస్తున్నామని, అయితే సంస్థలో పనిచేస్తోన్న 8,500 మందికి ఎస్‌బీఐలో శాలరీ అకౌంట్‌ ప్రారంభించి బీమా అమలయ్యేలా చర్యలు చేపడతామని వివరించారు.

ఈ వార్తలనూ చదవండి:

పెట్టుబడుల స్వర్గధామం ఏపీ

నాడు అడ్డగోలు.. నేడు గగ్గోలు

Updated Date - Oct 13 , 2026 | 04:25 AM