Share News

ఎన్‌వోసీ తప్పనిసరా?!

ABN , Publish Date - Nov 11 , 2026 | 01:15 AM

ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ గ్రూప్‌-1కు దరఖాస్తు చేసుకున్న వారు ఏపీపీఎస్సీ పెట్టిన నిబంధనలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల విడుదలైన గ్రూప్‌-1 నోటిఫికేషన్‌లో పెట్టిన నిబంధనకు, ఆ తర్వాత దరఖాస్తు సమయంలో...

ఎన్‌వోసీ తప్పనిసరా?!

  • ప్రభుత్వ ఉద్యోగం చేసే గ్రూప్‌-1 దరఖాస్తుదారుల ఆందోళన

అమరావతి, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ గ్రూప్‌-1కు దరఖాస్తు చేసుకున్న వారు ఏపీపీఎస్సీ పెట్టిన నిబంధనలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల విడుదలైన గ్రూప్‌-1 నోటిఫికేషన్‌లో పెట్టిన నిబంధనకు, ఆ తర్వాత దరఖాస్తు సమయంలో పెట్టిన నిబంధనలకు పొంతన లేకపోవడమే దీనికి కారణం. ప్రభుత్వ ఉద్యోగులు, అటానమస్‌ సంస్థల ఉద్యోగులు, ఎయిడెడ్‌ సంస్థల్లో శాశ్వత ఉద్యోగులుగా లేదా తాత్కాలిక విధానంలో పనిచేస్తున్నవారు వారి శాఖ ప్రధాన కార్యాలయానికి రాతపూర్వకంగా సమాచారం ఇవ్వాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. తీరా ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకునే సమయంలో శాఖ నుంచి ఎన్‌వోసీ ఉందా? లేదా? అని అడిగే ఆప్షన్‌ పెట్టారు. ఉంది అనే ఆప్షన్‌ ఎంచుకున్న వారినుంచే దరఖాస్తులు స్వీకరించారు. అయితే చాలా మంది ఉద్యోగులు ఎన్‌వోసీ లేకపోయినా దరఖాస్తు తిరస్కరిస్తారని ఉందన్నట్లుగా ‘ఎస్‌’ అనే ఆప్షన్‌ ఎంపిక చేసుకుని దరఖాస్తులు సమర్పించారు. అయితే ఉద్యోగాల భర్తీ తుది దశలో జరిగే సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో ఎన్‌వోసీ కావాలని పట్టుబడితే ఏంచేయాలి? అని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని శాఖలు నెలల తరబడి ఎన్‌వోసీ ఫైళ్లను పెండింగ్‌లో పెడుతున్నందున దరఖాస్తు చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎమ్మెస్సీ సైకాలజీకి అవకాశం ఇవ్వాలి

మహిళా శిశు సంక్షేమ శాఖలో గ్రేడ్‌-2 జిల్లా ప్రొబేషన్‌ ఆఫీసర్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకునేందుకు ఎమ్మెస్సీ సైకాలజీ చదివిన వారికి కూడా అవకాశం ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఎంఏ సైకాలజీ ఉండాలని ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌లో ఉందని, అయితే కొన్ని యూనివర్సిటీల్లో ఎమ్మెస్సీ సైకాలజీ మాత్రమే అందుబాటు ఉన్నందున అది చదివిన వారు అనర్హులుగా మారుతున్నారని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

విశాఖ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ సేవల రద్దు

30 ఏళ్లు దాటినా రాజీవ్ గాంధీ భౌతికకాయం ఫొటో చూడని సోనియా!

Updated Date - Nov 11 , 2026 | 01:20 AM