తెలంగాణ జలదోపిడీ ఆపండి!
ABN , Publish Date - Oct 10 , 2026 | 04:11 AM
తెలంగాణ జలదోపిడీని అరికట్టి ఆంధ్రప్రదేశ్‌కు కృష్ణా జలాల్లో న్యాయబద్ధమైన వాటా దక్కేందుకు తక్షణమే జోక్యం చేసుకోవాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను రాష్ట్ర జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు కోరారు.
విద్యుత్ కోసం రోజుకు టీఎంసీన్నర తోడేస్తోంది
ఇలాగైతే కొద్దిరోజుల్లోనే కనీస మట్టానికి శ్రీశైలం డ్యాం
కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్‌కు నిమ్మల లేఖ
అమరావతి, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ జలదోపిడీని అరికట్టి ఆంధ్రప్రదేశ్‌కు కృష్ణా జలాల్లో న్యాయబద్ధమైన వాటా దక్కేందుకు తక్షణమే జోక్యం చేసుకోవాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను రాష్ట్ర జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు కోరారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో నిల్వ ఉన్న 73.53 టీఎంసీల (846.90 అడుగులు)ను కాపాడేందుకు తగు ఆదేశాలివ్వాలని అభ్యర్థించారు. ఈ మేరకు పాటిల్‌కు శుక్రవారం లేఖ రాశారు. తెలంగాణ విద్యుదుత్పత్తి కోసం రోజుకు ఒకటిన్నర టీఎంసీ తోడేస్తోందని.. ఇలాగైతే కొద్ది రోజుల్లోనే శ్రీశైలం జలాశయం కనీస మట్టానికి చేరుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి రాయలసీమ తాగునీటి అవసరాలకు కృష్ణా జలాలు తరలించాంటే కనీసం 834 అడుగుల మేర శ్రీశైలంలో నీటి నిల్వలు ఉండాల్సిందేనని నిమ్మల గుర్తుచేశారు. డ్యాం డెడ్ స్టోరేజీ 34.29 టీఎంసీలని..
దీనిని మినహాయిస్తే ప్రస్తుతం జలాశయంలో కేవలం 39.24 టీంఎంసీలే ఉన్నాయని తెలిపారు. గురువారం నాటికి తెలంగాణ విద్యుదుత్పత్తి కోసం ఏకంగా 42.378 టీఎంసీలు వాడేసిందన్నారు. ఇదే కొనసాగితే కరువుపీడిత సీమకు తాగునీరు కూడా దొరకని దుస్థితి నెలకొంటుందన్నారు. తెలంగాణ ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా ఎడమ గట్టు విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా నీటిని తోడేస్తోందని.. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) స్వతంత్ర సంస్థగా విధులు నిర్వహించలేకపోతోందని నిమ్మల ఆక్షేపించారు.
ఈ వార్తలనూ చదవండి:
సుప్రీంకోర్టులో వైసీపీకి చుక్కెదురు..
ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు