Share News

సెలవులో జేటీసీ

ABN , Publish Date - Oct 12 , 2026 | 05:13 AM

కీలకమైన దసరా సమయంలో జాయింట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌(జేటీసీ) సెలవులోకి వెళ్లారు.

సెలవులో జేటీసీ

  • ఏటీఎస్‌ యజమానులతో వివాదం కారణం

  • రవాణా శాఖలో ముదురుతున్న రచ్చ

(అమరావతి-ఆంధ్రజ్యోతి): కీలకమైన దసరా సమయంలో జాయింట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌(జేటీసీ) సెలవులోకి వెళ్లారు. ఆటోమెటిక్‌ టెస్టింగ్‌ స్టేషన్‌(ఏటీఎస్)ల యజమానులతో వివాదమే దీనికి కారణం. ఏటీఎస్‌ల దోపిడీపై ప్రశ్నించిన అధికారిని లక్ష్యంగా చేసుకుని ఇబ్బంది పెడుతున్నారంటూ కొందరు ఎంవీఐ(మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌)లు మండిపడుతున్నారు. తాము ఆందోళనకు దిగుతామంటూ రవాణా శాఖ పెద్దలకు సంకేతాలిస్తున్నారు. విశాఖపట్నంలో ఉన్న ప్రైవేటు బస్సుకు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఒక ఏటీఎస్‌ నుంచి గత నెలలో ఫిట్నెస్‌ సర్టిఫికెట్‌ జారీ చేశారు. దీనిపై రవాణా కమిషనర్‌కు ఫిర్యాదు అందడంతో విచారించి ఏటీఎస్‌పై చర్యలకు ఉపక్రమించారు. అదే సమయంలో ఇతర ఏటీఎస్‌ల నిర్వాహకులతో జూమ్‌ మీటింగ్‌ నిర్వహించిన జేటీసీ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. దీంతో జేటీసీపై ఫిర్యాదు చేసేందుకు ఏటీఎస్‌ల యజమానులు విజయవాడలోని రవాణా కమిషనరేట్‌కు వెళ్లగా అధికారులు సెలవులో ఉండటంతో జేటీసీకే తమ అభ్యంతరాన్ని తెలియజేసేందుకు ప్రయత్నించారు. ఆ సందర్భంగా జేటీసీ రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేశారంటూ ఏటీఎస్‌ల యజమానులు సీఎం, డిప్యూటీ సీఎంలతోపాటు కీలక మంత్రికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు.

దీంతో జేటీసీ సెలవు పెట్టి వెళ్లిపోయారు. అదే సమయంలో జేటీసీకి మద్దతుగా గుంటూరు రేంజ్‌లో పనిచేస్తోన్న ఒక ఎంవీఐ ఇతర ఎంవీఐలను కూడగట్టే ప్రయత్నం చేశారు. ఏటీఎస్‌ల నిర్వాహకులు ఆటోల నుంచి మినీ గూడ్స్‌ వాహనాల వరకూ 2వేల నుంచి 3వేల రూపాయలు అదనంగా ఏజెంట్లతో వసూలు చేయిస్తున్నారని అంతర్గతంగా ఎంవీఐలు చర్చించుకున్నారు. బస్సులు, లారీలు ఇతర భారీ వాహనాలకు 3వేల నుంచి ఆరు వేల వరకూ పిండుకొంటున్నారన్నారు. రాష్ట్రంలో ఏటీఎస్‌లు ఏర్పాటైనప్పటి నుంచి ఆరు లక్షల వాహనాలకు ఎఫ్‌సీ చేశారని, పొరుగు రాష్ట్రాలవి కలిపితే మరో లక్షకు పైగా ఉన్నాయని గుర్తించారు. వాటన్నింటి నుంచి వసూలు చేసిన మొత్తం ఎన్ని కోట్లు ఉంటుందో లెక్కగట్టారు.


ఇదంతా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పాత బకాయి రూ.44కోట్లు ఆపించేస్తే తమ సత్తా ఏంటో తెలుస్తుందనే చర్చ ఎంవీఐలలో జరిగింది. ఇవన్నీ బయటికి చెప్పిన తర్వాత వచ్చే పరిణామాలపైనా ఆలోచించుకోవాలని కొందరు చేసిన సూచనతో వెనక్కి తగ్గినట్లు సమాచారం. అయితే ఏటీఎస్‌ల తనిఖీలకు కమిషనర్‌ సిద్ధంగా ఉండటంతో తరచూ తనిఖీలు చేసి అక్రమాలను మాత్రమే బయట పెడదామని, ఇప్పుడు జేటీసీ వైపు నిలబడటం కన్నా వరుసగా ఏటీఎ్‌సలలో జరిగే పరిణామాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళితే బాగుంటుందన్న అభిప్రాయం ఆర్టీవోల నుంచి వ్యక్తమైనట్లు తెలిసింది. ఇదే సమయంలో తమ బకాయిలు చెల్లించాలని, భారీగా కమీషన్లు ఇచ్చుకోలేమని, స్థానిక ప్రజా ప్రతినిధుల వేధింపులు ఆపాలనే డిమాండ్లు లేవనెత్తారు.

ఈ వార్తలనూ చదవండి...

నెల్లూరులో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు

రాయలసీమ అభివృద్ధి సభలో రాజకీయాలు వద్దు: పవన్ కల్యాణ్

Updated Date - Oct 12 , 2026 | 05:19 AM