తప్పు జరిగింది.. సరిచేస్తాం!
ABN , Publish Date - Sep 23 , 2026 | 04:44 AM
చిత్తూరు జిల్లా గుడుపల్లి మండలం పొగురుపల్లి వద్ద చేపట్టిన 220 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణం, కుప్పం నుంచి పొగురుపల్లి 10 కి.మీ. మేర 220 కేవీ డబుల్ లైన్ నిర్మాణ టెండర్‌లో కేవలం వాహనాల ఖర్చే రూ.67 లక్షలుగా పేర్కొనడంపై ట్రాన్స్‌కో అధికారులు వివరణ ఇచ్చారు.
‘ప్రజల సొమ్ము కార్ల పాలు’.. కథనంపై ట్రాన్స్‌కో వివరణ... ‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన
అమరావతి, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా గుడుపల్లి మండలం పొగురుపల్లి వద్ద చేపట్టిన 220 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణం, కుప్పం నుంచి పొగురుపల్లి 10 కి.మీ. మేర 220 కేవీ డబుల్ లైన్ నిర్మాణ టెండర్‌లో కేవలం వాహనాల ఖర్చే రూ.67 లక్షలుగా పేర్కొనడంపై ట్రాన్స్‌కో అధికారులు వివరణ ఇచ్చారు. సెప్టెంబరు 11న జారీచేసిన టెండరులో తప్పు గుర్తించామని, దానికి సవరణ జారీచేసి తప్పును సరిదిద్దుతామని పేర్కొన్నారు. ఇక నెల్లూరు జిల్లా అనంతసాగరం సబ్‌స్టేషన్ నిర్మాణ సమయంలో అధికారులు తమ టూర్‌డైరీలో 35 వేల కి.మీ. వాహనాల్లో తిరిగినట్లు చూపి, ఎంబుక్‌లో మాత్రం 90వేల కి.మీ. తిరిగినట్లు చూపారు. దీనిపై అధికారులు వివరణ ఇస్తూ.. 6 గంటలకుపైగా సాగిన ప్రయాణాలను మాత్రమే టూర్ డైరీలో పేర్కొంటామని, దానివల్ల టూర్‌డైరీలో పేర్కొన్న అంశాలు ఎంబుక్‌లో ఉన్న వివరాలతో సరిపోలకపోవచ్చని చెప్పారు. పొగురుపల్లి సబ్‌స్టేషన్‌కు వచ్చేసరికి దీనికి భిన్నమైన వివరణ ఇవ్వడం గమనార్హం.
ఈ వార్తలనూ చదవండి...
పాదగయలో విషాదం.. పుష్కరిణిలో స్నానానికి దిగి యువకుడి గల్లంతు..
సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం