బోధనాసుపత్రుల్లో మల్టీ స్పెషాలిటీ సేవలు!
ABN , Publish Date - Oct 15 , 2026 | 05:01 AM
రాష్ట్రంలోని బోధనాసుపత్రుల్లో మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ఆరోగ్యశాఖ సన్నాహాలు ప్రారంభించింది. ఈ క్రమంలో తొలుత ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్(ఐసీయూ) స్థాయిని పెంచేందుకు సిద్ధమైంది.
లెవల్-3 ఐసీయూల ఏర్పాటు.. రోగికి మరింత అందుబాటులో వైద్యం
తొలుత నాలుగు ఆసుపత్రుల ఎంపిక.. రూ.10 కోట్లతో లెవల్-3 ఐసీయూలు
ఆరోగ్యశాఖ ప్రతిపాదనలకు సర్కారు ఓకే.. భవిష్యత్తులో అవయవ మార్పిడికి చాన్స్
అమరావతి, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని బోధనాసుపత్రుల్లో మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ఆరోగ్యశాఖ సన్నాహాలు ప్రారంభించింది. ఈ క్రమంలో తొలుత ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్(ఐసీయూ) స్థాయిని పెంచేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం రాష్ట్రంలోని డీఎంఈ పరిధిలో 40 ఆస్పత్రులున్నాయి. వీటిలో నిబంధనల ప్రకారం లెవల్-1 ఐసీయూలు 25, లెవల్-2 ఐసీయూలు 11, లెవల్-3 ఐసీయూలు 6 ఉండాలి. కానీ, ప్రస్తుతం లెవల్-1 ఐసీయూలు 16, లెవల్-2 ఐసీయూలు 5.. మొత్తంగా 21 మాత్రమే ఉన్నాయి. వీటిలో రోగులకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించడం కూడా సాధ్యం కావడం లేదు. పైగా, అవయవ మార్పిడిని పెద్ద ఎత్తున చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
మరోవైపు సుప్రీంకోర్టు, హైకోర్టులు కూడా బోధనాసుపత్రుల్లో లెవల్-3 ఐసీయూల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ఐసీయూలను బలోపేతం చేస్తూనే లెవల్-3 ఐసీయూలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. తొలుత దాదాపు రూ.10.80 కోట్ల వ్యయంతో విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, అనంతపురంలో వీటి నిర్మాణానికి ఆరోగ్యశాఖ ప్రతిపాదనలు చేయగా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వచ్చే ఏడాది జూలై నాటికి ఆ 4 జిల్లాల్లోని బోధనాసుపత్రుల్లో లెవల్-3 ఐసీయూల నిర్మాణం పూర్తి చేసి, సిబ్బంది నియామకం చేపట్టనున్నారు.
మల్టీ స్పెషాలిటీ సేవలు..
లెవల్-3 ఐసీయూలు అందుబాటులోకి వస్తే రోగులకు మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు అందుతాయి. అలాగే, కార్డియాలజీ, కార్డియో థెరాసిక్ సర్జరీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, నెఫ్రాలజీ, యూరాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఎండోక్రైనాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీతో పాటు ఆర్గానిక్ ట్రాన్స్ప్లాంటేషన్కు అనుబంధంగా ఉన్న స్పెషాలిటీ వైద్యులు అందుబాటులోకి వస్తారు. ముఖ్యంగా ఎక్మో సపోర్టు కూడా అందుబాటులోకి వస్తుంది. ఎక్మో సపోర్టు పరికరాలు ఉంటే మల్టీ ఆర్గాన్ ఫెయిల్ అయిన రోగులను కూడా ప్రాణాపాయం నుంచి రక్షించే అవకాశం ఉంటుంది. అలాగే, మల్టీ స్పెషాలిటీ వైద్య పరికరాలు కూడా అందుబాటులోకి వస్తాయి.
తేడా ఏమిటి?..
లెవల్-1, లెవల్-2, లెవల్-3 ఐసీయూల మధ్య చాలా తేడా ఉంది. లెవల్-1 ఐసీయూల్లో రోగికి ప్రాథమిక సపోర్ట్ ఉంటే సరిపోతుంది. లెవల్-2 ఐసీయూల్లో స్పెషాలిటీ వైద్యులు అందుబాటులో ఉంటారు. ప్రతి ఇద్దరు రోగులకు ఒక నర్సును కేటాయిస్తారు. వెంటిలేటర్లు, ఇతర అధునిక వైద్య పరికరాలను అందుబాటులో ఉంచుతారు. ఏదైనా ఒక అవయవం దెబ్బతిన్న రోగిని ప్రాణాపాయం నుంచి బయటపడేసే విధంగా లెవల్-2 ఐసీయూలను సంసిద్ధంగా ఉంచుతారు. ఇక, లెవల్-3 ఐసీయూల్లో ఎంతో తీవ్రమైన పరిస్థితిలో ఉన్న రోగిని కూడా బతికించే విధంగా ఏర్పాట్లు ఉంటాయి. ఒక రోగికి ఒక నర్సును కేటాయిస్తారు. 24 గంటల పాటు వైద్యులు, నర్సుల పర్యవేక్షణ ఉంటుంది. దీంతో రోగికి ఎప్పటికప్పుడు వైద్యం అందుతుంది.
ఈ వార్తలనూ చదవండి:
ఆటోమేటిక్ వర్క్ పర్మిట్ ఎక్స్టెన్షన్ రద్దు.. అమెరికా ప్రభుత్వం వెల్లడి
హోర్ముజ్ జలసంధిలో మైన్ను ఢీకొని కార్గో నౌక మునక..