ఏపీలో సాయంకాలం కోర్టులు
ABN , Publish Date - Nov 12 , 2026 | 01:34 AM
దేశంలోని న్యాయస్థానాల్లో దశాబ్దాలుగా పేరుకుపోతున్న వ్యాజ్యాల సమస్యకు ముగింపు పలకాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
పెండింగ్ కేసుల పరిష్కారమే లక్ష్యం
ఢిల్లీ, బిహార్‌లో కూడా ఏర్పాటు : కేంద్రం
న్యూఢిల్లీ, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి) : దేశంలోని న్యాయస్థానాల్లో దశాబ్దాలుగా పేరుకుపోతున్న వ్యాజ్యాల సమస్యకు ముగింపు పలకాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెండింగ్ కేసుల పరిష్కారం లక్ష్యంగా సాయంకాలం కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, బిహార్‌ల్లో తొలుత ప్రయోగాత్మకంగా (పైలట్ ప్రాతిపదికన) ఈ కోర్టులను ఏర్పాటుచేయనున్నారు. ఫలితాలను బట్టి తర్వాతి కాలంలో దేశమంతటికీ సాయంకాలం కోర్టులను విస్తరిస్తారు. ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి (స్వతంత్ర హోదా) అర్జున్ రామ్ మేఘ్‌వాల్ ఓ జాతీయ ఇంగ్లిష్ పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా.. సాధారణ వేళల తర్వాత కూడా కోర్టులు అదనంగా కొన్ని గంటల పాటు పనిచేస్తాయి. కేవలం పెండింగ్‌లో ఉన్న మామూలు కేసుల విచారణను చేపట్టి వేగంగా పరిష్కరిస్తాయి. కోర్టులపై ఇప్పటికే ఉన్నఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని, సాయంత్రపు కోర్టుల నిర్వహణ కోసం రిటైర్డ్ జడ్జీల సేవలను వినియోగించుకోవాలని కేంద్రం నిర్ణయించింది.
లోక్ అదాలత్‌లూ బలోపేతం..
సాయంకాలం కోర్టుల ఏర్పాటుతోనే సరిపెట్టకుండా, ఇతర ప్రత్యామ్నాయ మార్గాలపై కూడా కేంద్రం గట్టిగా దృష్టి సారించింది. లోక్ అదాలత్‌లు, ప్రత్యామ్నాయ వివాద పరిష్కార వేదికల (ఏడీఆర్) ద్వారా వీలైనన్ని ఎక్కువ వ్యాజ్యాలను రాజీ మార్గంలో పరిష్కరించనున్నట్టు మంత్రి తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
ఇదే స్ఫూర్తితో స్వచ్ఛాంధ్ర సాధనకు అంతా కలిసి పనిచేద్దాం: సీఎం చంద్రబాబు
15 ఏళ్ల తర్వాత లంచం కేసులో తీర్పు.. మాజీ సీఐకి ఏడాది జైలు